స్పాట్ లైట్

సిరియాపై ఇజ్రాయెల్ పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం మొత్తం పశ్చిమాసియాలోనే ఎడతెగని అశాంతికి ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా పాలస్తీనాకు సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకమే. ఇటీవలి కాలంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయి సంఘర్షణలకు ఆస్కారం ఏదీ లేకపోయినా ఏ క్షణంలోనైనా పశ్చిమాసియా సమస్య తెరపైకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్‌అసాద్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సిరియాలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అసాద్ పూర్తి అదుపును సాధించే అవకాశం ఉందని, అంతిమంగా ఆయనే విజేతగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అవిగ్దర్ లీబర్‌మన్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింతగా వేడెక్కించేలా కనిపిస్తున్నాయి. ఓపక్క అంతర్యుద్ధం వల్ల అసాద్ అంతమైపోతాడంటూ గతంలో ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రే దానికి విరుద్ధంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటివరకూ అసాద్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆకస్మికంగా ఆయనకు అనుకూలంగా మారుతున్నాయని అటు పశ్చిమ దేశాలు, ఇటు మితవాద సున్నీలు కూడా ఆయనను బలపరచడాన్ని బట్టి చూస్తే సిరియా వ్యవహారంలో ప్రపంచ దేశాల ఆసక్తి మరింత స్పష్టమవుతోంది. 2015లో అసాద్‌కు అనుకూలంగానే రష్యా వ్యవహరించింది. దానివల్ల సిరియా వ్యవహారంలో రష్యా దళాలు రంగంలోకి దిగాయి. అందుకు ప్రతిగా ఇరాన్, లెబనాన్ గెరిల్లా గ్రూపైన హెజ్బుల్లా దళాలు కూడా రంగప్రవేశం చేశాయి. దాంతో ఒక్కసారిగా సిరియా గందరగోళంలో పడడంతోపాటు ఎవరిని ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎవరికి ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అమెరికా తనదైన రీతిలోనే సిరియా తిరుగుబాటుదారులను అణచివేసేందుకు అసాద్‌కు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. అయితే సిరియాకు సంబంధించి ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇజ్రాయెల్‌కు మింగుడు పడటం లేదు. ఈ ప్రాంతంలో ఇరాన్‌కు పట్టు పెరుగుతోందని, సిరియా అంతర్యుద్ధం కంటే కూడా ఇరాన్ ప్రాబల్యం వల్ల మరింతగా పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని ఇటు రష్యా, అటు అమెరికాను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. తాజాగా సిరియా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అమెరికా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సిరియా రక్షణ మంత్రి చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా, ఇరాన్‌కు వ్యతిరేకంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నంగానే కనిపిస్తోంది. ఏకకాలంలో ఇరాన్, తర్కులు, హిజ్బుల్లా దళాలను ఎదుర్కోవడం అంత తేలికైన సమస్య కాదని, అందుకు అమెరికా గట్టి వ్యూహంతో ముందుకు వెళితే తప్ప పరిస్థితులు చక్కబడే అవకాశం లేదని కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. అటు సిరియాలో కాని ఇటు తమ దేశ సరిహద్దుల్లో కాని సైనిక దళాలను మోహరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిరియా, హిజ్బుల్లాలకు అవకాశం ఇవ్వకూడదన్నదే ఇజ్రాయెల్ ప్రధాని డిమాండ్‌గా కనిపిస్తోంది. ఈ విషయంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపైనే పశ్చిమాసియా శాంతి, అలాగే సిరియా పరిస్థితులు ఒక కొలిక్కి రావడం ఆధారపడి ఉంటాయి. ఇప్పటివరకూ సిరియా వ్యవహారంలో అంటీముట్టనట్టుగానే ఉంటూ వచ్చిన అమెరికా తమ మిత్రదేశం ఇచ్చిన సలహా మేరకు క్రియాశీలకంగా మారుతుందా? ఈ విషయంలో రచ్చగెలిచేందుకు అన్ని విధాలుగా వ్యూహాలు పన్నుతున్న డొనాల్డ్ ట్రంప్ వేయబోయే అడుగేమిటి? ఉత్తర కొరియా వ్యవహారంతోనే ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డ ఆయన సిరియా విషయంలో కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి ఇరాన్‌తో మరింత వ్యతిరేకతను కొని తెచ్చుకుంటారా? రానున్న కొన్ని వారాల్లో డొనాల్డ్ ట్రంప్ చేయబోతున్న విదేశీ పర్యటన ఈ ప్రశ్నలకు ఓ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. తన విధానాలకు అనుగుణంగా ఇతర దేశాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు.