క్రీడాభూమి

గాయంతో నాదల్ అవుట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 28: తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మొదటి రెండు రౌండ్లలో అతను చేతి మణికట్టు గాయంతోనే మ్యాచ్‌లు ఆడాడు. చేతికి ఇంజక్షన్ చేయించుకొని మరీ అతను పదోసారి రొలాండ్ గారోస్‌లో టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ముందంజ వేశాడు. అయితే, మూడో రౌండ్‌లో మార్సెల్ గ్రానొలెర్స్‌తో తలపడాల్సిన అతను మ్యాచ్ ఆడలేనని ప్రకటించాడు. చేతికి కట్టుతో విలేఖరుల సమావేశంలో పాల్గొన్న అతను పోటీ నుంచి వైదొలగుతున్నానని తెలిపాడు. నాదల్ మ్యాచ్ ఆడకపోవడంతో గ్రానొలెర్స్ ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు.
ఇలావుంటే, డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో అతను జెరెమీ చార్డీని 6-4, 6-3, 7-5 తేడాతో ఓడించాడు. మరో మ్యాచ్‌లో విక్టర్ ట్రైకీ 6-4, 6-2, 6-2 ఆధిక్యంతో గిలెస్ సైమన్‌పై విజయం సాధించాడు. బలమైన సర్వీసులకు మారుపేరైన జాన్ ఇస్నర్ చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తిమిరెజ్ గార్బష్విల్లీని 7-6, 4-6, 2-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి ‘లాస్ట్-16’ జాబితాలోకి అడుగుపెట్టాడు. రిచర్డ్ గాస్క్వెట్ 6-2, 7-6, 6-2 తేడాతో నిక్ కిర్గియోస్‌ను, కెయ్ నిషికోరి 6-3, 6-4, 3-6, 2-6, 6-4 తేడాతో ఫెర్నాండొ వెర్డాస్కోను ఓడించి ముందంజ వేశారు. బ్రిటన్ వీరుడు ఆండీ ముర్రే 6-1, 6-4, 7-6 స్కోరుతో ఇవో కార్లొవిచ్‌పై విజయం సాధించాడు. మిలోస్ రవోనిక్ 7-6, 6-2, 6-3 తేడాతో ఫాబ్రిస్ మార్టిన్‌పై, రామోస్ వినోలాస్ 6-7, 6-4, 6-4, 4-6, 6-4 స్కోరుతో జాక్ సాక్‌పై విజయాలను నమోదు చేశారు. మహిళల విభాగంలో కార్లా సౌరెజ్ నవరో 6-4, 3-6, 6-1 స్కోరుతో డొమినికా సిబుల్కొవాను, యులియా పుతిన్‌సెవా 6-1, 6-1 తేడాతో కరిన్ నాప్‌ను, ఎలినా స్విటోలినా 6-4, 6-1 ఆధిక్యంతో అనా ఇవానోవిచ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సంపాదించారు. స్వెతానా పిరిన్కొవా 6-2, 6-1 తేడాతో సొలెన్ స్టెఫెన్స్‌పై విజయం సాధించింది.