క్రీడాభూమి

హోం గ్రౌండ్‌లో ఓడిన బెంగళూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 11: ఈసారి ఐపిఎల్‌ను నిష్క్రమించడం దాదాపు ఖాయమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్‌లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడింది. లోకేష్ రాహుల్ అర్ధ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో బెంగళూరు నాలుగు వికెట్లకు 151 పరుగులు చేయగలిగింది. ముంబయి ఈ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో ఛేదించింది. అంబటి రాయుడు బాధ్యతాయుతంగా ఆడి 44 పరుగులు చేసి, ముంబయి ఇన్నింగ్స్‌కు పునాది వేయగా, చివరిలో కీరన్ పోలార్డ్, జొస్ బట్లర్ విజృంభణ విజయాన్ని సాధించిపెట్టింది.
ఫీల్డింగ్‌పై రోహిత్ మొగ్గు
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపగా, ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బెంగళూరు కేవలం 8 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. ఏడు బంతులు ఎదుర్కొన్న అతను ఒక సిక్సర్ సాయంతో ఏడు పరుగులు చేసి, మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ చక్కటి క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. ఆరు బంతుల్లో అతను ఐదు పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరును ఆదుకునే బాధ్యతను ఎబి డివిలియర్స్, లోకేష్ రాకేష్ తమ భుజాలపైకి ఎత్తుకున్నారు. రెండో వికెట్‌కు 43 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత కృణాల్ పాండ్య బౌలింగ్‌లో అంబటి రాయుడుకు చిక్కిన డివిలియర్స్ 27 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఒక ఫోర్, మరో సిక్సర్ ఉన్నాయి. అనంతరం షేన్ వాట్సన్‌తో కలిసి రాహుల్ స్కోరును పెంచేందుకు శ్రమించాడు. నాలుగో వికెట్‌కు 38 పరుగులు జత కలిసిన తర్వాత వాట్సన్ రనౌటయ్యాడు. 14 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసిన అతను పెవిలియన్ చేరిన తర్వాత సచిన్ బేబీ సాయంతో రాహుల్ బెంగళూరు స్కోరును 150 పరుగుల మైలురాయిని దాటించాడు. 20 ఓవర్లకు బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. 53 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులతో రాహుల్, 13 బంతుల్లో, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసిన సచిన్ బేబీ నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో టిమ్ సౌథీ, మెక్‌క్లీనగన్, కృణాల్ పాండ్య తలా ఒక వికెట్ పడగొట్టారు.
పటేల్ మళ్లీ విఫలం
ముంబయి ఇన్నింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా ప్రారంభం కాలేదు. ఇటీవల అంతగా రాణించలేకపోతున్న పార్థీవ్ పటేల్ మరోసారి విఫలమయ్యాడు. అతను కేవలం ఒక పరుగు చేసి, శ్రీనాథ్ అరవింద్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్‌కు దొరికిపోయాడు. అరవింద్ ఈ ఇన్నింగ్స్‌లో వేసిన తన మొదటి బంతికే వికెట్ సాధించడం విశేషం. రోహిత్ శర్మ, అంబటి రాయుడు క్రీజ్ వద్ద నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. వీరు 8.2 ఓవర్లలో 58 పరుగులు జత చేశారు. 24 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 25 పరుగులు చేసిన రోహిత్‌ను డివిలియర్స్ క్యాచ్ పట్టగా వరుణ్ ఆరోన్ పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్‌కు 19 పరుగులు జత కలిసిన తర్వాత యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో స్టువర్ట్ బిన్నీకి చిక్కిన నతిష్ రాణా (9) వెనుదిరిగాడు. రాణా వికెట్ పతనంతో క్రీజ్‌లోకి వచ్చిన కీరన్ పోలార్డ్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే జట్టును గెలిపించే బాధ్యతను స్వీకరించి, ఎంతో సహనంతో ఆడిన అంబటి రాయుడు 47 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి డివిలియర్స్ క్యాచ్ అందుకోగా వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. పోలార్డ్‌కు జత కలిసిన బట్లర్ కూడా ధాటిగా ఆడడంతో ముంబయి విజయపథంలో దూసుకెళ్లింది. క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టుకున్న ముంబయి, చివరి రెండు ఓవర్లలో విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచింది. వరుణ్ ఆరోన్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని జొస్ బట్లర్ సిక్సర్‌గా మలచి, ముంబయిని గెలిపించాడు. 18.4 ఓవర్లలో ముంబయి 4 వికెట్లకు 153 పరుగులు సాధించి విజయభేరి మోగించింది. అప్పటికి జొస్ బట్లర్ 11 బంతుల్లో 29 (ఒక ఫోర్, మూడు సిక్సర్లు), పోలార్డ్ 19 బంతుల్లో 35 (మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 20 ఓవర్లలో 4 వికెట్లకు 151 (డివిలియర్స్ 24, లోకేష్ రాహుల్ 68 నాటౌట్, వాట్సన్ 15, సచిన్ బేబి 25 నాటౌట్).
ముంబయి ఇండియన్స్: 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 153 (రోహిత్ శర్మ 25, అంబటి రాయుడు 44, కీరన్ పోలార్డ్ 35 నాటౌట్, జొస్ బట్లర్ 29 నాటౌట్).

సమయోచిత బ్యాటింగ్‌తో ముంబయ ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాయుడు

బెంగళూరు వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దారుణమైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్ సహా మొత్తం ఏడు సార్లు ముంబయిని ఢీకొన్న ఈ జట్టు కేవలం ఒక విజయాన్ని నమోదు చేసింది. ఆరు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది. హోం గ్రౌండ్‌లో బెంగళూరు మరే ఇతర జట్టు చేతిలోనూ ఇన్నిసార్లు ఓటమిపాలుకాలేదు.