క్రీడాభూమి

మరిన్ని విజయాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 13: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. వెలగపూడి సచివాలయంలో క్రీడాశాఖ మంత్రి ముత్తెంశెట్టి (అవంతి) శ్రీనివాసరావుతో కలిసి సింధు, ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, లక్ష్మి, క్రీడా సంఘాల ప్రతినిధి చాముండేశ్వరినాథ్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శుక్రవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సింధును ముఖ్యమంత్రి అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. ఇటీవల ప్రపంచ బాడ్మింటన్ పోటీల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని చూసి ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని వెల్లడించారు. సింధుకు ప్రభుత్వపరంగా తగిన అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో బాడ్మింటన్ అకాడమీకి ఐదెకరాల స్థలం కేటాయించాలని సింధు కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్, సింధు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తనను సత్కరించటం ఆనందంగా ఉందని సింధు అన్నారు. విశాఖలో ఐదెకరాల భూమి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను పద్మభూషణ్ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలిసిందని దీనిపై ఇంకా కచ్చితమైన అధికారిక సమాచారం అందలేదన్నారు. స్వర్ణపతకం సాధించిన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన సింధుకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సింధు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషించారు. రానున్న ఒలంపిక్స్ క్రీడా పోటీల్లో సింధు మరోసారి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి సహకారం అవసరమైనా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని స్పష్టం చేశారు. మహిళల కోసం బ్యాడ్మింటన్ అకాడమీ ఉండాలనే ఉద్దేశంతోనే విశాఖలో ఐదెకరాల భూమిని ముఖ్యమంత్రి మంజూరు చేశారని తెలిపారు. తెలుగమ్మాయి సింధుకు అన్ని విధాల అండగా ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు.