ఆటాపోటీ

క్రికెట్ బోర్డులకు ఐపిఎల్ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) భయం పట్టుకుంది. స్వదేశంలో జరిగే టోర్నీలకేకాదు.. దేశం తరఫున ఆడాల్సిన సిరీస్‌లకు కూడా గైర్హాజరవుతున్న చాలా మంది క్రికెటర్లు ఐపిఎల్‌లో పాల్గొనేందుకు పరుగులు తీయడమే బోర్డుల ఆందోళనకు ప్రధాన కారణం. కెరీర్ మొత్తంలో సంపాదించలేనంత మొత్తం ఒకటి రెండు ఐపిఎల్ సీజన్లలోనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందుకే, ఒక్కసారైనా ఈ మెగా టోర్నీలో ఆడాలని బ్యాట్ లేదా బాల్ పట్టిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అనారోగ్యాన్ని, ఫిట్నెస్ సమస్యలను పట్టించుకోకుండా ఐపిఎల్‌లో ఆడేస్తున్నారు.

గాయాలపాలైన కొందరు విశ్రాంతి తీసుకుంటే, మరి కొందరు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఫలితంగా తమతమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించడం లేదు. డబ్బు కోసం పరుగులు తీస్తున్న క్రికెటర్లు ఈ విధంగా జాతీయ జట్లు పాల్గొనే సిరీస్‌లను నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈసారి ఐపిఎల్‌లో ఆడుతూ చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో కొంత మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినవారుకాగా, మరికొంత మంది తమతమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐపిఎల్‌లో గాయపడిన కారణంగా వీరంతా వివిధ సిరీస్‌లకు దూరం కానున్నారు. తొమ్మిదో ఐపిఎల్ ఆడుతూ గాయాల బారిన పడిన క్రికెటర్లలో ఆశిష్ నెహ్రా మొదటి స్థానంలో నిలుస్తాడు. చాలాకాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చిన ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ గత నెల 15వ తేదీన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. అనంతరం మోకాలి నొప్పి తీవ్రం కావడంతో లండన్‌లో శస్తచ్రికిత్స చేయించుకున్నాడు. నెహ్రా ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపిఎల్ టైటిల్‌ను గెల్చుకోవడం అతనికి ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ, అతని కెరీర్ ప్రమాదంలో పడిందనడంలో అనుమానం లేదు. నెహ్రా మాదిరిగానే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ కూడా ఐపిఎల్ ఆరంభంలో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆతర్వాత అతను కోలుకొని మ్యాచ్‌లు ఆడినప్పటికీ, గాయం ఎప్పుడైనా తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్‌సన్ కూడా గాయం వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన మొదటి ఆరు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేకపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 30న జరిగిన మ్యాచ్‌లో ఆడడం ద్వారా ఫిట్నెస్‌ను నిరూపించుకున్నప్పటికీ అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోల్ పారిస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపిఎల్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, గాయం కారణంగా అతను మొత్తం టోర్నీకే దూరం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జీన్ పాల్ డుమినీ కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఐపిఎల్‌లో ప్రాతినిథ్యం వహించాడు. కాలి కండరాలు బెణకడంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన అతను ఆతర్వాత కోలుకున్నాడు. కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఏప్రిల్ 30న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించక ముందే అతను మే 3న గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో టోర్నీలో తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. కానీ, అతను కూడా తనపై అభిమానులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ సామ్యూల్ బద్రీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. భుజం గాయం వేధిస్తున్నప్పటికీ, అతను మ్యాచ్‌లకు సిద్ధమయ్యాడు. కానీ, విశ్రాంతి అత్యవసరమని వైద్యులు స్పష్టం చేయడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో టోర్నీ నుంచి వైదొలిగాడు. రాయల్ చాలెంజర్స్‌కే చెందిన మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ఆడం మిల్నే కూడా గాయాల పాలైన క్రికెటర్ల జాబితాలో చేరారు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్ట్ కుడికాలి మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వైద్యుల