క్రీడాభూమి

అడుగు దూరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు సిద్ధమైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో నిలిచాయి. రెండు జట్లూ 1975 నుంచి ఈ మెగా టోర్నీలో పోటీపడుతున్నప్పటికీ ఇంత వరకూ టైటిల్‌ను సాధించలేదు. గెలిచిన జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ టైటిల్ అవుతుంది. కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది. ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోవడానికి ఇరు జట్లు సన్నాహాలు పూర్తి చేశాయి. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్, కేన్ విలియమ్‌సన్ సారథ్యంలో న్యూజిలాండ్ ట్రోఫీ కోసం వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఇంగ్లాండ్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గత మూడు పర్యాయాలు ట్రోఫీని దక్కించుకోలేకపోయిన ఆ జట్టు రన్నరప్ ట్రోఫీకే పరిమితమైంది. కివీస్ ఆరు పర్యాయాలు సెమీస్ చేరినా, ఆ తర్వాత ముందుకు వెళ్లలేకపోయింది. 2015లో ఏడోసారి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ దశను సమర్థంగా అధిగమించి, ఫైనల్ చేరింది. కానీ, ఆస్ట్రేలియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
ఐదున్నర దశాబ్దాలుగా ఎదురుచూపు..
కేవలం క్రికెట్ మాత్రమేగాక, ఏ క్రీడలోనైనా ఒక వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ సుమారు ఐదున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నది. సర్ ఆల్ఫ్ రామ్సే నాయకత్వంలోని ఇంగ్లాండ్ సాకర్ జట్టు 1966లో ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని సాధించింది. ఆతర్వాత ఇంత వరకూ సాకర్, క్రికెట్ లేదా మరే ఇతర క్రీడలోనూ ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌ను దక్కించుకోలేకపోయింది. ఫుట్‌బాల్‌లో గారీ లీనేకర్, హారీ కేన్ వంటి అసాధారణ ప్రతిభావంతులు కూడా ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్‌ను అందించలేకపోయారు. ఫిల్ నెవిలే కోచ్‌గా వ్యవహరించిన మహిళల సాకర్ జట్టు వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ కప్ కోసం క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు క్రికెట్ రూపంలో మరోసారి కళ్ల ముందు ప్రత్యక్షమైంది. దీనిని మోర్గాన్ సేన ఎంత వరకూ దీనిని సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. జానీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్, జో రూట్, జొస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి సమర్థులతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గతంలో ఫైనల్ చేరిన మూడు పర్యాయాలు ఎదురైన చేదు అనుభవం పునరావృతం కాకుండా చూసే బాధ్యత ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌పై ఉంది. 1979లో ఇంగ్లాండ్ తొలిసారి ఫైనల్ చేరి, వెస్టిండీస్ చేతిలో 92 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మైక్ బ్రియర్లీ (130 బంతుల్లో 64 పరుగులు), జెఫ్రీ బాయ్‌కాట్ (105 బంతుల్లో 57 పరుగులు) జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1987లో రెండోసారి ఫైనల్ చేరి, ఆస్ట్రేలియాను ఢీకొంది. కానీ, దురదృష్టవశాత్తు కేవలం ఏడు పరుగుల తేడాతో ఓడింది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లోనే మైక్ గాటింగ్ వివాదాస్పద రివర్వ్ స్వీప్ ప్రయత్నం కారణంగా ఇంగ్లాండ్ అతని వికెట్‌తోపాటు, విజయావకాశాన్నీ చేజార్చుకుంది. 1992 ఫైనల్లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 22 పరుగుల తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 249 పరుగులు చేయగా, ఈ సాధారణమైన లక్ష్యాన్ని కూడా చేరలేకపోయిన ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. ఆ మూడు పర్యాయాలు బ్యాట్స్‌మెన్ తప్పిదాలు, నిర్లక్ష్య షాట్ల వల్లే పరాజయాలను ఎదుర్కొంది. అదే పొరపాటు జరగకుండా బ్యాట్స్‌మెన్ జాగ్రత్త పడాలి. ఈ టోర్నమెంట్‌లో ఇంత వరకూ జాసన్ రాయ్ 426, జానీ బెయిర్‌స్టో 496 పరుగులు చేసి, ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. జో రూట్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ 549 పరుగులు చేశాడు. అతని దూకుడు ఫైనల్లోనూ కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరంతా న్యూజిలాండ్ జట్టులోని స్టార్లు ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లాండ్ జట్టు వద్ద బలమైన ఆయుధం ఉంది.
బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ ఇంగ్లాండ్ బలంగానే ఉంది. జొఫ్రా ఆర్చర్ 19, క్రిస్ వోక్స్ 13, లియామ్ ప్లంకెట్ 8 చొప్పున వికెట్లు పడగొట్టరు. మార్క్ ఉడ్ నిలకడలేమితో అల్లాడుతున్నప్పటికీ, అతని ఖాతాలో 17 వికెట్లు ఉన్న విషయాన్ని మరచిపోకూడదు. అదిల్ రషీద్ 11 వికెట్లు పడగొట్టి, తన ఉనికిని చాటుకుంటున్నాడు. సెమీ ఫైనల్లో భారత్‌పై అతను రాణించిన తీరు ప్రశంసనీయం. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్, ఆదివారం నాటి తుది పోరులో ఏ విధంగా ఆడుతుందో చూడాలి.

