క్రీడాభూమి

‘పవర్ ప్లే’కు శ్రీలంకకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో పవర్ ప్లేకు శ్రీకారం చుట్టిన ఘనత శ్రీలంకకు దక్కుతుంది. దీనికి ఆద్యుడు లంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్య. అనామక జట్టుగా అడుగుపెట్టిన లంకకు 1996లో ఏకంగా ప్రపంచ కప్ టైటిల్‌ను అందించిన ఘనత అతనిదే. అర్జున రణతుంగ స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీ, అరవింద డి సిల్వ ఆల్‌రౌండ్ ప్రతిభ జట్టు విజయానికి దోహదం చేసినప్పటికీ, మ్యాచ్ ఫలితాలను ఒంటి చేత్తో మార్చేయగల సత్తావున్న ఆటగాడిగా జయసూర్య గుర్తింపు సంపాదించాడు. అతను బ్యాట్‌లో స్ప్రింగ్స్ ఉంటాయని, నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడతాడని పుకార్లు అప్పట్లో షికార్లు చేశాయి. ఆ విమర్శలకు ఎలాంటి విలువ లేదన్నది నిజం. అంతకాలం, వనే్డ ఫార్మాట్‌లో మొదట నిదానంగా ఆడడం, స్లాగ్ (చివరి) ఓవర్లలో పరుగుల వేట ఆరంభించడం దాదాపుగా ప్రతి జట్టూ అనుసరించిన విధానం. కానీ, రెండు దశాబ్దాలకుపైగా గొప్ప వ్యూహంగా అనుకునే స్లాగ్ ఓవర్లలో దాడులకు ఏ మాత్రం విలువ లేదని 1996 వరల్డ్ కప్‌లో జయసూర్య తన ఆటతో రుజువు చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన మరుక్షణం నుంచే వీర బాదుడు మొదలుపెట్టి, కొత్త ఒరవడి సృష్టించాడు. మ్యాచ్ ఆరంభంలోనే భారీ స్కోరుకు పునాది వేస్తే, స్లాగ్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉండదన్న అతని సిద్ధాంతం ఇప్పుడు అన్ని దేశాలకూ ఆచరణీయమైంది. ఈ విధంగా వరల్డ్ కప్‌లోనేగాక, వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లోనూ కొత్త సిద్ధాంతానికి శ్రీకారం చుట్టిన శ్రీలంక మిగతా జట్లకు మార్గదర్శకమైంది.
‘పసికూన’గా మొదలు
నిజానికి, అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ అనుభవం లేని రోజుల్లో, 1975లో శ్రీలంక ‘పసికూన’ జట్టులో తొలి వరల్డ్ కప్‌లో ఆడింది. అనుకున్న విధంగానే గ్రూప్ దశకే పరిమితమైంది. 1979, 1983, 1987, 1992 సంవత్సరాల్లోనూ అదే తీరు కొనసాగింది. శ్రీలంక అనే జట్టు ఒకటి వరల్డ్ కప్‌లో ఆడుతున్నదనే విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. 1996లోనూ, గతంలో మాదిరిగానే ‘అండర్ డాగ్’ ట్యాగ్‌తో లంక ప్రపంచ కప్‌లోకి అడుగుపెట్టింది. గ్రూ ప్ దశలో ఆస్ట్రేలియా, భారత్, వెస్టిండీస్, జింబాబ్వే, కెన్యా జట్లను ఢీకొంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసి, సంచలనం సృష్టించింది. క్వా ర్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి, అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 235 పరుగులు చేస్తే, శ్రీలంక 5 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని ఛేదించి, ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అభిమానుల ఆగ్రహం
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సెమీ ఫైనల్లో భారత ఆటగాళ్లపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 8 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఈ సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ నత్తనడకన సాగుతూ, వికెట్లు చేజార్చుకుంది. దీంతో ఆగ్రహించిన అభిమానులు స్టేడియంలో గలభా సృష్టించారు. కొంతసేపు ఆటకు అంతరాయం కలిగిన తర్వాత, మళ్లీ మొదలుపెట్టినా ఫలితం లేకపోయింది. భారత్ 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో అభిమానుల్లో ఆ గ్రహం పెల్లుబికింది. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారు, మైదానంలోకి సీసాలు, కర్రలు విసిరారు. స్టాండ్స్‌లో కుర్చీలను దగ్ధం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, ఆటను నిలిపివేసిన అంపైర్లు శ్రీలంకను విజేతగా ప్రకటించారు. అదృష్టవశాత్తు ఫైన ల్ చేరిందన్న విమర్శలను శ్రీలంక సమర్థంగా తిప్పికొట్టింది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాను ఫైనల్లో 7 వికె ట్ల తేడాతో చిత్తుచేసి, వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చే స్తే, శ్రీలంక 3 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఫైన ల్లో అరవింద డిసిల్వా 124 బంతుల్లో 107 పరుగులు చేసి, లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మళ్లీ పతనం..
ప్రపంచ కప్‌ను గెలిచిన ఆనందంతో, మరోసారి దానిని దక్కించుకోవాలన్న పట్టుదలతో 1999లో మైదానంలోకి దిగిన శ్రీలంక మరోసారి తన పాత పద్ధతిలోనే ఆడింది. ఫలితంగా గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. 2003లో బలపడి, సెమీస్ వరకూ చేరింది. కానీ, ఫైనల్లో చోటు సంపాదించుకోలేక పోయింది. 2007, 2011 సంవత్సరాల్లో రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. ఆతర్వాత కాలంలో తలెత్తిన సమస్యలు లంక ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా 2015 వరల్డ్ కప్‌లో ఈజట్టు ప్రస్థానం క్వార్టర్ ఫైనల్స్‌తో ముగిసింది. పరిస్థితి చెప్పుకోదగిన రీతిలో మారకపోవడంతో, ఈసారి ఏ విధంగా ఆడుతుంది? ఎంత వరకూ ముందంజ వేస్తుంది? అనే ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రెండుసార్లు ఫైనల్‌కు..

శ్రీలంక జట్టు 2007లో ఫైనల్ చేరినప్పటికీ, ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. 2011లో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే, భారత్ చేతిలో ఓటమిపాలైంది. గత రెండేళ్ల కాలంలో లంక జట్టు మరింతగా దిగజారింది. సుమారు రెండున్నర సంవత్సరాల కాలంలో జట్టుకు ఆరుగురు కెప్టెన్లు మారారు. జట్టులో నిలకడ లోపించడానికి ఇది ప్రధాన కారణం. సెలక్షన్ కమిటీ వ్యవహార శైలి కారణంగా, జట్టులో ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప, జట్టు ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆటగాళ్ల పైనుంచి ఈ ఒత్తిడిని తొలగించడానికి లంక క్రికెట్ బోర్డు, అక్కడి జాతీయ సెలక్షన్ కమిటీ తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే, వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ టోర్నీల్లో జట్టు గొప్పగా ఆడుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.