క్రీడాభూమి

అద్భుతాల కూన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్‌డౌన్ -8
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ‘పసికూన’ అఫ్గానిస్తాన్ అద్భుతాలు సృష్టిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. అయితే, ఒకప్పుడు శ్రీలంక, ఆతర్వాత బంగ్లాదేశ్ మాదిరిగానే ఈ మెగా టోర్నీలో అనూహ్య విజయాలను నమోదు చేసి, ‘జెయింట్ కిల్లర్’గా ఎదిగే అవకాశాలు లేకపోలేదు. 1999 వరకూ అఫ్గానిస్తాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో సభ్యత్వం పొందేందుకు అవసరమైన ప్రమాణాలు లేవు. 2003లో ఐసీసీలో సభ్యత్వం వచ్చినప్పటికీ, అప్పటికే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. దీనితో అఫ్గానిస్తాన్ 2007లో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడే అవకాశం దక్కింది. అయితే, ఆ ఏడాదితోపాటు 2011లోనూ క్వాలిఫయర్స్ ఆడిందిగానీ, అర్హత సంపాదించ లేకపోయింది. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకున్న అఫ్గానిస్తాన్ 2015 వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించింది. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో, ప్రత్యేకించి మెగా ఈవెంట్స్‌లో ఆడిన అనుభవం అంతగా లేకపోవడంతో, ఆ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. మొత్తం ఆరు గ్రూప్ మ్యాచ్‌లు ఆడిన అఫ్గాన్ ఐదు పరాజయాలను చవిచూసింది. స్కాట్‌లాండ్‌పై విజయాన్ని నమోదు చేసింది. కాగా, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు అఫ్గాన్ అన్ని విధాలుగా బలపడింది. ఐసీసీ టెస్టు హోదాను దక్కించుకుందంటే, ఈ జట్టు ఎదుగుదలను అంచనా వేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌పై టీ-20 మ్యాచ్‌లో మూడు వికెట్లకు 278 పరుగులు సాధించి అఫ్గాన్ సత్తా చాటింది. ఈ ఫార్మాట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనడానికి ఇదో కారణం. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన తర్వాత వివిధ జట్ల ప్రదర్శనతో పోలిస్తే అఫ్గాన్ క్రికెట్ జట్టు శరవేగంతో ఎదిగింది. టీ-20 ఫార్మాట్‌లో 71 మ్యాచ్‌లు ఆడి, 49 విజయాలు నమోదు చేసింది. 22 పరాజయాలను ఎదుర్కొంది. అదే విధంగా 113 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడింది. 58 మ్యాచ్‌లను సొంతం చేసుకుంది. 51 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒక వనే్డ ‘టై’గా ముగియగా, మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. మొత్తం మీద రెండు ఫార్మాట్లలోనూ స్థూలంగా చూస్తే, అఫ్గాన్ జట్టు ఎదుర్కొన్న పరాజయాల కంటే సాధించిన విజయాలే ఎక్కువ. ఈసారి వరల్డ్ కప్‌లో సంచలన విజయాలు నమోదు చేసే సత్తా ఉన్న జట్ల జాబితాలో అఫ్గాన్ పేరు అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. గుల్బదీన్ నయిబ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఈ జట్టు చేతిలో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ రూపంలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఈ యువ స్పిన్నర్ ఇప్పటికే తన అసాధారణ ప్రతిభతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. మహమ్మద్ షాజాద్, రహ్మత్ షా, హస్మతుల్లా షహిదీ, అస్గర్ అఫ్గాన్ వంటి బ్యాట్స్‌మన్ అఫ్గానిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నుముకగా నిలుస్తారు. ఓపెనర్ షాజాద్‌ను హార్డ్ హిట్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. 31 ఏళ్ల షాజాద్ ఖాతాలో 13 అర్ధ శతకాలు, ఐదు శతకాలు ఉన్నాయి. అతను దాడికి దిగితే, స్కోరుబోర్డు పరుగులు తీయడం ఖాయం. మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, కెప్టెన్ గుల్బదీన్, సమీయుల్లా షెన్వారీ, అఫ్తాబ్ ఆలం ఆల్‌రౌండర్లుగా జట్టుకు సేవలు అందిస్తున్నారు. వీరిలో నబీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కాగా, రషీద్ ఖాన్, గుల్బదీన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా జట్టు బలాన్ని పెంచుతున్నారు. 2016 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఒక్కటి కూడా ఆడని హమీద్ హసన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. అతడిని సెలక్టర్లు ఏ ఉద్దేశంతో వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ప్రత్యర్థి జట్టును బట్టి ఉంటుందని కోచ్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమ్మన్స్ స్పష్టం చేస్తున్నాడు. వరల్డ్ కప్‌లో తమ ఉనికిని చాటుకుంటామని, నాకౌట్ దశకు చేరడమే తమ తొలి లక్ష్యమని అంటున్నాడు. అతని అంచనాల మేరకు అఫ్గాన్ జట్టు రాణించగలుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
*
వరల్డ్ కప్‌లో అఫ్గాన్ ఆడే మ్యాచ్‌లు
*
తేదీ ప్రత్యర్థి జట్టు వేదిక
*
జూన్ 1 ఆస్ట్రేలియా బ్రిస్టల్ కౌంటీ క్లబ్, బ్రిస్టల్
జూన్ 4 శ్రీలంక కార్డ్ఫి వేల్స్ స్టేడియం, కార్డ్ఫి
జూన్ 8 న్యూజిలాండ్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్, టాన్టన్
జూన్ 15 దక్షిణాఫ్రికా కార్డ్ఫి వేల్స్ స్టేడియం, కార్డ్ఫి
జూన్ 18 ఇంగ్లాండ్ ఓల్డ్ ట్రాఫోర్ట్, మాంచెస్టర్
జూన్ 22 భారత్ హామ్స్‌షైర్ బౌల్, సౌతాంప్టన్
జూన్ 24 బంగ్లాదేశ్ హామ్స్‌షైర్ బౌల్, సౌతాంప్టన్
జూన్ 29 పాకిస్తాన్ హెడింగ్లే, లీడ్స్
జూలై 4 వెస్టిండీస్ హెడింగ్లే, లీడ్స్