క్రీడాభూమి

కోపా అమెరికా ఫుట్‌బాల్ మెస్సీ ‘రికార్డు’ గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫాక్స్‌బరో (అమెరికా), జూన్ 19: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో ఒక కీలక మైలురాయిని చేరుకున్నాడు. వెనెజులాతో జరిగిన క్వార్టర్ మ్యాచ్‌లో అతను రికార్డు గోల్ చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధికంగా 54 గోల్స్ సాధించిన గాబ్రియెల్ బటిస్టా రికార్డును అతను సమం చేశాడు. ఈ టోర్నీలో నాలుగో గోల్ చేసిన మెస్సీకి అర్జెంటీనా తరఫున ఇది 111వ మ్యాచ్. 1991-2002 మధ్యకాలంలో ఆడిన బటిస్టా 77 మ్యాచ్‌లు ఆడి 54 గోల్స్ చేశాడు. ఆ రికార్డును అందుకున్న మెస్సీ ఈ టోర్నీలోనే దానిని అధిగమించే అవకాశాలున్నాయి. యూరో 2016లో ఆడుతున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో మెస్సీ ఒక అరుదైన రికార్డును సమం చేయడం విశేషం. అర్జెంటీనా తరఫున ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో బటిస్టా, మెస్సీ నంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటుండగా, హెన్మన్ క్రెస్పో (35 గోల్స్), డిగో మారడోనా (34 గోల్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇలావుంటే, వెనెజులాతో జరిగిన మ్యాచ్ 8వ నిమిషంలోనే అర్జెంటీనాకు గొంజాలో హిగుయిన్ గోల్‌ను అందించాడు. ప్రత్యర్థి జట్టు కోలుకోక ముందే, 28వ నిమిషంలో మరో గోల్‌ను సంధించాడు. ప్రథమార్ధం ముగిసే సమయానికి అర్జెంటీనా 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ద్వితీయార్ధంలో అదే ఒరవడిని కొనసాగించింది. 60వ నిమిషంలో మెస్సీ తన కెరీర్‌లో కీలక గోల్ చేశాడు. 70వ నిమిషంలో వెనెజులా ఆటగాడు జోస్ సాల్మన్ రొన్డొన్ గోల్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒక నిమిషం తేడాలోనే ఎరిక్ లమెలా గోల్ సాధించాడు. వెనెజులాపై 4-1 ఆధిక్యంతో విజయభేరి మోగించిన అర్జెంటీనా సెమీ ఫైనల్‌లో అమెరికాను ఢీ కొంటుంది.

యూరో 2016 సాకర్
పెనాల్టీలో రోనాల్డో విఫలం
ఆస్ట్రియాతో పోర్చుగల్ మ్యాచ్ డ్రా
పారిస్, జూన్ 19: స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అనూహ్య వైఫల్యం ఆస్ట్రేలియాతో పోర్చుగల్ మ్యాచ్‌ని డ్రాగా ముగిసింది. యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్‌కు ఇది వరుసగా రెండో డ్రా కావడం గమనార్హం. ఇరు జట్లు వ్యూహాత్మక డిఫెన్స్‌కు పరిమితమై గోల్స్ చేయడంపై ఆసక్తిని ప్రదర్శించలేదు. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో పోర్చుగల్‌కు పెనాల్టీ షూట్ లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రొనాల్డో విఫలమయ్యాడు. అతను కొట్టిన బంతి గోల్ పోస్టు నుంచి దూరంగా దూసుకెళ్లింది. ఆతర్వాత మళ్లీ సంకుల సమరం కొనసాగింది. చివరికి ఇరు జట్లు గోల్స్ చేయలేక, మ్యాచ్‌ని డ్రాగా ముగించాయి. కాగా, రొనాల్డో వైఫల్యం అభిమానులను నిరాశ పరచగా, ప్రత్యర్థులకు విమర్శలు గుప్పించే అవకాశం ఏర్పడింది. ప్రత్యేకించి మెస్సీ అభిమానులు రొనాల్డోను హేళన చేస్తూ, అతనిలో మునుమటి నైపుణ్యం కనిపించడం లేదంటూ ప్రచారం ఆరంభించారు. రొనాల్డో సైతం పెనాల్టీ అవకాశం చేజారడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. చాలా సేపు అతను అన్యమనస్కంగానే మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ డ్రా కావడంతో అతను నిరాశ చెందాడు.

