క్రీడాభూమి

రోహిత్, కోహ్లీపైనే ఆధారపడడం తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 11: ఎల్లప్పుడూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఆధారపడడం తప్పని, వారిపై భారం వేసి ముందుకు సాగాలనుకోవడం మంచిది కాదని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్లో టాపార్డర్ విఫలంకాగా, మిడిలార్డర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా ఎంతగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయిన విషయం తెలిసిందే. టీమిండియా 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, 18 పరుగులతో పరాజయాన్ని ఎదుర్కోవడం తనకు ఎంతో నిరాశ కలిగించిందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ అన్నాడు. ఈ లక్ష్యాన్ని సులభంగానే ఛేదించే సత్తా టీమిండియాకు ఉందని, కానీ, ఆరంభంలోనే మూడు వికెట్లు కూలడంతో అభిమానుల ఆశలకు తెరపడిందని అన్నాడు. రోహిత్, కోహ్లీవంటి ఆటగాళ్లపైనే పూర్తిగా ఆధారపడడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ బౌలర్లు సమర్థంగా బౌల్ చేశారని కితాబునిస్తూనే, టీమిండియా టాపార్డర్ అంత దారుణంగా విఫలమవుతుందని తాను ఊహించలేదన్నాడు. ప్రతిసారీ ఇద్దరుముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రాణించాలని కోరుకోవడం సరైనది కాదని సచిన్ అన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ వ్యూహాలు ఆ జట్టుకు లాభించాయని, అదే సమయంలో, టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడలేకపోయారని అన్నాడు. లక్షలాది మంది అభిమానుల మాదిరిగానే తనను కూడా ఆ ఫలితం నిరాశకు గురి చేసిందని అన్నాడు.
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు ఓ తప్పిదం
ధోనీ, రవీంద్ర జడేజా పోరాట స్ఫూర్తి అద్భుతమని మాజీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించాడు. అయితే, టాపార్డర్ వైఫల్యమే భారత్ పరాజయానికి కారణమైందని అతను ట్వీట్ చేశాడు. ధోనీని ఏడో స్థానంలో పంపడం సరిదిద్దుకోలేని తప్పిదమని వ్యాఖ్యానించాడు. ఆరో స్థానం నుంచి అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎందుకు మార్చారో అర్థం కావడం లేదన్నాడు. 2011లో ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను తానే నాలుగో స్థానానికి మార్చుకున్నాడని, అద్భుతమైన ఆటతో ప్రపంచ కప్‌ను సాధించాడని లక్ష్మణ్ గుర్తుచేశాడు. కివీస్‌తో జరిగిన సెమీ ఫైనల్లో హఠాత్తుగా అతనిని ఏడో స్థానంలో దించడంలో ఎలాంటి ఔచిత్యం లేదని అన్నాడు. ఆ పొరపాటుకు భారీగానే మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు వాతావరణాన్ని, పిచ్ స్వభావాన్ని తమకు అనుకూలంగా మలచుకొని, అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను అభినందించాడు. తాను ఎంతో ఆవేదనకు గురైనట్టు స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, సంజయ్ మంజ్రేకర్‌తోపాటు అజింక్య రహానే, సురేష్ రైనా, ఇశాంత్ శర్మ తదితరులు కూడా భారత్ పరాజయం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒకరిద్దరిపైన ఆధారపడకుండా, సమష్టిగా రాణించాలని హితవు పలికారు.

చిత్రం...సచిన్ తెండూల్కర్