క్రీడాభూమి

క్వాలిఫయంగ్ ఈవెంట్‌లో వికాస్‌కు కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బకూ (అజర్‌బైజాన్), జూన్ 24: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. అంతేగాక అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఆధ్వరంలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నమెంట్ 75 కిలోల విభాగంలో పోటీపడిన అతను క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన లీ డోంగ్యున్‌ను 3-0 తేడాతో ఓడించాడు. అయితే, ఆ ఫైట్‌లో అతని నుదుటికి బలమైన గాయమైంది. తుర్కమెనిస్తాన్‌కు చెందిన అచిలొవ్ అర్‌స్లాన్‌బెక్‌తో సెమీ ఫైనల్‌లో తలపడాల్సిన వికాస్ నుదుటికి కుట్లు పడడంతో రింగ్‌లోకి దిగలేకపోయాడు. వైద్యులు అతనిని ఫైట్‌కు అంగీకరించలేదని, అందుకే సెమీ ఫైనల్ మ్యాచ్‌ని అతను వదులుకున్నాడని భారత అధికారులు ప్రకటించారు. నిబంధనలను అనుసరించి సెమీస్ చేరిన నలుగురిలో ఇద్దరు ఫైనల్‌కు చేరితే, మిగతా ఇద్దరికి కాంస్య పతకం లభిస్తుంది. ఈ నిబంధన ప్రకారం వికాస్‌కు కాంస్య పతకం లభించింది. సెమీస్ చేరడంతోనే అతనికి ఒలింపిక్స్‌కు అర్హత లభించింది. 64 కిలోల విభాగంలో మనోజ్ కుమార్ ఇప్పటికే సెమీస్ చేరడం ద్వారా ఒలింపిక్స్ వెళ్లే అర్హత సంపాదించాడు. అతను సెమీ ఫైనల్‌లో యూరోపియన్ చాంపియన్ పాట్ మెక్‌కార్మాక్‌ను ఢీ కొంటాడు. 56 కిలోల విభాగంలో శివ థాపా కూడా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. కాగా, 49 కిలోల విభాగంలో దేవేంద్రో సింగ్, 81 కిలోల విభాగంలో సుమీత్ సంగ్వాన్ ఒలింపిక్స్‌లో అర్హత కోసం పోటీపడతారు.
క్వాలిఫయర్స్‌కు ముగ్గురు భారతీయులు
ఎఐబిఎ ఆధ్వర్యంలో వచ్చేనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు ముగ్గురు భారత ప్రొఫెషనల్ బాక్సర్లు అర్హత సంపాదించారు. ఇడబ్ల్యుబిసి ఆసియా టైటిల్ విజేత నీరజ్ గోయత్‌తోపాటు 52 కిలోల విభాగంలో గౌరవ్ బింధురీ, 81 కిలోల విభాగంలో దిల్బాగ్ సింగ్ క్వాలిఫయర్స్‌లో పోటీపడతారు. వారు కనీసం సెమీస్ చేరితో రియో ఒలింపిక్స్‌లో ప్రొఫెషనల్ బాక్సర్లకు జరిగే పోరుకు అర్హత సంపాదిస్తారు.

నాపై ఒత్తిడి లేదు
ఇంగ్లాండ్ సాకర్ కెప్టెన్ రూనీ
చాంటిలీ (ఫ్రాన్స్), జూన్ 24: గతంలో తానొక్కడిపైనే జట్టులో ఆధారపడి ఉన్నట్టు కనిపించేదని, ఇప్పుడు ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లే ఉండడంతో తనపై ఒత్తిడి తగ్గిందని ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ వేన్ రూనీ వ్యాఖ్యానించాడు. యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌ను సోమవారం ఐస్‌లాండ్‌తో ఆడనున్న ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న అనంతరం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూనీ ధీమా వ్యక్తం చేశాడు. నైస్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో మిడ్‌ఫీల్డర్‌గా తాను తన పాత్ర పోషిస్తానని అన్నాడు. హారీ కేన్, జమీ వార్డీ, డానియల్ స్టరిడ్జి తదితరులు మంచి ఫామ్‌లో ఉన్నారని, కాబట్టి, యూరో కప్ టోర్నీలో తాము ముందంజ వేయడం ఖాయమని అన్నాడు. తాను సరిగ్గా రాణించకపోతే జట్టు ఓడిపోతుందనే భయం గతంలో తనకు ఉండేదని, ఇప్పుడు అలాంటి ఆందోళనలు లేవని పేర్కొన్నాడు. తమతో పోటీపడుతూ జట్టుకు సేవలు అందించగల సత్తావున్న వారు చాలా మంది ఉన్నారని చెప్పాడు. ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా మ్యాచ్‌లు ఆడే అవకాశం తనకు లభిస్తున్నదని అన్నాడు. యూరో టోర్నీలో పోటీపడుతున్న అన్ని జట్లలో ఇంగ్లాండ్ ప్రత్యేకమైనదని చెప్పాడు. మ్యాచ్‌లను గెలిస్తే సత్తా తమకు ఉందన్నాడు. టైటిల్ రేసులో ఇంగ్లాండ్ ముందుంటుందని అన్నాడు. యూరోలోవ విజయం ఆశించినంత సులభం కాదన్న విషయం తనకు తెలుసునని అంటూ, తమ జట్టులోని ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంది కాబట్టే టైటిల్‌పై భరోసా ఉంటుందని వ్యాఖ్యానించాడు. క్రొయేషియాతో జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్ తమకు ఎంతో కీలకమైనదని అతను పేర్కొన్నాడు.

