రాష్ట్రీయం

ఒకరిది కల.. మరొకరిది కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: రాష్ట్ర విభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో పరిణామాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఎంతో తేడా కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటా బయట సమస్యలు ఎదుర్కొంటుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజకీయ చతురతతో బలమైన నాయకుడిగా అవతరించారు. ఆంధ్రాలో రెవెన్యూ లోటు, వౌలిక సదుపాయాల సమస్యలు, కలిసిరాని ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీలో సమర్ధులైన మంత్రులు కొరవడడం, బిజెపితో పొత్తుపై అనిశ్చిత పరిస్ధితితో చంద్రబాబు సతమతమవుతున్నారు. తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు పేరుకు మాత్రమే మిగిలాయి. తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించడమే కాకుండా, మిగులు రెవెన్యూతో దూసుకుపోతోంది.
చంద్రబాబు ఇంటాబయట సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లి వచ్చినా ప్రత్యేక హోదాను సాధించలేకపోయారు. ప్రత్యేక హోదాపై నిశ్చితమైన అభిప్రాయంలేక, ఒక సారి ప్యాకేజీ అని , మరోసారి హోదా సంజీవని కాదంటూ గందరగోళ రాజకీయాలకు తెరలేపారు. రెవెన్యూ లోటు రూ.13,447 కోట్లను భర్తీ చేసేందుకు కేంద్రం నుంచి ఆశించినమేర నిధులు తెచ్చుకోలేకపోయారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ను సాధించలేకపోయారు. 2014లో విభజన జరిగిన వెంటనే విజయవాడకు వచ్చి తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులు మొదలు పెట్టి ఉంటే బాగుండేదని, దాదాపు 18 నెలల సమయం వృథా చేశామని శనివారం మొదటి సారి తప్పును అంగీకరించారు కూడా. చంద్రబాబు మంత్రివర్గంలో ఒకరిద్దరిని మినహాయిస్తేపెద్దగా చెప్పుకోదగిన సమర్థులైన మంత్రులు లేకపోవడం లోటు కొట్టుచ్చినట్లు కనపడుతోంది. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేసేందుకు ముందే భూములను తన అనుయాయులతో కొనిపించారనే ఆరోపణలను తీవ్రస్థాయిలో ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష వైకాపా నుంచి 17 మంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకువచ్చినా చంద్రబాబుకు రాజకీయ చతురుడు అనే పేరు రాలేదు. వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి గెలిచి ఉంటే చంద్రబాబు ఇమేజి పెరిగి ఉండేది. వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అపవాదును మూటగట్టుకోవడమే కాకుండా, పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగి తల బొప్పి కడుతోంది. బిజెపితో కూడా సంబంధాలు రోజురోజుకు చెడుతున్నాయి. తాజాగా మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ కృష్ణా నదిపై అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా, ఓటుకునోటు కేసులో అభియోగాలు ఎదుర్కొన్నందువల్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నారనే విమర్శలను వైకాపా తీవ్రం చేసింది. హైదరాబాద్‌లో పదేళ్లు ఉంటామని సచివాలయంలో తనబ్లాక్‌లకు కోట్లాది రూపాయలతో మరమ్మతులు, ఆధునీకరణ చేయడం, జూబ్లీహిల్స్ ఇంటికి, అద్దె ఇంటికి, తాజాగా మదీనాగూడ ఫాంహౌస్‌కు సొబగులు చేసేందుకు నిధులు వెచ్చించడం విమర్శలకు దారితీసింది. స్థిరత్వం లేని నిర్ణయాలతో చంద్రబాబు సతమతమవుతున్నారు. ఏపిలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా మంత్రివర్గంలో మార్పులు చేయలేకపోయారు. చంద్రబాబు బలమైన ప్రతిపక్షనేత జగన్ నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కె చంద్రశేఖరరావుపట్టిందల్లా బంగారమే అవుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం పాత్ర నామమాత్రమే. ప్రతి ఉప ఎన్నికల్లో రికార్డు స్ధాయి మెజార్టీని టిఆర్‌ఎస్ సాధించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా తెగించే బలమైన నేతగా కెసిఆర్ ఎదిగారు. కుటుంబపరంగా కెటిఆర్, కవిత, హరీశ్‌రావు కీలక పదవుల్లో ఉన్నా ఎటువంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును అభాసుపాలు చేసి బాబు విజయవాడకు మకాం మార్చేందుకు కారణమైన కెసిఆర్ అపరచాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసరా, కల్యాణ లక్ష్మి పథకాలు, పెన్షన్ల వంటి సంక్షేమ పథకాలు, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల పెంపుతో కెసిఆర్ తనస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ టిడిపిని దాదాపు ఖాళీ చేయించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అంతంత మాత్రమే. వైకాపాను విలీనం చేసుకున్నారు. కెసిఆర్ రాజకీయ ఎత్తులు, దూకుడుతో ప్రతిపక్ష పార్టీలు తన ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. రాష్టమ్రంతా కెసిఆర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పనిచేస్తోంది. త్వరలో 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం ఆడుతున్నా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చెప్పుకోదగిన స్థాయిలో ఉద్యమం చేసే పరిస్థితులను కల్పించలేదు. ఆంధ్రప్రదేశ్ సహకరించకపోయినా రోజులో రెప్పపాటు కూడా విద్యుత్ కోతలు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు. కెసిఆర్ రాజకీయ ఎదురుదాడితో చైతన్యానికి మారుపేరైన తెలంగాణలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కకావికలమయ్యాయి.