క్రీడాభూమి

విశ్వవిజేత సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్, ఆగస్టు 25: విశ్వ క్రీడా ప్రాంగణంలో తెలుగు తేజం తళుక్కున మెరిసింది. భారత కీర్తి బావుటాను ఎగరేసిన బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నజోమీ ఒకుహరాపై గెలిచి, విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది. ఈ టోర్నీ జరిగిన బాసెల్ (స్విట్జర్లాండ్)లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు జపాన్‌ను పాదాక్రాంతం చేసుకుంది. మొదటి రౌండ్ నుంచే దూకుడును కొనసాగిస్తూ, ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాను 21-7, 21-7 ఆధిక్యంతో చిత్తుచేసింది. బాడ్మింటన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మేటి క్రీడాకారిణులు సైతం ఆమె ధాటికి విలవిల్లాడారు. గతంలో భారత మహిళలు ఎవరూ అందుకోలేని అపూర్వ విజయాన్ని సింధు సాధించింది. దేశ క్రీడా రంగానికి సరికొత్త దిశా నిర్దేశనం చేసింది. బాడ్మింటన్‌లో చైనా, జపాన్ ఆధిక్యాన్ని దెబ్బతీయడం అసాధ్యమన్న వాదన తప్పని నిరూపించింది. కోట్లాది మంది భారతీయులు కలలుగన్న అద్భుతాన్ని ఆవిష్కరించింది. సింధు సాధించింది ఆషామాషీ విజయమేమీ కాదు. ఈ మెగా టోర్నీలో 45 దేశాలు బరిలోకి దిగాయి. మహిళల సింగిల్స్ విభాగంలో మొత్తం 48 మంది పోటీపడ్డారు. వారిలో విజేతగా నిలవడం సింధు ప్రతిభకు నిదర్శనం. నిజానికి మిగతా 47 మందిలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించడమే వారి ప్రతిభకు నిదర్శనం. అంత మందిలో సింధు ఒక్కో మెట్టు ఎక్కడానికి అవిశ్రాంతంగా సాధన చేసింది. పోరాటాలు కొనసాగించింది. సర్వశక్తులూ ఒడ్డింది. ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌లు ఆడింది. ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా రంగంలోకి దిగిన సింధుకు మొదటి రౌండ్‌లో బై లభించింది. దీంతో ఆమె రెండో రౌండ్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. పాయ్ యూ పొను 21-14, 21-15 తేడాతో ఓడించింది. మూడో రౌండ్‌లో జాంగ్ బీవెన్‌పై 21-14, 21-6 ఆధిక్యంతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. సెమీస్ చేరడానికి తాయ్ జూ ఇంగ్‌తో తీవ్రంగా పోరాడింది. సెమీ ఫైనల్లో చెన్ యూ ఫెయ్‌పై 21-7, 21-14 తేడాతో సునాయసంగా విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్లో ఒకుహరాను ఓడించి, గతంలో ఆమె చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
ప్రణీత్‌కు కాంస్యం
పురుషుల సింగిల్స్‌లో సెమీస్ వరకూ చేరినప్పటికీ, ఫైనల్లో చోటు సంపాదించుకోలేకపోయన తెలుగు వీరుడు సాయ ప్రణీత్‌కు కాంస్య పతకం లభించింది. సెమీ ఫైనల్లో అతను ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కెన్టో మొమొతా చేతిలో 13-21, 8-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, కాంస్య పతకంతో సరిపుచ్చుకున్నాడు. కాగా, పురుషుల సింగిల్స్‌ను అందరూ ఊహించినట్టే మొమొతా కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో అతను ఆండర్స్ ఆంటన్సన్‌ను 21-9, 21-3 తేడాతో చిత్తు చేశాడు.