క్రీడాభూమి

కోర్టుకెక్కిన సుశీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోసం నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఒకరిని రియో ఒలింపిక్స్‌కు పంపే అవకాశం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)కి ఉంది. అయితే, ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌కు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో సుశీల్‌కు చోటు కల్పించకపోవడంతో, నర్సింగ్ పంచమ్ యాదవ్ పేరు దాదాపుగా ఖాయమైంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తర్వాత అంతర్జాతీయ టోర్నీలకు హాజరుకాలేదు. వివిధ కారణాలను చూపుతూ గైర్హాజరుకావడం అతనికి అలవాటుగా మారింది. మరోవైపు నర్సింగ్ 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఏడాది దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో, లాస్ వెగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలను అందుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న నర్సింగ్‌ను రియోకు పంపాలన్న డిమాండ్ వినిపిస్తుండగా, రెండు ఒలింపిక్స్‌లో పాల్గొని, ఇండివిజువల్ ఈవెంట్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించిన తనకే అవకాశం దక్కాలని సుశీల్ వాదిస్తున్నాడు. తామిద్దరి మధ్య ట్రయల్ బౌట్‌ను నిర్వహించి, గెలిచిన వారిని రియో పంపాలని కూడా అతను సూచించాడు. అయితే, డబ్ల్యుఎఫ్‌ఐ అతని ప్రతిపాదనపై స్పందించలేదు. ఒలింపిక్స్‌లో 74 కిలోల విభాగంలో పోటీపడే రెజ్లర్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఒకవైపు ప్రకటిస్తున్నా, మరోవైపు సుశీల్‌కు శిక్షణ శిబిరంలో అవకాశం కల్పించకుండా తన ఆంతర్యాన్ని చెప్పకనే చెప్పింది. కాగా, ట్రయల్ బౌట్‌ను నిర్వహించే విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులకు సుశీల్ లేఖలు రాశాడు. అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాడు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే వారిని ఎంపిక చేసేందుకు తప్పనిసరిగా ట్రయల్స్‌ను నిర్వహిస్తారని, అదే సూత్రాన్ని రెజ్లింగ్‌కు కూడా వర్తింప చేయాలని అతను కోరాడు. అయితే, ప్రపంచ చాంపియషిప్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించడం ద్వారా నర్సింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడని, ప్రత్యేకంగా ట్రయల్ బౌట్‌ను జరపాల్సిన అవసరం లేదని డబ్ల్యుఎఫ్‌ఐ వాదించే అవకాశాలు ఉన్నాయి. లండన్ ఒలింపిక్స్ అనంతరం అంతర్జాతీయ రెజ్లింగ్ నుంచి దాదాపుగా కనుమరుగైన సుశీల్ హఠాత్తుగా తెరపైకి వచ్చి, రియో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశాన్ని కల్పించాలని కోరడం విచిత్రంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జోక్యం చేసుకోం: సోనోవాల్
పటియాలా: నర్సింగ్ యాదవ్, సుశీల్ కుమార్‌లలో ఎవరిని రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేస్తారనే అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ స్పష్టం చేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ తుది నిర్ణయం తీసుకుంటుందని, అందులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు. ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిబిరాన్ని సోమవారం సందర్శించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఆయా క్రీడా సమాఖ్యలకే ఉంటుందని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని అన్నారు.