మరో దాడికి రొనాల్డో రెడీ

లెన్స్, జూన్ 24: పోర్చుగల్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి ప్రత్యర్థి జట్లపై దాడికి ఉపక్రమించి, విజయాలను సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. హంగరీతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతను ఆ పోరును డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక, నాలుగు యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌లో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రొయేషియాతో జరిగే ప్రీ క్వార్టర్స్‌లో గోల్ చేస్తే, యూరో సాకర్‌లో అత్యధికంగా తొమ్మిది గోల్స్‌తో రికార్డు సృష్టించిన ఫ్రెంచ్ లెజెండ్ మైఖేల్ ప్లాటినీ సరసన స్థానం సంపాదిస్తాడు. క్రొయేషియాతో జరిగే మ్యాచ్‌లో పోర్చుగల్‌ను అండర్ డాగ్‌గా పేర్కోవడాన్ని రొనాల్డో తప్పుపట్టాడు. తామంతా క్రొయేషియాతో పోరుకు సిద్దంగా ఉన్నామని అన్నాడు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం లేదని చెప్పాడు. అయితే, తాము విజయం సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు. క్రొయేషియాను యూరో కప్ రేసు నుంచి తప్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఫామ్‌లోనే ఉన్నారని చెప్పాడు. టైటిల్ సాధించడమే ధ్యేయంగా పోరాడతామని అన్నాడు.
యూరో 2016 సాకర్
చిన్న జట్లకు
గొప్ప అవకాశం!
పారిస్, జూన్ 24: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న పలు చిన్న జట్లకు ఫైనల్ చేరే గొప్ప అవకాశం లభించింది. పలు మేటి జట్లు ప్రీ క్వార్టర్స్‌లో పరస్పరం ఢీకొంటున్న కారణంగా, ద్వితీయ భాగంలో ఉన్న అంతగా పేరులేని జట్లు ముందంజ వేయడానికి మార్గం ఏర్పడింది. డిఫెండింగ్ చాంపియన్ ఇటలీతో మరో బలమైన జట్టు స్పెయిన్ ఢీ కొంటున్నది. అదే విధంగా ఇంగ్లాండ్, ఐస్‌లాండ్ జట్ల మధ్య ఒక ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో ఫ్రాన్స్, స్లొవేకియాతో జర్మనీ తలపడతాయి. బాటమ్ హాఫ్‌లో ఉన్న జట్ల ఖాతాల్లో మొత్తం 11 ప్రపంచ కప్ టైటిళ్లు, తొమ్మిది యూరోపియన్ చాంపియన్‌షిప్స్ ఉన్నాయి. అలాంటి బలమైన జట్లు పరస్పరం తలపడుతున్న తరుణంలో బెల్జియం, క్రొయేషియా, స్విట్జర్లాండ్, పోలాండ్, వేల్స్ వంటి సాధారణ జట్లకు ముందంజ వేసే అవకాశం లభించింది. అంతర్జాతీయ సాకర్‌లో ఇప్పటి వరకూ ఒక్క మేజర్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకోలేకపోయిన ఈ జట్లు మొదటిసారి తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. డ్రా కూడా మేటి జట్ల మధ్య సంకుల సమరం, చిన్న జట్లకు అటవిడుపును కల్పించడం విశేషం.

బిగ్‌బాష్‌కు హర్మన్‌ప్రీత్
న్యూఢిల్లీ, జూన్ 24: భారత ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఆడనుంది. టి-20 ఫార్మెట్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజీ ఉంది. ఇప్పటికే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఆమెను రిలీవ్ చేయడానికి బిసిసిఐ అంగీకరించింది. బిగ్‌బాష్‌లో హర్మన్‌ప్రీత్ ఆడడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బిసిసిఐ ప్రకటించింది. దీనితో ఆమె ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమైంది.
ఐ-లీగ్‌కు సాల్గోంకర్, గోవా గుడ్‌బై
న్యూఢిల్లీ, జూన్ 24: ఐ-లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని సాల్గోంకర్ ఫుట్‌బాల్ క్లబ్, స్పోర్టింగ్ క్లబ్ డి గోవా నిర్ణయించాయి. దేశంలో లీగ్ సాకర్ విధానాన్ని పూర్తిగా మార్చేయాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) తీసుకున్న నిర్ణయాన్ని ఈ రెండు క్లబ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తూ దేశవాళీ ఫుట్‌బాల్‌ను ఎఐఎఫ్‌ఎఫ్ నీరుగారుస్తున్నదని ధ్వజమెత్తుతున్నాయి. క్లబ్‌ల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఎఐఎఫ్‌ఎఫ్ మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నదని, అందుకే తాము ఐ-లీగ్ నుంచి వైదొలగుతున్నామని ఈ రెండు క్లబ్‌లు ప్రకటించాయి.