క్రీడాభూమి

ధోనీకి ఊరట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 21: ఇది వరకే ఐపిఎల్ రేసు నుంచి వైదొలగిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ వల్ల ఇరు జట్లకు ప్రయోజనం లేకపోయినా, చివరి క్షణం వరకూ ఉత్కంఠను రేపింది. పంజాబ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం మాత్రం పరిమిత ఓవర్లలో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీకి వ్యక్తిగతంగా కొంతలో కొంత ఊరటనిచ్చింది. చివరి స్థానాకి పడిపోయే ప్రమాదం నుంచి రైజింగ్ పుణె తప్పించుకోవడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో అసాధ్యంగా కనిపించిన 23 పరుగులను రాబట్టిన అతను, టాప్ ఫినిషర్‌గా తనకు ఉన్న పేరును సార్ధకం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి భారీ సిక్స్‌తో అతను రైజింగ్ పుణెను విజయపథంలో నడిపించాడు. ఈసారి ఐపిఎల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన జట్టుగా పంజాబ్ పరువు పోగొట్టుకుంటే, ధోనీ సేన విజయంతో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ మురళీ విజయ్ (59), గుర్‌కీతర్ సింగ్ మాన్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో పంజాబ్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. కాగా, 173 పరుగుల లక్ష్యాన్ని రైజింగ్ పుణె చివరి బంతిలో ఛేదించింది.
ఓపెనర్ హషీం ఆమ్లా 27 బంతుల్లో 30 (నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మురళీ విజయ్ 41 బంతుల్లో 59 (నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), గుర్‌కీరత్ సింగ్ 30 బంతుల్లో 51 (మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. రైజింగ్ పుణె బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశోక్ దిండా, తిసర పెరెరా, ఆడం జంపా తలా ఒక వికెట్ సాధించారు.
చిట్టచివరి స్థానంతో ఈసారి ఐపిఎల్‌ను ముగించకుండా ఉండాలంటే, 173 పరుగులు సాధించాల్సి ఉండగా, రైజింగ్ పుణె ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆజింక్య రహానే, ఉస్మాన్ ఖాజా మొదటి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన రహానే 15 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 19 పరుగులకే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశ పరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో అతను వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు చిక్కాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ జార్జి బెయిలీ 11 బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి, సాహా స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సౌరభ్ తివారీ 15 బంతుల్లో 17 పరుగలు చేశాడు. ఫామ్‌లోకి వస్తున్నట్టు కనిపించిన అతనిని ఫర్హాన్ బెహర్డియన్ క్యాచ్ పట్టగా గుర్‌కీతర్ సింగ్ మాన్ అవుట్ చేశాడు. అప్పటి వరకూ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్న ఉస్మాన్ ఖాజా (30)ను గుర్‌కీతర్ అదే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. ఇర్ఫాన్ పఠాన్ కేవలం రెండు పరుగులు చేసి, రిషి ధావన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ సాహాకు చిక్కాడు. 13.2 ఓవర్లలో 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ ధోనీ స్వీకరించాడు. తిసర పెరెరాతో కలిసి అతను పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పెరెరా కూడా తన పరిధిలో ధోనీకి చక్కటి సహకారాన్ని అందించాడు. 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు చేసిన పెరెరాను సాహా క్యాచ్ పట్టుగోగా సందీప్ శర్మ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ ముగియడానికి అప్పటికి ఇంకా 11 బంతులు మిగిలి ఉండగా, రైజింగ్ పుణె విజయానికి 29 పరుగుల దూరంలో నిలిచింది. ఆ ఓవర్‌లో సందీప్ శర్మ కేవలం ఆరు పరుగులిచ్చాడు. దీనితో అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో 23 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతిని ధోనీ రక్షణాత్మకంగా ఆడాడు. తర్వాతి బంతిని అక్షర్ పటేల్ వైడ్‌గా వేయడంతో రైజింగ్ పుణెకు ఒక పరుగు లభించింది. అదనంగా లభించిన రెండో బంతిని ధోనీ సిక్సర్‌గా మార్చాడు. మూడవది డాట్ బాల్. మూడు బంతుల్లో రైజింగ్ పుణె 16 పరుగులు సాధించడం అసాధ్యంగా కనిపించింది. కానీ, విజయంతో ఈసారి ఐపిఎల్‌ను ముగించాలన్న పట్టుదలతో ఉన్న ధోనీ నాలుగో బంతిలో ఫోర్ కొట్టాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా, ధోనీ రెండు సిక్సర్లు బాది రైజింగ్ పుణెకు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

పుణె రైజింగ్‌ను విజయపథంలో నడిపించిన ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
చివరి ఓవర్‌లో అతను చెలరేగిపోయాడు. ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 22 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్‌లో ఓ వైడ్ కూడా రావడంతో, 23 పరుగులు రైజింగ్ పుణెకు లభించాయ. ఐపిఎల్ చరిత్రలోనే ఛేజింగ్‌కు దిగినప్పుడు చివరి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి గెలిచిన జట్ల జాబితాలో రైజింగ్ పుణె నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. మూడు జట్లు 21 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాయ.

సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 (హషీం ఆమ్లా 30, మురళీ విజయ్ 59, గుర్‌కీరత్ సింగ్ మాన్ 51, రవిచంద్ర అశ్విన్ 4/34).
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 (ఆజింక్య రహానే 19, ఉస్మాన్ ఖాజా 30, మహేంద్ర సింగ్ ధోనీ 64 నాటౌట్, తిసర పెరెరా 23).