క్రీడాభూమి

బాక్సింగ్ ఆణిముత్యం అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జూన్ 4: బాక్సింగ్ రంగంలో అసలుసిసలైన ఆణిముత్యం ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ. అతని మృతితో బాక్సింగ్ మాత్రమే కాదు.. యావత్ క్రీడాలోకం ఒక అసాధారణ ప్రతిభావంతుడిని కోల్పోయింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడిన అలీ కొంత కాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శ్వాసకోశ సంబంధనమైన వ్యాధి కారణంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారగా, అలీ కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఫీనిక్స్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ అలీ 74వ ఏట మృతి చెందాడు. బాక్సింగ్ గురించి తెలియని వారికి కూడా ఆ క్రీడను పరిచయం చేసి, దాని పట్ల ఆసక్తిని పెంచిన తొలి బాక్సర్ అలీ. బాక్సింగ్ అంటే ఇష్టపడని వారు కూడా అలీని ఇష్టపడతారు. మూర్త్భీవించిన మానవతావాది కాబట్టే ‘ది గ్రేటెస్ట్’ అనిపించుకున్నాడు. నల్ల జాతీయులపై జరుగుతున్న అమానుషాలను, శే్వత జాతీయుల అహంకార నైజాన్ని జీర్ణించుకోలేకపోయిన కాసియస్ మార్సెలస్ క్లే క్రిస్టియానిటీని వదలిపెట్టి, ఇస్లాం మతాన్ని స్వీకరించి, మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్నాడు. అదే పేరుతో యావత్ ప్రపంచానికి సుపరచితుడయ్యాడు. ప్రతి ఒక్కరూ ‘మనవాడు’ అనుకునేలా అందరితోనూ కలిసిపోయాడు. రింగ్‌లో ఎంత క్రూరుడిగా కనిపిస్తాడో నిజ జీవితంలో ఆయన అంత కంటే ఎక్కువ మానవతావాది. బాక్సింగ్‌లో ప్రత్యర్థులపై ముష్ఠిఘాతాలతో విరుచుకుపడడం అలీ వృత్తి. జాత్యహంకారాన్ని నిరసించడం, అన్యాయాన్ని ఎదిరించడం ఆయన ప్రవృత్తి. వియత్నాంపై అమెరికా యుద్ధాన్ని నిరసించాడు. అప్పట్లో అమల్లో ఉన్న చట్టం ప్రకారం అమెరికా యువకులంతా కొంతకాలం సైన్యంలో పని చేయాల్సి ఉన్నప్పటికీ, వియత్నాంపై అమెరికా అక్రమంగా దాడులు చేస్తోందని బహిరంగా నిరసన గళం విప్పడంతో పాటు సైన్యంలో చేరడానికి నిరాకరించాడు. ఫలితంగా సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నాడు. అమెరికా సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రింగ్‌లోకి దిగినప్పటికీ, పూర్వ వైభవాన్ని సంపాదించలేకపోయాడు. 105 అమెచ్యూర్ ఫైట్స్‌లో 100 విజయాలను సాధించిన అలీ ప్రొఫెషనల్ బాక్సర్‌గా 61 ఫైట్స్‌లో పాల్గొన్నాడు. 37 నాకౌట్స్ సాయంతో 56 ఫైట్స్‌ను గెలిచాడు. 1964లో తొలిసారి ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. 1974లో రెండోసారి, 1978లో మూడోసారి అతను విశ్వవిజేతగా నిలిచాడు. మూడు పర్యాయాలు ఈ టైటిల్‌ను సాధించిన తొలి బాక్సర్‌గా చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. బాక్సింగ్ ఆణిముత్యంగా ప్రకాశించాడు.
చిరుతను మించిన వేగం
మహమ్మద్ అలీది చిరుతను మించిన వేగం. బాక్సింగ్ రింగ్‌లో అతని కాళ్లు చాలా వేగంగా కదులుతాయి. ప్రత్యర్థికి దొరక్కుండా అతను రింగ్‌లో తిరుగుతూ, అవకాశం దొరికిన ప్రతిసారీ మెరుపు వేగంతో బలమైన పంచ్‌లు విసురుతాడు. బాక్సింగ్‌కు శారీరక బలంతోపాటు బుద్ధి బలం కూడా అవసరమని నిరూపించిన తొలి బాక్సర్ అలీయే. బాక్సింగ్ రింగ్‌లో అతను ‘సీతాకో చిలుకలా ఎగురుతూ.. తేనెటీగ మాదిరి కుడతాడు’ అని సన్నిహితులు సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. చాలా మంది హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్లు లావుగా, అందవికారంగా ఉంటారు. కానీ, అలీది విలక్షణ రూపం. ఎత్తుకు తగ్గ లావుతో.. అసలు సిసలైన అథ్లెట్‌కు ఉండాల్సిన లక్షణాలతో అతను సినీ హీరోని తలదనే్నలా ఉంటాడు. ఐర్లాండ్ మూలాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. మూడు దశాబ్దాలు బాక్సింగ్ కెరీర్‌ను కొనసాగించిన అలీ అంటే ప్రత్యర్థులు భయపడతారు.
నేనూ మనిషినే!
అంతకు ముందు 1979లోనూ మహమ్మద్ అలీ భారత్‌కు వచ్చాడు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని, తర్వాతి కాలంలో భారత ప్రధానిగా సేవలు అందించిన రాజీవ్ గాంధీని కలిశాడు. నేషనల్ స్టేడియంలో, అప్పటి భారత జాతీయ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ కౌర్ సింగ్‌తో ఒక ఎగ్జిబిషన్ ఫైట్‌లో పాల్గొన్నాడు. కౌర్ సింగ్ పంచ్‌లను ఒక చేత్తో అడ్డుకుంటూ, రింగ్‌కు సమీపంలో ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ సరదాగా ఫైట్‌ను ముగించాడు. అలీ ఫిట్నెస్‌ను చూసిన తర్వాత ఒక చిన్నారి అభిమానికి అతను మనిషేనా లేక యంత్రమా అన్న అనుమానం వచ్చిందట. వెంటనే అలీ రింగ్ మధ్యలోకి వెళ్లి, గట్టిగా గాలిని పీల్చుకొని, తాను కూడా మనిషినేనని, తనలోనూ ఎముకలు, కండరాలు ఉన్నాయని బిగ్గరగా చెప్పడంతో ఆ ప్రాంతమంతా నవ్వులతో హోరెత్తిపోయింది.