క్రీడాభూమి

ఫించ్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 15: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇచ్చిన పంచ్‌కి ఓపెనర్‌గా వచ్చిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే దీటైన సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్న అతను లంకను గెలిపించడానికి ఎంతో కష్టపడ్డాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరెరా కూడా అర్ధ శతకం నమోదు చేశాడు. వీరు క్రీజ్‌లో ఉన్నప్పుడు ఆసీస్‌పై లంక విజయావకాశాలు కనిపించాయ. కానీ, వారు ఔటైన తర్వాత మిగతా వారు విఫలం కావడంతో లంక 247 పరుగులకు ఆలౌటై, 87 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్ అంతకు ముందు 7 వికెట్లకు 334 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన లంక బౌలింగ్‌ను ఎంచుకుంది. దీనితో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. తొలి వికెట్‌కు 80 పరుగులు నమోదైన తర్వాత వార్నర్ వికెట్ కూలింది. తన సహజ సిద్ధమైన ఆటకు భిన్నంగా, ఎక్కువ భాగం రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, ఫించ్‌కు చక్కటి సహకారాన్ని అందించిన అతను 48 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగిన ఉస్మాన్ ఖాజా 20 బంతుల్లో కేవలం 10 పరుగులు చేసి, ధనంజ డి సిల్వ బౌలింగ్ ఇసురు ఉడానాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 100 పరుగుల వద్ద ఆసీస్ రెండ వికెట్ కూలింది. ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌తో కలిసిన ఫించ్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 173 పరుగులు జోడించి ఆసీస్‌ను మెరుగైన స్థితిలో నిలబెట్టారు. నువాన్ ప్రదీప్ వేసిన ఇన్నింగ్స్‌లోని 45వ ఓవర్‌లో చెలరేగిపోయిన ఫించ్ 22 పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని ఫోర్ కొట్టిన అతను రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు. మూడోది డాట్‌బాల్‌కాగా, ఆతర్వాత మూడు బంతుల్లోనూ ఫించ్ బౌండరీలు సాధించాడు.
మొత్తం 132 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 153 పరుగులు సాధించి, ఇసురు ఉడానా బౌలింగ్‌లో దిముత్ కరుణరత్నే క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. ఆసీస్ కెప్టెన్ క్యాచ్‌ని లంక కెప్టెన్ కరుణరత్నే అందుకోవడం విశేషం. తర్వాత కొద్ది సేపటికే స్మిత్ వికెట్ కూడా కూలింది. అతను 59 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు సాధించి లసిత్ మలింగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షాన్ మార్ష్ (3), వికెట్‌కీపర్ అలెక్స్ కారీ (4), పాట్ కమిన్స్ (0) త్వరత్వరగా ఔట్‌కాగా, ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 334 పరుగులు సాధించింది. అప్పటికి గ్లేన్ మాక్స్‌వెల్ (25 బంతుల్లో, 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46), మిచెల్ స్టార్క్ (4 బంతుల్లో 5) క్రీజ్‌లో ఉన్నారు.
ఓపెనర్లు రాణించినా...
ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఓపెర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే46 బంతుల్లో, కుశాల్ పెరెరా 33 బంతుల్లో అర్ధ శతకాలను పూర్తి చేశారు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద కుశాల్ పెరెరా (36 బంతుల్లో 52)ను మిచెల్ స్టార్క్ బౌల్డ్ చేయడంతో లంక మొదటి వికెట్ కోల్పోయంది. 16 పరుగులు చేసిన లాహిరు తిరిమానేను అలెక్స్ కారీ క్యాచ్ అందుకోగా జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ పెవిలియన్‌కు పంపాడు. సెంచరీకి చేరువైన దిముత్ కరుణర్నేను 97 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద గ్లేన్ మాక్స్‌వెల్ క్యాచ్ అందుకోగా కేన్ రిచర్డ్‌సన్ ఔట్ చేశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న కరుణరత్నే 108 బంతులు ఎదుర్కొన్నాడు. 8 ఫొర్లు కొట్టాడు. కుశాల్ మేండిస్, ఏంజెలో మాథ్యూస్ క్రీజ్‌లో ఉండగా, 34.3 ఓవర్లలో లంక 200 పరుగుల మైలురాయని చేరింది. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ, సాధించాల్సిన రన్‌రేట్ క్రమంగా పెరగడంతో లంక బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. పాక్ కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ కారీ క్యాచ్ పట్టగా మాథ్యూస్ (9) ఔటయ్యాడు. 205 పరుగులకు లంక నాలుగో వికెట్ చేజార్చుకుంది. మరో 4 పరుగుల తర్వాత మిలింద సిరివర్దన (3)ను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వచ్చీ రావడంతోనే సిక్స్ కొట్టిన తిసర పెరెరా తన స్కోరుకు మరో పరుగు జోడించి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసి, 37 బంతుల్లో 30 పరుగులు చేసిన కుశాల్ మేండిస్‌ను అలెక్స్ కారీ క్యాచ్ పట్టగా, మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఇసురు ఉడానా 8 పరుగులు చేసి, ఆరోన్ ఫించ్ క్యాచ్ అందుకోగా, కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మలింగ ఒక పరుగుకే కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాజాకు చిక్కాడు. నువాన్ ప్రదీప్ పరుగు ల ఖాతా తెరవకుండానే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి దొరకడంతో, లంక ఇన్నింగ్స్‌కు 45.5 ఓవర్లలో 247 పరుగుల వద్ద తెరపడింది. ధనం జయ డి సిల్వ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచా డు. ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో సారి సత్తా చాటింది.
