క్రీడాభూమి

క్రికెట్ సంఘాలకు ఎసిఎ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), మే 30: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) ఆదర్శమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నూతన అధ్యక్షుడు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. సోమవారం కృష్ణాజిల్లాలోని మూలపాడులో ఎసిఎ కెడిసిఎ క్రికెట్ సెంటర్‌ను, మంగళగిరిలోని ఎసిఎ ఇండోర్ క్రికెట్ నెట్స్ అకాడమీని ప్రారంభించిన ఠాకూర్ అక్కడి క్రికెటర్లతో కొద్దిసేపు క్రికెట్ ఆడాడు. గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ బ్యాటింగ్ చేసి రెండు మైదానాలను ప్రారంభించాడు. అనంరతం విలేఖరులతో మాట్లాడుతూ మిగతా క్రీడా సంఘాలు, సమాఖ్యల బిసిసిఐ ప్రభుత్వాలపై ఆధారపడదని, సొంతంగా నిధులు సమకూర్చుకుంటుందని అన్నాడు. గో గ్రీన్ కార్యక్రమం కింద 100 కోట్ల రూపాయలతో పచ్చదనాన్ని పెంపొందించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని అన్నాడు. ముందుగా ఖరారైన వేదికలను కాకుండా ఇతర మైదానాలకు కొన్ని ఐపిఎల్ మ్యాచ్‌లను తరలించాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలో, అతి తక్కువ కాలంలోనే ఆరు మ్యాచ్‌లు నిర్వహించడం ఎసిఎకే సాధ్యపడిందని ప్రశంసించాడు. ఎసిఎ క్రికెటర్లు ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నాడు. భవిష్యత్ తరాలకు నూతన రాష్ట్రంలో ప్రభుత్వం రాజధాని కడుతుంటే, ఎసిఎ అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తున్న చోటనే రాజధాని రావడం శుభసూచకమని వ్యాఖ్యానించాడు. అంతకుముందు మూలపాడు క్రికెట్ సెంటర్‌లో స్విమ్మింగ్ ఫూల్, రెస్ట్‌రూమ్స్, డైనింగ్ హాల్, జిమ్‌లను ఆయనతోపాటు బిసిసిఐ కార్యదర్శి అజయ్ బి షిర్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు, బిసిసిఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఎంపిలు కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, బిజెపి ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ స్టేడియానికి టెస్టు హోదా!
విజయవాడ:విశాఖపట్నంలోని డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విడిసిఎ-ఎసిఎ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా ఇస్తున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించాడు. విశాఖపట్నానికి టెస్టు హోదా ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని, దాన్ని పరిశీలించాలని ఎసిఎ కార్యదర్శి, బిసిసిఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అనురాగ్‌ను కోరగా అతను వెంటనే స్పందించాడు. ‘మీరు బిసిసిఐ టోర్నమెంట్, వేదికల కమిటీ చైర్మన్ కదా.. విశాఖకు టెస్టు హోదా ఇవ్వకుండా ఎలా ఉంటాం’ అని చమత్కరించాడు. త్వరలోనే ఈ విషయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఠాకూర్ అన్నాడు.

మూలపాడులో నిర్మించిన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన అనంతరం సరదాగా బ్యాటింగ్ చేస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్