అంతర్జాతీయం

అమెరికా చర్య దురాక్రమణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో/బీరూట్, ఏప్రిల్ 7: సిరియా వైమానిక స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. అంతేకాదు అమెరికా దాడి తర్వాత సిరియా గగనతల రక్షణ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయనున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, తమ వైమానిక స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులను సిరియాలోని బషర్ అసద్ ప్రభుత్వం సైతం తీవ్రంగా ఖండిస్తూ, ఇది అమెరికా తమ దేశంపై జరిపిన దురాక్రమణగా అభివర్ణించింది. సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని పట్టణంలో అసద్ ప్రభుత్వం జరిపిన రసాయనిక దాడికి ప్రతీకారంగా శుక్రవారం తెల్లవారుజామున అమెరికా దళాలు సిరియా వైమానిక స్థావరంపై క్రూయిజ్ క్షిపణులతో భారీ ఎత్తున దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 9 మంది చనిపోగా, భారీఎత్తున ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.
ఈ దాడిని ఒక సర్వసత్తాక ప్రభుత్వంపై జరిపిన దాడిగా అభివర్ణించిన రష్యా, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తున్నట్లు మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంటూ, అమెరికా క్షిపణి దాడిని చర్చించడానికి తక్షణమే భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ దాడి అమెరికా- రష్యా సంబంధాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కూడా అధ్యక్ష కార్యాలయం అభిప్రాయ పడింది. అంతేకాదు అమెరికా గనుక సిరియాలో సైనిక చర్యకు పాల్పడిన పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని కూడా అసద్ ప్రభుత్వానికి మద్దతుగా సిరియాలో సైనిక చర్యను కొనసాగిస్తున్న రష్యా హెచ్చరించింది.
9 విమానాలు ధ్వంసం: సిరియా సైన్యం
అమెరికా చర్యను దురాక్రమణగా అభివర్ణించిన సిరియా సైన్యం షేరత్ ఎయిర్‌బేస్‌పై జరిపిన దాడిలో ఆరుగురు చనిపోగా, పలువురు గాయపడినట్లు తెలిపింది. వైమానిక స్థావరానికి సైతం భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు ఆర్మీ ప్రతినిధి ఒకరు ఒక అధికారిక ప్రకటనలో తెలియజేశారు. అయితే అధ్యక్షుడు అసద్ మాత్రం ఈ దాడిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 9 విమానాలతో పాటుగా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు, ఇంధన డిపోలు సైతం ధ్వంసమైనాయని రష్యా ప్రభుత్వ టీవీ చానల్ ‘రోసియా 24’కు చెందిన ప్రతినిధి సంఘటన స్థలంనుంచి తెలియజేశారు. కాగా, దాడి జరిగిన చాలా గంటల తర్వాత కూడా మంటలు, పేలుళ్లు కొనసాగుతున్నట్లు ఆ ప్రతినిధి తెలిపారు. రన్‌వే చెక్కు చెదరకుండా ఉండే దృశ్యాలను కూడా ఆ టీవీ ప్రసారం చేసింది.
దాడికి పూర్తి బాధ్యత సిరియాదే: నాటో
అమెరికా క్షిపణి దాడి జరపడానికి పూర్తి బాధ్యత సిరియా ప్రభుత్వానిదేనని నాటో దేశాలు అభివర్ణించాయి. ఈ పరిణామానికి పూర్తి బాధ్యత సిరియా ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని నాటో చీఫ్ స్టోల్టెన్‌బెర్గ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రసాయనిక ఆయుధాలు వాడడం ఏ విధంగాను సమర్థనీయం కాదన్న ఆయన దానికి బాధ్యులైన వారే అమెరికా దాడికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు అమెరికా క్షిపణి దాడిని సిరియాను వ్యతిరేకిస్తున్న, అమెరికా సంకీర్ణ కూటమిని సమర్థిస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, టర్కీ తదితర దేశాలు సమర్థించగా, సిరియాను సమర్థిస్తున్న ఇరాన్ ఖండించింది. అసాద్ జరుపుతున్న మారణడను ఆపడానికి ఇలాంటి మరిన్ని దాడులు జరపాలని సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరేళ్లుగా పోరాటం సాగిస్తున్న తిరుగుబాటుదారులు అమెరికాను కోరారు.
రసాయనిక దాడులను ఆపడమే లక్ష్యం: అమెరికా
కాగా, రసాయనిక ఆయుధాల వాడకాన్ని అడ్డుకోవడం ప్రధాన ఉద్దేశంగా పరిమిత స్థాయిలోనే ఈ దాడులు జరిపినట్లు ప్రకటించిన వైట్‌హౌస్ అసాద్‌ను బలవంతంగా గద్దె దించడం తమ అభిమతం కాదని స్పష్టం చేసింది.
సిరియా ప్రభుత్వం మరోసారి ఇలాంటి పని చేయకుండా చూడడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని, ఆ మేరకు దీని ప్రభావం ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి జెఫ్ డేవిస్ విలేఖరులకు చెప్పారు. ప్రాణనష్టాన్ని నివారించడాకి దాడి గురించి సిరియాలోని రష్యా మిలిటరీకి ముందే తెలియజేశామని కూడా అమెరికా అధికారులు చెప్పారు.
కాగా, అసద్‌ను నిలువరించడంలో రష్యా విఫలమైనందునే తాము ఈ దాడి జరపాల్సి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎవరైనా సరే గీత దాటితే ట్రంప్ చూస్తూ ఊరుకోరనే విషయాన్ని ఈ దాడి సుస్పష్టం చేసిందని కూడా ఆయన అన్నారు.

చిత్రం... అమెరికా యుద్ధనౌకనుంచి దూసుకెళ్తున్న క్షిపణి. దాడిలో ధ్వంసమైన సిరియా వైమానికస్థావరంలోని కంట్రోల్ టవర్