సూచన, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఆదేశంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆడం మిల్నే కేవలం ఒక మ్యాచ్ ఆడిన తర్వాత కండరాలు బెణకడంతో టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో పునరావాస శిక్షణ తీసుకుంటున్నాడు. ముంబయి ఇండియన్స్ ఆటగాడు లెండల్ సిమన్స్ కూడా ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా అతను మిగతా మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. అతని ఫిట్నెస్ సమస్య విండీస్‌ను వేధిస్తున్నది. ఐపిఎల్‌కు రాకుండా, ముందుగానే విశ్రాంతి తీసుకొని ఉంటే త్వరగా కోలుకొని ఉండేవాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) వ్యాఖ్యానించింది. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆశలకు కాలి కండరాల నొప్పి తెరదించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌పైనేగాక, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) అధికారుల పైనకూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పీటర్సన్‌కు సెలక్టర్లు ఉద్వాసన పలికారు. ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించడం ద్వారా తన సత్తా నిరూపించుకొని, మళ్లీ ఇంగ్లాండ్ జట్టులో స్థానం సంపాదించాలని అనుకున్న పీటర్సన్ రైజింగ్ పుణె సూపర్‌జెయంట్స్ తరఫున ఆడి కండరాల నొప్పితో టోర్నీకి దూరమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడుతూ కండరాల నొప్పి వేధించడంతో మైదానంలోనే కూలబడిన అతనిని ఎత్తుకొని బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఫిట్నెస్ సమస్య అతని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించే అవకాశాన్ని అతను దాదాపుగా కోల్పోయాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హార్డ్ హిట్టర్ ఫఫ్ డు ప్లెసిస్ ఈసారి ఐపిఎల్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆగాడు. చేతి వేలికి బలమైన గాయం తగలడంతో అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీనితో వెస్టిండీస్‌లో జరిగే ముక్కోణపు సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. రైజింగ్ పుణె తరఫున ఆడిన మరో స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ బ్యాట్స్‌మన్ కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కండరాల నొప్పితో టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాడు గాయపడడం క్రికెట్ ఆస్ట్రేలియాను అందోళనకు గురి చేస్తున్నది. ఆ జట్టు కూడా వెస్టిండీస్‌తో జరిగే ముక్కోణపు వనే్డ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. గాయాలపాలైన రైజింగ్ పుణె ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, భారత స్పిన్నర్ మురుగన్ అశ్విన్ కూడా ఉన్నారు. స్మిత్ ఏప్రిల్ 29న పుణెలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై సెంచరీ సాధించాడు. ఆ వెంటనే చేతి మణికట్టు గాయం కారణంగా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. మురుగన్ అశ్విన్ ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన షాన్ మార్ష్ వెన్నునొప్పితో మిగతా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. తన సోదరుడు మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి దూరమైన మరుసటి రోజే షాన్ కూడా అదే దారిని అనుసరించడం గమనార్హం. వీరిద్దరితోపాటు మరో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, జాన్ హాస్టింగ్స్ కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. మాక్స్‌వెల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు, హాస్టింగ్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. గాయం కారణంగా మాక్స్‌వెల్ ఆ జట్టు ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనలేకపోయాడు. హాస్టింగ్స్ వామప్ మ్యాచ్ ఆడుతూ గాయపడి, చికిత్స నిమిత్తం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఐపిఎల్‌లో ఆడిన తమ కీలక ఆటగాళ్లంతా గాయాలతో వెనుదిరిగి రావడం సిఎ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. భారీగా డబ్బును ఎరచూపి, ఆటగాళ్లను ఆకర్షిస్తూ, వారి కెరీర్‌ను దెబ్బతీస్తున్నదని సిఎ అధికారులు ధ్వజమెత్తుతున్నారు. మిగతా క్రికెట్ బోర్డులు కూడా ఐపిఎల్‌పై నిరసన గళం విప్పడం ఖాయం.

- శ్రీహరి