క్రీడాభూమి

భారత్ షూటౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: వివాదాస్పదంగా మారిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో ఓడిన భారత్ రజత పతకంతో సంతృప్తి చెందింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టైటిల్ పోరులో భారత ఆటగాళ్లు అసాధారణ స్థాయిలో రాణించారు. గోల్స్ చేసే అవకాశాలను చేజార్చుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా దూకుడుకు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. డానియల్ బీయెల్‌కు షూటౌట్‌లో మరో అవకాశం ఇవ్వడాన్ని ప్రతిఘటించిన భారత్ అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది. అయితే, టోర్నమెంట్ నిర్వాహకులు ఈ అభ్యంతరాన్ని తోసిపుచ్చి, ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. షూటౌట్‌లో ఆస్ట్రేలియా మూడు గోల్స్ చేయగా, భారత్ ఒక గోల్‌కు పరిమితమై రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.
కడ వరకూ హోరాహోరీ
ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఫైనల్‌లో ఢీకొన్న భారత్ అసాధారణ స్థాయిలో పోరాటాన్ని కొనసాగింది. 14వ పర్యాయం టైటిల్ అందుకునే ఊపుమీద ఉన్న ఆస్ట్రేలియాకు మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన భారత్ నుంచి ఆ స్థాయిలో పోటీ ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ మొదలైన మరుక్షణం నుంచే భారత రక్షణ విభాగంపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. అయితే, వారి ప్రయత్నాలను భారత గోల్‌కీపర్ శ్రీజేష్ తిప్పికొట్టాడు. మ్యాచ్ మొదట్లోనే భారత ఆటగాడు మన్దీప్ సింగ్ కొట్టిన బంతి ఆస్ట్రేలియా గోల్‌కీపర్ ఆండ్రూ చార్టర్ ప్యాడ్స్‌కు తగిలి ఉతప్ప వద్దకు వెళ్లింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను బంతిని ఆసీస్ గోల్ పోస్టుకు దూరంగా కొట్టాడు. 13వ నిమిషంలో భారత్ రెండు పెనాల్టీ కార్నర్లను సంపాదించినా, వాటిని చార్టర్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆకాష్‌దీప్ సింగ్, ప్రదీప్ మోర్ తదితరులు కూడా తమకు అందిన అవకాశాలను వినియోగించుకోవడంలో విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అదే రీతిలో కొనసాగింది. గ్లేన్ టర్నర్ కొట్టిన బంతి భారత డిఫెండర్ ప్రదీప్ మోర్ కాలికి తలిగి దూరంగా వెళ్లిపోయింది. డానియల్ బీయెల్ గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా, ఆతర్వాత మాథ్యూ స్వాన్, ట్రెంట్ మిటన్ కొట్టిన బంతులకు శ్రీజేష్ కోటగోడలా అడ్డుపడ్డాడు. ఇరు జట్లు ఒకరి ప్రయత్నాలను మరొకరు విఫలం చేసిన నేపథ్యంలో, మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే వరకూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. దీనితో మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో అరాన్ జలెవ్‌స్కీ, డానియల్ బీయెల్, సైమన్ ఆర్చర్డ్ తమతమ అవకాశాలను సద్వినియోగం చేసుకోగా, ట్రెంట్ మిట్టన్ కొట్టిన బంతిని శ్రీజేష్ అడ్డుకున్నాడు.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కడే షూటౌట్‌లో గోల్ చేయగలిగాడు. సురేందర్ కుమార్, ఎస్వీ సునీల్, ఎస్‌కె ఉతప్ప కొట్టిన బంతులను ఆసీస్ గోల్‌కీపర్ చార్టర్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. దీనితో భారత్‌కు 1-3 తేడాతో ఓటమి తప్పలేదు.

తొలి రజతం
చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ మొదటిసారి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తొలి ఫైనల్ చేరిన భారత్ చేసిన పోరు అందరినీ ఆకట్టుకుంది. టైటిల్ సాధించలేకపోయినప్పటికీ, వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. 1982లో భారత్ తొలిసారి ఈ మెగాటోర్నీలో రజత పతకం సాధించింది. 34 సంవత్సరాల తర్వాత, రజత పతకాన్ని గెల్చుకుంది. రియో ఒలింపిక్స్ దగ్గర పడుతున్న సమయంలో లభించిన ఈ పతకం భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం.
నజరానా
చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకాన్ని సాధించిన భారత జట్టులోని ఆటగాళ్లకు తలా రెండు లక్షల రూపాయల నగదు నజరానాను హాకీ ఇండియా (హెచ్‌ఎ) అధ్యక్షుడు నరేందర్ బత్రా ప్రకటించాడు. ఇంతే మొత్తాన్ని కోచ్ అల్ట్‌మన్స్‌కు కూడా ఇస్తామన్నాడు. ఇతర సహాయక బృందంలోని ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున చెల్లిస్తామని అన్నాడు.

చిత్రం చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలిసారి రజత పతకాన్ని సాధించిపెట్టిన ఆటగాళ్లు