క్రీడాభూమి

ముక్కోణపు వనే్డ సిరీస్ ఫైనల్‌కు ఆసీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిడ్జిటౌన్, జూన్ 22: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లో ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు సాధించింది. మార్లొన్ శామ్యూల్స్ 134 బంతుల్లో, 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 125 పరుగులు సాధించగా, దనేష్ రాందిన్ 92 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు. వీరిద్దరి ప్రతిభతో వెస్టిండీస్ గౌరవ ప్రదమైన స్కోరును నమోదు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 51 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ ఫాల్క్‌నెర్, స్కాట్ బోలాండ్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
ఫైనల్‌లో స్థానం కోసం 283 పరుగులు సాధించాల్సిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా (17), ఆరోన్ ఫించ్ (16) తక్కువ స్కోర్లకే అవుట్‌కాగా, మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జార్జి బెయిలీ జట్టును ఆదుకున్నారు. బెయిలీ 46 బంతుల్లో 34 పరుగులు చేయగా, స్మిత్ 107 బంతులు ఎదుర్కొని, ఐదు ఫ్లోతో 78 పరుగులు చేసి రనౌటయ్యాడు. మిచెల్ మార్క్ 85 బంతుల్లో 79 (ఆరు ఫోర్లు), మాక్స్‌వెల్ 26 బంతుల్లో 46 (ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియాను ఫైనల్ చేర్చారు.

యూరో 2016 సాకర్
క్రొయేషియా చేతిలో
స్పెయిన్ ఓటమి
పారిస్, జూన్ 22: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌ని 1-2 తేడాతో కోల్పోయిన స్పెయిన్‌కు ఇటలీ భయం పట్టుకుంది. ఈ ఓటమి కారణంగా ప్రీ క్వార్టర్స్‌లో ఈ జట్టు పటిష్టమైన ఇటలీని ఢీకొనాల్సి రావడమే అందుకు కారణం. క్రొయేషియాపై హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన స్పెయిన్‌కు ఏడో నిమిషంలోనే అల్వరో మొరాటా గోల్‌ను అందించాడు. ఆరంభంలోనే ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాల్సిన స్పెయిన్ అందుకు భిన్నంగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా ఆడింది. 45వ నిమిషంలో నికొలా కలినిక్ క్రొయేషియాకు ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టిన తర్వాత కూడా దాడులకు ఉపక్రమించాలన్న ఆలోచన లేకుండా రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. 87వ నిమిషంలో ఇవాన్ పెరిసిక్ గోల్ సాధించి, క్రొయేషియాను 2-1 ఆధిక్యంలో నిలబెట్టే వరకూ స్పెయిన్‌కు వాస్తవ పరిస్థితి అర్థం కాలేదు. అయితే, అప్పటికే సమయాతీతం కావడంతో ఎదురుదాడికి దిగి, ఈక్వలైజర్‌ను సాధించే అవకాశం స్పెయిన్‌కు లభించలేదు. ఈ విజయంతో క్రొయేషియా ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ జట్టుతోపాటు వేల్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు కూడా ప్రీ క్వార్టర్స్ చేరి, ప్రత్యర్థి జట్లు ఎవరో ఖరారయ్యే తరుణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, రెండు ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మాత్రం ఎవరెవరి మధ్య జరుగుతాయో స్పష్టమైంది. స్విట్జర్లాండ్‌ను పోలాండ్ ఢీకొంటుంది. బలమైన జట్టుగా పేరు సంపాదించిన ఇటలీతో స్పెయిన్ తలపడుతుంది.
ఇతర మ్యాచ్‌ల్లో పోలాండ్, జర్మనీ, టర్కీ తమతమ ప్రత్యర్థులను ఓడించాయి. జాకబ్ బ్లాజ్‌కొవ్‌స్కీ 54వ నిమిషంలో చేసిన గోల్‌తో ఉక్రెయిన్‌పై పోలాండ్ 1-0 తేడాతో గెలిచింది. నార్త్ ఐర్లాండ్‌ను జర్మనీ 1-0 తేడాతో ఓడించింది. మారియో గోమెజ్ 30వ నిమిషంలో చేసిన కీలక గోల్ జర్మనీకి విజయాన్ని అందించింది. చెక్ రిపబ్లిక్‌పై టర్కీ విజయభేరి మోగించింది. 10వ నిమిషంలో బురాక్ ఇల్మాజ్, 65వ నిమిషంలో ఒజాన్ టఫాన్ గోల్స్ చేసి, టర్కీని గెలిపించారు.

కేరళ క్రీడా మండలికి
అంజూ జార్జి రాజీనామా
తిరువనంతపురం, జూన్ 22: కేరళ క్రీడా మండలి (కెఎస్‌సి) అధ్యక్ష పదవికి మాజీ ఒలింపియన్, ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఏకైక పతకాన్ని సాధించి పెట్టిన స్టార్ అథ్లెట్ అంజూ బి. జార్జి రాజీనామా చేసింది. కేరళ క్రీడల మంత్రి జయరాజన్ తనను కించ పరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవలే ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. కెఎస్‌సి అధ్యక్షురాలిగా తాను అదే వివిధ అంశాలపై చర్చించడానికి జయరాజన్‌ను కలిసినప్పుడు ఆయన చాలా అమర్యాదగా మాట్లాడాడని అంజూ జార్జి ఇటీవలే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆరోపించింది. తనను యుడిఎఫ్ ఏజెంటుగానూ, అక్రమాలకు పాల్పడే వ్యక్తిగానూ అభివర్ణించాడని వాపోయింది. కానీ తనకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేసింది. జయరాజన్ తనను కించ పరిచిన విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ, అక్కడి నుంచి ఆమెకు సరైన స్పందన లభించలేదు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కెఎస్‌సి అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది. గత యుడిఎఫ్ ప్రభుత్వం తనను కెఎస్‌సి అధ్యక్షురాలిగా నియమించిందని, అంతమాత్రం చేత తనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగానూ, ఏజెంటుగానూ ముద్ర వేయడం అన్యాయమని ఆమె తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ పేర్కొంది. తాను తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినట్టు తెలిపింది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఎల్‌టిఎఫ్ సర్కారుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పింది. కానీ, క్రీడల మంత్రి తనను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నది.