క్రీడాభూమి

ఫైనల్ దిశగా సన్‌రైజర్స్ .. ఎలిమినేటర్‌లో నైట్‌రైడర్స్‌పై విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ఎలాంటి అంచనాలు లేకుండా ఈసారి ఐపిఎల్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి, రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌తో పోరును ఖరారు చేసుకుంది. యువరాజ్ సింగ్ 44 పరుగులతో రాణించడంతో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్లకు 162 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా నైట్‌రైడర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలిచిన నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 12 పరుగుల స్కోరువద్ద శిఖర్ ధావన్ వికెట్‌ను కోల్పోయింది. అతను 10 బంతుల్లో 10 పరుగులు చేసి మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం మోజెస్ హెన్రిక్స్‌తో కలిసి డేవిడ్ వార్నర్ స్కోరును వేగంగా పెంచే ప్రయత్నం చేశాడు. హెన్రిక్స్ కూడా అతనికి సహకరించారు. ప్రమాదకరంగా మారిన వీరి భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ ఛేదించాడు. 21 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించిన హెన్రిక్స్‌ను అతను రిటర్న్ క్యాచ్ పట్టుకొని పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి బంతికే వార్నర్ వికెట్ కూడా కూలింది. 28 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 28 పరుగులు చేసిన అతనిని కుల్దీప్ బౌల్డ్ చేశాడు. 71 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కూలాయి. దశలో జట్టును ఆదుకునే బాధ్యతను దీపక్ హూడా, యువరాజ్ సింగ్ తీసుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. 13 బంతుల్లోనే, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేసిన హూడాను కుల్దీప్ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్‌గా వెనక్కు పంపాడు. బెన్ కట్టింగ్ సున్నాకే అవుట్‌కాగా, బాధ్యతాయుతంగా ఆడిన యువీ 30 బంతుల్లో 44 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. నమన్ ఓఝా (7), భవనేశ్వర్ కుమార్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 162 పరుగులు సాధించగా, అప్పటికి బిపుల్ శర్మ (14), బరీందర్ శరణ్ (0) నాటౌట్‌గా నిలిచారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కుల్దీప్ 35 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్, మోర్న్ మోర్కెల్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
ఫైనల్ చేరుకునే అవకాశాన్ని దక్కించుకోవాలంటే 162 పరుగులు చేయాల్సిన నైట్‌రైడర్స్ 15 పరుగుల స్కోరువద్ద రాబిన్ ఉతప్ప వికెట్‌ను కోల్పోయింది. అతను 11 పరుగు చేసి బరీందర్ శరణ్ బౌలింగ్‌లో మోజెస్ హెన్రిక్స్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కొలిన్ మున్రో రెండో వికెట్‌కు గౌతం గంభీర్‌తో కలిసి 5.1 ఓశర్లలో 38 పరుగులు జత చేసిన తర్వాత దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అతను 17 బంతుల్లో 16 పరుగులు చేశాడు. జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించిన కెప్టెన్ గంభీర్ 28 పరుగులు చేసి, బెన్ కట్టింగ్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు శంకర్ క్యాచ్ పట్టగా అవుట్‌కాగా, 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన నైట్‌రైడర్స్ కష్టాల్లో పడింది. యూసుఫ్ పఠాన్ కేవలం రెండు పరుగులు చేసి, మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్ భాగస్వామ్యంలో 14 ఓవర్లలో నైట్‌రైడర్స్ వంద పరుగుల మైలురాయిని చేరింది. వీరు ఐదో వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. స్కోరు వేగంగా ముందుకు సాగుతున్న తరుణంలోనే మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా సూర్యకుమార్ అవుటయ్యాడు. అతను 15 బంతుల్లో 23 పరుగులు సాధించాడు. నైట్‌రైడర్స్‌ను గెలిపించే స్థాయిలో ఆడుతున్న మనీష్ పాండేను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో సన్‌రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. పాండే 28 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు చేశాడు. రాజ్‌గోపాల్ సతీష్, జాసన్ హోల్డర్ క్రీజ్‌లో ఉండగా, చివరి రెండు ఓవర్లలో నైట్‌రైడర్స్ విజయానికి 33 పరుగుల దూరంలో నిలిచింది. ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ను వేసిన ముస్త్ఫాజుర్ రహ్మాన్ కేవలం ఎనిమిది పరుగులిచ్చాడు. దీనితో చివరి ఓవర్‌లో నైట్‌రైడర్స్‌కు 25 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన భువీ మొదటి బంతికి ఒక పరుగు ఇచ్చాడు. రెండో బంతిలో సతీష్ (8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడో బంతి డాట్ బాల్‌కాగా, నాలుగో బంతికి జాసన్ హోల్డర్ వికెట్‌ను కూల్చాడు. హోల్డర్ ఆరు పరుగులు చేసి, కట్టింగ్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. భువీ ఆ ఓవర్‌లో రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చగా, నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ మొదటి వికెట్‌కు 12 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వారు 1,500 పరుగుల మైలురాయిని అధిగమించారు. ఐపిఎల్ చరిత్రలోనే ఓపెనర్లు ఇన్ని పరుగులు చేయడం ఇదే మొదటిసారి. గౌతం గంభీర్, రాబిన్ ఉతప్ప జోడీ 1,463 పరుగులతో రెండో స్థానంలో ఉంది.