ప్రపంచ కప్‌లో సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో ఫించ్ మూడోవాడు. అయితే, అతని సెంచరీ మాత్రం ఆరోది. 1999లో దక్షిణాఫ్రికాపై లీడ్స్ మైదానంలో స్టీవ్ వా 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్ ఏకంగా నాలుగు పర్యాయాలు ప్రపంచ కప్ టోర్నీల్లో సెంచరీలు బాదాడు. 2003లో శ్రీలంకపై సెంచూరియన్‌లో 114, అదే ఏడాది జొస్‌బర్గ్‌లో భారత్‌పై అజేయంగా 140, 2007లో బాసెటెర్‌లో స్కాట్‌లాండ్‌పై 113, 2011లో భారత్‌పై అహమ్మదాబాద్‌లో 104 చొప్పున పాంటింగ్ పరుగులు సాధించాడు. తాజాగా ఆరోన్ ఫించ్ ఆసీస్ కెప్టెన్ హోదాలో శ్రీలంకపై 153 పరుగులు చేశాడు.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్ బీ ధనంజయ డి సిల్వ 26, ఆరోన్ ఫించ్ సీ దిముత్ కరుణరత్నే బీ ఇసురు ఉడానా 153, ఉస్మాన్ ఖాజా సీ ఇసురు ఉడానా బీ ధనంజయ డి సిల్వ 10, స్టీవెన్ స్మిత్ బీ మలింగ 73, గ్లేన్ మాక్స్‌వెల్ 46 నాటౌట్, షాన్ మార్ష్ సీ మిలింద సిరివర్దన బీ ఇసురు ఉడానా 3, అలెక్స్ కారీ రనౌట్ 4, పాట్ కమిన్స్ రనౌట్ 0, మిచెల్ స్టార్క్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 334.
వికెట్ల పతనం: 1-80, 2-100, 3-273, 4-278,9
5-310, 6-317, 7-320.
బౌలింగ్: లసిత్ మలింగ 10-1-61-1, నువాన్ ప్రదీప్ 10-0-88-0, ఇసురు ఉడానా 10-0-57-2, తిసర పెరెరా 10-0-67-0, ధనంజ డి సిల్వ 8-0-40-2, మిలింద సిరివర్దన 2-0-17-0.
శ్రీలంక: దిముత్ కరుణరత్నే సీ గ్లేన్ మాక్స్‌వెల్ బీ కేన్ రిచర్డ్‌సన్ 97, కుశాల్ పెరెరా బీ మిచెల్ స్టార్క్ 52, లాహిరు తిరిమానే సీ అలెక్స్ కారీ బీ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 16, కుశాల్ మేండిస్ సీ అలెక్స్ కారీ బీ మిచెల్ స్టార్క్ 30, ఏంజెలో మాథ్యూస్ సీ అలెక్స్ కారీ బీ పాట్ కమిన్స్ 9, మిలింద సిరివర్దన బీ మిచెల్ స్టార్క్ 3, తిసర పెరెరా సీ డేవిడ్ వార్నర్ బీ మిచెల్ స్టార్క్ 7, ధనంజయ డి సిల్వ 16 నాటౌట్, ఇసురు ఉడానా సీ ఆరోన్ ఫించ్ బీ కేన్ రిచర్డ్‌సన్ 8, లసిత్ మలింగ సీ ఉస్మాన్ ఖాజా బీ కేన్ రిచర్డ్‌సన్ 1, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 247.
వికెట్ల పతనం: 1-115, 2-153, 3-186, 4-205, 5-209, 6-217, 7-222, 8-236, 9-237, 10-247.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 10-0-55-4, పాట్ కమిన్స్ 7.5-0-38-2, జాసన్ బెహ్రెన్ డార్ఫ్ 9-0-59-1, కేన్ రిచర్డ్‌సన్ 9-1-47-3, గ్లేన్ మాక్స్‌వెల్ 10-0-46-0.
*
చిత్రం...ఫించ్