క్రీడాభూమి

సమరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ను తలపించే యుద్ధానికి ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికకానుంది. ఆదివారం జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌కి చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్ చేతిలో వనే్డ సిరీస్‌ను 0-4 తేడాతో చేజార్చుకున్నందుకు, ఆతర్వాత కూడా వైఫల్యాలను కొనసాగిస్తున్నందుకు ఈ జట్టుపై అభిమానులు మండిపడుతున్నారు. భారత్‌ను ఓడిస్తే, అభిమానులు మిగతా విషయాలను మరచిపోతారని, వరల్డ్ కప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించినప్పటికీ పట్టించుకోరని సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వంలోని పాక్ జట్టుకు తెలుసు. అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆదివారం నాటి మ్యాచ్‌ని కైవసం చేసుకోవడానికి ఆ జట్టు సర్వశక్తులు ఒడ్డనుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఢీకొని, 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాక్, రెండో మ్యాచ్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ఊపిరి పీల్చుకుంది. శ్రీలంకతో బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నాలుగో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడి, 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నిలకడలేమి, వైఫల్యాలపై పెల్లుబుకుతున్న అభిమానుల ఆగ్రహం నుంచి బయటపడాలంటే, భారత్‌ను ఓడించడం ఒక్కటే పాక్ ఆటగాళ్ల ముందున్న ఏకైక మార్గం. అంతేగాక, వరల్డ్ కప్ టోర్నీలో ఇంత వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ భారత్‌ను ఓడించలేకపోయింది. ఈసారైనా పరాజయాల పరంపరకు తెరదించాలన్నది పాక్ మరో లక్ష్యం. ఆ ఆశ ఎంత వరకూ నెరవేరుతుందనేదే ప్రశ్న.
విరాట్ కోహ్లీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత జట్టులో దూకుడు పెరిగింది. సత్వర నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం కోహ్లీ అలవాటు. మైదానంలో అతను స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందిస్తున్న నేపథ్యంలో, మిగతా ఆటగాళ్లు కూడా అతనిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడడాన్ని మినహాయిస్తే, భారత శిబిరంలో పెద్దగా సమస్యలు లేవనే చెప్పాలి.
నాటి నుంచి నేటి వరకు..
ప్రపంచ కప్ 1975లో మొదలైనప్పటికీ, పాక్ తొలిసారి భారత్‌ను 1992లో ఢీకొంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో, 49 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 7 వికెట్లకు 216 పరుగులు సాధించింది. ఓపెనర్ అజయ్ జడేజా 46, కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ 32, సచిన్ తెండూల్కర్ 54, కపిల్ దేవ్ 35 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ముస్తాక్ అహ్మద్ 59 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, అకీబ్ జావేద్ 28 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. వసీం హైదర్‌కు ఒక వికెట్ లభించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అమీర్ సొహైల్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జావేద్ మియందాద్ 40 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లు కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగళ్ శ్రీనాథ్ తలా రెండేసి వికెట్లు కూల్చి, పాక్ పతనాన్ని శాసించారు. సచిన్ తెండూల్కర్, వెంకటపతి రాజు చెరొక వికెట్ పడగొట్టారు.
బెంగళూరు వేదికగా 1996 మార్చి 9న జరిగిన మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించి, పాక్‌పై ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా పాకిస్తాన్ 9 వికెట్లకు 248 పరుగులకే పరిమితమైంది.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 199 జూన్ 8న భారత్, పాక్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 45.3 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌటైంది. 47 పరుగుల తేడాతో గెలిచిన భారత్ వరల్డ్ కప్‌లో పాక్‌ను వరుసగా మూడోసారి ఓడించింది.
సెంచూరియన్‌లో 2003 మార్చి ఒకటిన భారత్, పాక్ జట్లు మైదానంలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 273 పరుగులు సాధించింది. అనంతరం భారత్ 45.4 ఓవర్లలో, కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. వరల్డ్ కప్‌లో పాక్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకుంది.
ఢాకాలో మార్చి 23న పాక్‌తో భారత్ నాకౌట్ దశలో ఢీకొంది. భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి, 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. భారత్ 29 పరుగుల ఆధిక్యంతో గెలిచి, పాక్‌పై ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అడెలైడ్ ఓవల్ మైదానంలో 2015 ఫిబ్రవరి 15న పాక్‌ను భారత్ మరోసారి చిత్తుచేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లకు 300 పరుగులు సాధించింది. పాక్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేక, 47 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. 76 పరుగుల తేడాతో గెలిచిన భారత్ వరల్డ్ కప్‌లో పాక్‌పై అజేయ రికార్డును కొనసాగించింది.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఆదివారం మరోసారి ఈ రెండు జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ను సర్ఫ్‌రాజ్ అహ్మద్ కెప్టెన్సీలోని పాక్ నిలువరిస్తుందా? గత ఆరు పరాజయాలకు ప్రతీకారం తీర్చుకుంటుందా? మరోసారి ఓటమిపాలై, టీమిండియా ఆధిపత్యానికి తలవంచుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడక తప్పదు.