నిలకడే కివీస్ బలం..

ఇంగ్లాండ్ దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ చేరుకోగా, న్యూజిలాండ్ అందుకు భిన్నంగా నిలకడగా రాణిస్తూ, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఫైనల్లో చోటు సంపాదించింది. 2015లో ఫైనల్ చేరినప్పటికీ, ఆస్ట్రేలియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన కివీస్, ఈసారి అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అంతకు ముందు ఆరు పర్యాయాలు (1975, 1979, 1992, 2003, 2007, 2011) సెమీస్ చేరినప్పటికీ ఫైనల్ చేరలేకపోవడంతో, ఈ జట్టుపై ‘సెమీస్ టీం’గా ముద్రపడింది. దానిని తుడిచివేసుకొని, గత వరల్డ్ కప్‌లో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కానీ, చేతికి అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రత్యర్థిని మట్టికరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ స్వయంగా రాణిస్తూ, జట్టుకు స్ఫూర్తిదాయకమైన న్యాయకత్వాన్ని అందిస్తున్నాడు. ఇంత వరకూ 548 పరుగులు సాధించడం అతని బ్యాటింగ్ సామర్థ్యానికి అద్దం పడుతుంది. రాస్ టేలర్ (335 పరుగులు), మార్టిన్ గుప్టిల్ (167 పరుగులు) క్రీజ్‌లో నిలదొక్కుకోగలిగితే, కివీస్ భారీ స్కోరు చేయకుండా నిలువరించడం ఇంగ్లాండ్‌కు కష్టసాధ్యమే అవుతుంది. కొలిన్ డి గ్రాండ్‌హోమ్, జిమీ నీషమ్, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ వంటి స్టార్ ఆటగాళ్లతో న్యూజిలాండ్ కూడా బలంగానే కనిపిస్తున్నది. ఇంగ్లాండ్‌కు హోం అడ్వాంటేజ్ ఉన్నందువల్ల, ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువని విశే్లషకుల అభిప్రాయం. అయితే, న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో టీమిండియా విషయంలో స్పష్టమైంది. కాబట్టి, ఇంగ్లాండ్ అలాంటి పొరపాటు చేయకుండా ఉంటేనే మేలు.
హెడ్ టు హెడ్
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు వరల్డ్ కప్ క్రికెట్‌లో తొలిసారి 1975లో పరస్పరం తలపడ్డాయి. ఆ మ్యాచ్‌ని ఇంగ్లాండ్ 80 పరుగుల తేడాతో గెల్చుకుంది.
1979లో తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించి, ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే, 1996 ఎదురుదాటికి దిగిన న్యూజిలాండ్ 11 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. 1983లో ఈ జట్లు రెండు పర్యాయాలు ఢీకొన్నాయి. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 106 పరుగుల తేడాతో గెలిస్తే, రెండో మ్యాచ్‌ని న్యూజిలాండ్ రెండు వికెట్ల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కివీస్ ఆధిపత్యం కొనసాగుతునే వచ్చింది. 1992లో ఈ జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. 2007లో 6 వికెట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. 2015లో అద్వితీయ ప్రతిభను కొనసాగిస్తూ, 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అయితే, ఈసారి వరల్డ్ కప్ గ్రూప్ దశలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
గత గణాంకాలు
వరల్డ్ కప్‌ను ఇంత వరకూ వెస్టిండీస్ (రెండు పర్యాయాలు/ 1975, 1979), భారత్ (రెండు పర్యాయాలు/ 1983, 2011), ఆస్ట్రేలియా (ఐదు పర్యాయాలు/ 1987, 1999, 2003, 2007, 2015), పాకిస్తాన్ (ఒకసారి/ 1992), శ్రీలంక (ఒకసారి/ 1996) గెల్చుకున్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది. ఏ జట్టు గెలిచినా, సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది.
*
వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్,
న్యూజిలాండ్ జట్లు ఇంత వరకూ 9 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇంగ్లాండ్ ఐదు, కివీస్ నాలుగు చొప్పున విజయాలు సాధించాయి. గణాంకాలను పరిశీలిస్తే ఇంగ్లాండ్‌దే
పైచేయిగా
కనిపిస్తున్నప్పటికీ, న్యూజిలాండ్ ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి దిగే ప్రమాదం లేకపోలేదు.
*
సెమీ ఫైనల్లో భారత్‌ను 18 పరుగుల తేడాతో ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. ఇంగ్లాండ్ ఏకంగా 8 వికెట్ల ఆధిక్యంతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈసారి వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు 8 వికెట్లకు 322 పరుగులుకాగా, కివీస్ అత్యధిక స్కోరు 239 పరుగులు. అదే విధంగా అత్యల్ప స్కోరు ఇంగ్లాండ్‌కు 123, న్యూజిలాండ్‌కు 125 పరుగులు.