క్రీడాభూమి

ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, మే 20: ఐపిఎల్-9లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ప్లే-ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. రాయ్‌పూర్‌లో శుక్రవారం టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 161 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించింది. ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ అజేయ అర్ధ శతకంతో రాణించి ఢిల్లీ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచ్‌లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఇది ఏడో విజయం. దీంతో ఆ జట్టు 14 పాయింట్లు కూడగట్టుకుని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్‌తో సరిసమానంగా నిలిచింది.
అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో తడబడింది. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (10)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా (1), సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (10) స్వల్పస్కోర్లకే నిష్క్రమించడంతో సన్‌రైజర్స్ 66 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అయితే ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకంతో రాణించి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను ఆదుకున్నాడు. క్రీజ్‌లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడిన అతను మోజెస్ హెన్రిక్స్ (13 బంతుల్లో 18 పరుగులు)తో కలసి నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. 56 బంతుల్లో ఒక సిక్సర్, మరో ఎనిమిది ఫోర్ల సహాయంతో 73 పరుగులు సాధించి వార్నర్ 16వ ఓవర్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ వేసిన బంతిని ఎదుర్కోబోయి అమిత్ మిశ్రాకు క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో వచ్చిన ఇయాన్ మోర్గాన్ 14 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మరో 26 పరుగులు జోడించిన తర్వాత భువనేశ్వర్ కుమార్ (13) ఇన్నింగ్స్ చివర్లో రనౌట్‌గా వెనుదిరగ్గా, వికెట్ కీపర్ నమన్ ఓజా (16) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ రెండు వికెట్లు, జెపి.డుమినీ, కౌల్టర్ నీల్ చెరో వికెట్ రాబట్టారు.
అనంతరం 159 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో ఓపెనర్ క్వింటోన్ డీకాక్ (2) ఆదిలోనే నిష్క్రమించినప్పటికీ రిషభ్ పంత్, కరుణ్ నాయర్ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడిన వీరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. అనంతరం రిషభ్ పంత్ (32)తో పాటు జెపి.డుమినీ (17), కార్లోస్ బ్రాత్‌వైట్ (10) పెవిలియన్‌కు చేరినప్పటికీ చూడముచ్చటైన షాట్లతో అలరించిన కరుణ్ నాయర్ (59 బంతుల్లో 83 పరుగులు), సంజూ శాంసన్ (4 బంతుల్లో 3 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 161 పరుగులు సాధించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్ బౌలర్లలో బరీందర్ సరన్ రెండు వికెట్లు, ముస్త్ఫాజుర్ రహ్మాన్ ఒక వికెట్ రాబట్టారు.
సంక్షిప్తంగా స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 158/7 (డేవిడ్ వార్నర్ 73, శిఖర్ ధావన్ 10, యువరాజ్ సింగ్ 10, మోజెస్ హెన్రిక్స్ 18, ఇయాన్ మోర్గాన్ 14, నమన్ ఓజా 16-నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 13).
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 161/4 (కరుణ్ నాయర్ 83-నాటౌట్, రిషభ్ పంత్ 32, జెపి.డుమినీ 17, కార్లోస్ బ్రాత్‌వైట్ 10, సంజూ శాంసన్ 3-నాటౌట్)

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను గెలిపించిన
కరుణ్ నాయర్ (59 బంతుల్లో 83-నాటౌట్)