* కుల్దీప్ యాదవ్ గత మ్యాచ్‌లో 28 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. ఈ రెండు అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడుతూ నమోదు చేసిన బౌలింగ్ విశే్లషణలు కావడం గమనార్హం.
* ఈ ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓపెనింగ్ జోడీని మార్చకుండా మ్యాచ్‌లు ఆడిన జట్లు రెండే ఉన్నాయి. వీటిలో ఒకటి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కాగా, మరొకటి కోల్‌కతా నైట్‌రైడర్స్. ఎలినేటర్‌లో ఈ రెండు జట్లే తలపడడం విశేషం.

* నైట్‌రైడర్స్ ఈ ఐపిఎల్‌లో ఇంత వరకూ టాస్ గెలిచిన ప్రతిసారీ ఫీల్డింగ్‌నే ఎంచుకుంది. టాస్ గెలిచినప్పుడు నైట్‌రైడర్స్ నాలుగు మ్యాచ్‌లను గెల్చుకోగా, ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. సన్‌రైజర్స్ టాస్ ఓడిపోయినప్పుడు మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కోగా, నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది.
* నైట్‌రైడర్స్ జట్టు పవర్ ప్లేలో స్పిన్నర్లతో నాలుగు ఓవర్లు బౌల్ చేయించింది. ఈ ఐపిఎల్‌లో పవర్ ప్లేలో స్పిన్నర్లు నాలుగు లేదా అంతకు మించి ఓవర్లు బౌల్ చేయడం ఇది మూడోసారి. ఇంతకు ముందు సన్‌రైజర్స్‌పైనే నైట్‌రైడర్స్ ఈవిధంగా స్పిన్నర్లతో నాలుగు ఓవర్లను బౌల్ చేయించగా, రైజింగ్ పుణె సూపర్‌జయింట్స్ ఈడెన్ గార్డెన్స్‌లో నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేయించింది.

44 పరుగులు చేసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసిన టాప్ స్కోరర్ యువరాజ్ సింగ్

* ఈ మ్యాచ్‌కి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ సింగ్ అత్యధిక స్కోరు 38 పరుగులు. 2009లో అతను ఈ స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో 44 పరుగులు సాధించడం ద్వారా నైట్‌రైడర్స్‌పై తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు.
* సన్‌రైజర్స్ మొదటి 12 ఓవర్లలో మూడు వికెట్లు చేజార్చుకొని 82 పరుగులు చేసింది. చివరి 8 ఓవర్లలో 80 పరుగులు సాధించి, ఐదు వికెట్లు చేజార్చుకుంది.

సంక్షిప్త స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 (డేవిడ్ వార్నర్ 28, మోజెస్ హెన్రిక్స్ 31, యువరాజ్ సింగ్ 44, దీపక్ హూడా 21, కుల్దీప్ యాదవ్ 3/35, జాసన్ హోల్డర్ 2/33, మోర్న్ మోర్కెల్ 2/31).
కోల్‌కతా నైట్‌రైడర్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 (గౌతం గంభీర్ 28, మనీష్ పాండే 36, సూర్య కుమార్ యాదవ్ 23, భువనేశ్వర్ కుమార్ 3/19, మోజెస్ హెన్రిక్స్ 2/17).