పాఠాలు నేర్వాలంటే తప్పులు చేయాలా?: ధోనీ
హరారే, జూన్ 19: పాఠాలు నేర్చుకోవాలంటే తప్పులు చేయాల్సిన అవసరం లేదని భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. తప్పులు చేస్తేనే పాఠాలు నేర్చుకుంటారా అంటూ సహచరులను ప్రశ్నించాడు. జింబాబ్వేతో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో టీమిండియా లక్ష్యాన్ని సాధించడంలో విఫలమై, రెండు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. సోమవారం రెండో టి-20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అతను విలేఖరులతో మాట్లాడుతూ మొదటి మ్యాచ్‌లో పొరపాట్లు జరిగాయని అంగీకరించాడు. పరాజయాలు పాఠాలను నేర్పుతాయని, కానీ, పాఠాలు నేర్చుకోవడానికి పొరపాట్లు చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అత్యంత కీలక సమయాల్లో బ్యాట్స్‌మెన్ వికెట్లు పారేసుకున్నారని చెప్పాడు. జట్టులోని యువ ఆటగాళ్లు మొదటి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లను రెండో మ్యాచ్‌లో పునరావృతం చేయరన్న నమ్మకం తనకు ఉందన్నాడు. తొలి టి-20లో ఓడినందుకు నిరాశ చెందానని ధోనీ అన్నాడు. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదని జట్టు సభ్యులకు స్పష్టం చేశాడు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న విషయాన్ని మరచిపోకూడదని చెప్పాడు. చివరి బంతిని మజీవా చాలా అద్భుతంగా వేశాడని అంటూ, నిజానికి మ్యాచ్‌ని విన్నింగ్ షాట్‌తో పూర్తి చేయాల్సిన బాధ్యత తనదేనని, కానీ, ఆ ప్రయత్నంలో తాను విఫలమయ్యానని అన్నాడు. ఓటమికి బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నాడు.
ఇది ఐపిఎల్ కాదు..
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అంతర్జాతీయ సిరీస్ అంటే ఐపిఎల్ కాదని ధోనీ వ్యాఖ్యానించాడు. రెంటికీ చాలా తేడా ఉందని అన్నాడు. ఐపిఎల్‌లో ఒక మ్యాచ్ ఫలితం వల్ల తీవ్రమైన ప్రభావమేదీ పడదని, గ్రూప్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఒకసారి విఫలమైనా మరోసారి మళ్లీ రాణించే అవకాశం ఉంటుందని చెప్పాడు. కానీ, అంతర్జాతీయ సిరీస్‌లలో ప్రతి మ్యాచ్ చాలా కీలకమైనదేనని తెలిపాడు. కేవలం కాగితంపై ఆటగాళ్ల పేర్లను, వారి బలాబలాలను చూస్తూ మ్యాచ్‌లు ఆడడం వల్ల ఎలాంటి లాభం ఉండదని స్పష్టం చేశాడు. రెండో మ్యాచ్‌లో విజయం సాధిస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు.

ఎరాంగకు అనారోగ్యం
నాటింగ్‌హామ్, జూన్ 19: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షామిండ ఎరాంగ అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యాడు. అతను గుండె సంబంధమైన సమస్యతో బాధపడుతున్నాడని, వెంటనే ఆసుపత్రికి తరలించామని జట్టు వర్గాలు తెలిపాయి. ఇంగ్లాండ్‌తో రెండు రోజుల్లో మొదటి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుండగా, ఎరాంగ అనారోగ్యం లంక జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ జరుగుతున్నప్పుడు గాయపడిన ధమ్మిక ప్రసాద్, దుష్మంత చమీరా జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు ఎరాంగ కూడా అందుబాటులో లేకపోవడంతో లంక బౌలింగ్ విభాగం బలహీన పడడం ఖాయం. కాగా, టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలోనే ఎరాంగ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఫిర్యాదు కూడా అందింది. అతను త్వరలోనే బయోమెకానిక్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం బౌలింగ్ చేసే సమయంలో చేతి వంపు ఎక్కువలో ఎక్కువ 15 డిగ్రీల వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ వంపు ఉంటే బౌలింగ్‌కు అనర్హత వేటు పడుతుంది. బయో పరీక్షకు హాజరుకాక ముందే అనారోగ్యంతో ఎరాంగ ఆసుపత్రిపాలయ్యాడు.

ఐస్‌లాండ్, హంగరీ మ్యాచ్ డ్రా
పారిస్, జూన్ 19: కోపా అమెరికా ఫుట్‌బాల్‌లో భాగంగా ఐస్‌లాండ్, హంగరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఐస్ లాండ్‌కు 40వ నిమిషంలో గిల్ఫీ సిగురొసన్ తొలిగోల్‌ను అందించాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో ఐస్‌లాండ్ ఆటగాడు బిర్కిర్ మార్ సెవర్హన్ సెల్ఫ్ గోల్ చేయడంతో హంగరీకి ఈక్వెలైజర్ లభించింది. మ్యాచ్ 1-1గా డ్రా అయింది.
లుకాకు డబుల్
మరో మ్యాచ్‌లో బెల్జియం 3-0 తేడాతో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌పై గెలుపొందింది. మ్యాచ్‌పై పూర్తి పట్టును సాధించిన బెల్జియం తరఫున రొమెలూ లుకాకు రెండు గోల్స్ చేసి, ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను 48, 70 నిమిషాల్లో గోల్స్ చేసి, ఐర్లాండ్‌ను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టాడు. 61వ నిమిషంలో అక్సెల్ విట్సెల్ ఒక గోల్ సాధించాడు. బెల్జియంను నిలువరించి గోల్స్ చేయడంలో ఐర్లాండ్ విఫలమైంది.

క్రెమెర్ సేన ఉత్సాహం
హరారే, జూన్ 19: గ్రేమ్ క్రెమెర్ నాయకత్వంలోని జింబాబ్వేలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. భారత్‌పై అనుకోని విజయాన్ని సాధించిన తర్వాత ఆ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. రెండో టి-20ని కూడా గెల్చుకుంటే ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. లేకపోతే, మూడో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. అక్కడా పరిస్థితి తారుమారైనా భారీ నష్టమేమీ ఉండదు. భారత్‌పై ఆ జట్టు విజయాన్ని ఎవరూ ఊహించలేదు కాబట్టి, క్లిన్‌స్వీప్ నుంచి తప్పించుకున్న ఘనతైనా దక్కించుకుంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతున్న జింబాబ్వే రెండో టి-20లో భారత్‌కు గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి.