క్రీడాభూమి

రష్యాపై వేటు సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియన్నా, జూన్ 18: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనరాదని రష్యాపై వేసిన సస్పెన్షన్ వేటులో ఎలాంటి పొరపాటు లేదని, అది సరైన నిర్ణయమేనని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఎఎఎఫ్) తేల్చిచెప్పింది. వియన్నాలో సమావేశమైన ఐఎఎఎఫ్ పాలక మండలి రష్యాను ఒలింపిక్స్‌కు అనుమతించాలా లేదా అన్న విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా వేటును తప్పించుకోవచ్చన్న రష్యా ఆశలకు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) తాజా ప్రకటన గండికొట్టింది. రష్యాలో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారని ప్రకటనలో వాడా స్పష్టం చేసింది. ఈ సమావేశానికి రెండు రోజుల ముందే వాడా నివేదిక వెల్లడి కావడం విశేషం.
వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా రష్యా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడానికి వీలుగా అథ్లెట్లతో ప్రభుత్వమే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేసిందని వాడా ఆధ్వర్యంలోని కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.
వాడా ఆధ్వర్యంలోని స్వతంత్ర కమిటీ రెండు విడతలుగా సమర్పించిన నివేదికల్లో ఎవరూ ఊహించని కొత్తకొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మెగా ఈవెంట్స్‌లో పతకాలను సాధించడానికి రష్యా ప్రభుత్వమే అథ్లెట్లకు డోపింగ్ అలవాటు చేసిందన్న నిజాన్ని ఈ కమిటీ బయటపెట్టింది. ఒక దేశ ప్రభుత్వమే వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదన్న విషయం క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టించింది. రష్యా అనైతిక విధానాలకు ఐఎఎఎఫ్ అధికారుల సహకారం ఉందని కూడా ఆ కమిటీ నిగ్గుతేల్చింది. రష్యా నిర్వాకంతో డోపింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం, జాతీయ క్రీడా సమాఖ్యలు కలిసి అథ్లెట్లకు బలవంతంగా మాదక ద్రవ్యాలను అలవాటు చేశాయన్న సరికొత్త వాస్తవం బయటపడింది. ఇలావుంటే, గతంలో ఐఎఎఎఫ్ అధికారుల మద్దతు కూడా రష్యాకు ఉండిందని, అందుకే వ్యూహాత్మక డోపింగ్ నిరాటంకంగా కొనసాగిందనీ వచ్చిన ఆరోపణలు ప్రపంచ క్రీడా సమాఖ్యలను అప్రమత్తం చేశాయి. ఐఎఎఎఫ్ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రష్యాపై వేసిన సస్పెన్షన్ వేటను ఖరారు చేసింది. దానిని ఎత్తివేయాలంటూ రష్యా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
అనైతికం.. కుట్ర: పుతిన్
ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా తమపై సస్పెన్షన్‌ను విధించడం అనైతికమని, తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు నిదర్శమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఆరోపించాడు. డోపింగ్ ఆరోపణలపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించి, ఎన్నో చర్యలు తీసుకుందని పేర్కొన్నాడు. డోపింగ్ రహిత క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, పొరపాట్లు పునరావృతం కావని ఇప్పటికే భరోసా ఇచ్చామని మాస్కో నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, ఐఎఎఎఫ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, రష్యాను కావాలనే సస్పెండ్ చేసిందని ధ్వజమెత్తాడు.
ఆ చర్యలు సరిపోవు: ఐఎఎఎఫ్
డోపింగ్ రహిత క్రీడా రంగం కోసం రష్యా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని ఐఎఎఎఫ్ వ్యాఖ్యానించింది. ఆ దేశం తీసుకున్న చర్యలు సరిపోవని, డోపింగ్ దోషులపై కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేసింది. రష్యా సరైన దిశగా చర్యలు తీసుకోకపోవడంతోనే ఒలింపిక్స్ నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి పాలక మండలి సాకనూలంగా ఓటు వేసిందని తెలింపింది. భవిష్యత్తులో సస్పెన్షన్ ఎత్తివేత గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొంది.
డోప్ దోషులకు స్థానం లేదు
డోప్ దోషులకు రియో ఒలింపిక్స్‌లో స్థానం లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశాడు. వాడా చేసిన ప్రకటనపై అతను స్పందిస్తూ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అన్నాడు. ఒలింపిక్స్ ఆశయానికి, స్ఫూర్తికి విఘాతం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఆరు వేర్వేరు క్రీడా విభాగాల్లో పోటీపడిన 12 దేశాలకు చెందిన 31 మంది అథ్లెట్లను వాడా డోపింగ్ దోషులుగా గుర్తించడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నాడు. విజయాలను సాధించేందుకు అడ్డదారులను ఎంచుకున్న కొంత మంది ఉత్ప్రేరకాలను వాడుతున్నారని బాచ్ అన్నాడు. రియో ఒలింపిక్స్‌లో అలాంటి వారిని ఏరివేస్తామని అన్నాడు.
**
రష్యాపై సస్పెన్షన్ ఫలితంగా, ఆ దేశానికి చెందిన అథ్లెట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) పతాకం కింద పోటీ చేయాల్సి వస్తుంది. వారి టైటిళ్లుగానీ, రికార్డులుగానీ రష్యా ఖాతాలోకి వెళ్లవు.