క్రీడాభూమి

ఆధిపత్యమే చెన్నై లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 25: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అవసరమైన 16 పాయింట్లను దక్కించుకున్నప్పటికీ, శుక్రవారం ముం బయి ఇండియన్స్‌తో జరిగే పోరులో ఆధిపత్యం కనబరచడమే లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ఈ జట్టు ఇంత వరకూ 11 మ్యాచ్‌లు ఆడింది. మూడు పరాజయాలను చవిచూసింది. ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సంపాదించి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబయి ఇండియన్స్ 10 మ్యాచ్‌ల్లో ఆరింటిని తన ఖాతాలో వేసుకొని, 12 పాయింట్లు సంపాదించింది. నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది. కాగితంపై చూస్తే చెన్నైకి సమతూకంగా నిలిచే సత్తావున్న ముంబ యి జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్లే ఆఫ్ దిశగా, వేగంగా అడుగులు వేస్తున్నది. క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్య, కృణాల్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, బెన్ కట్టింగ్ వంటి సమర్థులు ఈ జట్టులో ఉన్నారు. అయితే, ముంబయితో పోలిస్తే చెన్నైలో స్టార్లు ఎక్కువ మంది కనిపిస్తారు. కెప్టెన్ ధోనీ, స్టాండ్‌బై కెప్టెన్ సురేష్ రైనా, అంబటి రాయుడు, గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయాన్ని అందించిన షేన్ వాట్సన్, ఫఫ్ డు ప్లెసిస్, మురళీ విజయ్, కేదార్ జాధవ్, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్ వంటి హేమాహేమీలతో చెన్నై జట్టు నిండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేసుకోవడం కెప్టెన్ ధోనీకి సవాలుగా పరిణమిస్తున్నది. ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూ, తీవ్ర విమర్శలకు గురైన వాట్సన్ కూడా మళ్లీ ఫామ్‌లోకి రావడం, విన్నింగ్ నాక్‌తో అదరగొట్టడం చెన్నైకి కలిసొచ్చే అంశాలు. పైగా మ్యాచ్ హోం గ్రౌండ్ లో జరగడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తున్నది. అదే సమయంలో, లోకల్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన అంచనాలు ఉన్న కారణంగా, చెన్నై ఆటగాళ్లపై ఒత్తిడి తప్పదనే చెప్పాలి. అంతేగాక, బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఆ జట్టుకు ఉంది. దీనితో ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి. ఈ మార్పులుచేర్పుల ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రశ్న. కాగా, ముంబయి కూడా ప్లే ఆఫ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, చెన్నైకి ఆ జట్టు నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు. తనదైన రోజున, ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు ఉంది.
వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. కీరన్ పోలార్డ్ ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే ముంబయికి అంత మేలు జరుగుతుంది. మొత్తం మీద రెండు జట్లూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో, శుక్రవారం నాటి పోరు ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తున్నది.
ముంబయ ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సారథులు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ (ఫైల్ ఫొటో)