క్రీడాభూమి

రికార్డుపై సెరెనా కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 21: రోలాండ్ గారోస్‌లో క్లే కోర్టుపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్ సమరంలో మహిళల సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకొని, ఓపెన్ శకం ఆరంభమైన తర్వాత తిరుగులేని టెన్నిస్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న స్ట్ఫె గ్రాఫ్ రికార్డును సమం చేయాలని ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆశిస్తున్నది. టైటిల్‌పై కనే్నసిన 34 ఏళ్ల సెరెనా ఇప్పటి వరకూ 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకుంది. స్ట్ఫె ఖాతాలో 22 గ్రాండ్ శ్లామ్స్ ఉన్నాయి. 2002లో మొదటిసారి రోలాండ్ గారోస్‌లో విజేతగా నిలిచిన సెరెనా, 2013లో రెండోసారి, నిరుడు మూడోసారి టైటిళ్లను కైవసం చేసుకుంది. నాలుగోసారి ఇక్కడ విజయ భేరి మోగించాలని, అత్యధిక గ్రాండ్ శ్లామ్స్‌ను సాధించిన క్రీడాకారిణిగా స్ట్ఫె సరసన స్థానం సంపాదించాలని ఆమె పట్టుదలతో ఉంది. ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉండడం, గత ఏడాది అసాధారణ ఫామ్‌ను కొనసాగించడం, గట్టిపోటీదారు మరియా షరపోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడి నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌కు గురికావడం వంటి అంశాలు సెరెనాను ఫేవరిట్‌గా నిలబెడుతున్నాయి. అయితే, ఫిట్నెస్ సమస్య ఆమెను ఎప్పుడు వెంటాడుతుందో చెప్పలేని పరిస్థితి. 2014లో ఆమె గార్బినే ముగురుజా చేతిలో రెండో రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. అంతకు రెండేళ్ల ముందు వర్జీనియా రజానోను మొదటి రౌండ్‌లో ఢీకొని ఓటమిపాలైంది. సెరెనాను నిలకడలేమి వేధిస్తున్నదని చెప్పడానికి ఈ సంఘటనలే ఉదాహరణ. ఈసారి ఆమెకు ఏంజెలిక్ కెర్బర్, రెండు పర్యాయాలు వింబుల్డన్ టైటిల్ సాధించిన పెట్రా క్విటోవా, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన సిమోనా హాలెప్, విక్టోరియా అజరెన్కా వంటి క్రీడాకారిణుల నుంచి సెరెనాకు ఈసారి గట్టిపోటీ తప్పకపోవచ్చు. వింబుల్డన్ ఫైనలిస్టు గార్బినే ముగురుజా, ఇటీవల జరిగిన రోమ్ ఓపెన్‌లో ఫైనల్ వరకూ చేరి, టైటిల్ పోరులో ఓడిన మాడిసన్ కీస్ నుంచి కూడా సెరెనాకు ప్రమాదం పొంచి ఉంది. రెండో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా, 2013లో రోలాండ్ గారోస్‌లో సెమీస్ చేరిన కరిన్ నాప్ తదితరులు కూడా సెరెనాకు తీవ్ర స్థాయిలో పోటీనిచ్చే అవకాశాలున్నాయి. మొత్తం మీద సెరెనాకు ఫేవరిట్‌గా పేర్కొంటున్నప్పటికీ, ఆమెకు గట్టిపోటీ తప్పక పోవచ్చు.
పట్టువదలని జొకోవిచ్
దశాబ్దానికిపైగా అంతర్జాతీ టెన్నిస్‌లో రాణిస్తున్న ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు ఫ్రెండ్ ఓపెన్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటి వరకూ 11 పర్యాయాలు ఈ టైటిల్ కోసం ప్రయత్నించిన అతను పట్టు వదలకుండా మరోసారి బరిలోకి దిగుతున్నాడు. 29 ఏళ్ల జొకోవిచ్‌ను విశే్లషకులు ఈసారి ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. నిరుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న స్టానిస్లాస్ వావ్రిన్కాతో జరిగిన ఫైనల్‌లో 6-4, 4-6, 3-6, 4-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌ను కైవసం చేసుకోవడం ద్వారా క్యాలండర్ శ్లామ్‌ను సాధించే అవకాశం అతని చేజారింది. అంతేగాక, కెరీర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌ను సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరడంలోనూ అతను విఫలమయ్యాడు. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలన్న దృఢ సంకల్పంతో ఉన్న జొకోవిచ్‌కు గట్టిపోటీ బ్రిటన్ వీరుడు ఆండీ ముర్రే నుంచి ఎదురయ్యే అవకాశాలున్నాయి. ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, వెటరన్ హీరో రోజర్ ఫెదరర్, డిఫెండింగ్ చాంపియన్ వావ్రిన్కా, జపాన్ ఆశాకిరణం కెయ్ నిషికొరి వంటి పలువురు సమర్థులు జొకోవిచ్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ తనకు కలిసిరాదన్న అనుమానం ఒకవైపు వేధిస్తుండగా, ముర్రే అద్భుత ఫామ్‌లో ఉండడం మరోవైపు జొకోవిచ్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇటీవల జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్‌లో ముర్రే 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో జొకోవిచ్‌ను చిత్తుచేశాడు. కానీ, గణాంకాలను చూస్తే జొకోవిచ్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. ఇద్దరూ 33 పర్యాయాలు పరస్పరం తలపడితే, జొకోవిచ్ 23 విజయాలు సాధించాడు. ముర్రే పదిసార్లు మాత్రమే గెలిచాడు. ఇలావుంటే, ఫెదరర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొమ్మిది పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌ను గెల్చుకొని, రొలాండ్ గారోస్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న రాఫెల్ నాదల్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. క్లే కోర్టుపై అతనిని నిలువరించడం ఎంతటి మొనగాడికైనా కష్టమే. అయితే, కాలి గాయం అతనిని తీవ్రంగా వేధిస్తున్నది. శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ సమస్య పదేపదే తెరపైకి వస్తున్నది. ఫిట్నెస్ సమస్య నుంచి బయటపడితే, నాదల్ పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈసారి విజేత ఎవరన్నది ఉత్కంఠ రేపుతున్నప్పటికీ, జొకోవిచ్‌నే ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. అతను టైటిల్ సాధించి, చిరకాల కలను సాకారం చేసుకుంటాడో లేక గత ఫలితాలనే పునరావృతం చేస్తాడో చూడాలి.

చిత్రం ఫ్రెంచ్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్