స్పాట్ లైట్

సంక్షోభం అంచుల్లో.. దిగజారుతున్నవెనిజులా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ప్రపంచంలోనే అపారమైన చమురు నిక్షేపాలతో సంపన్న దేశంగా ఉన్న వెనిజులా ఇప్పుడు అనూహ్య రీతిలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇంత భారీ చమురు నిక్షేపాలున్న ఏ దేశమైనా ప్రపంచానే్న శాసించే స్థాయికి ఎదుగుతుంది. అన్ని విధాలుగా ప్రజల సంపద పెరుగుతుంది. కాని వెనిజులా పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు తీసికట్టుగానే మారడం ఆర్థిక విచిత్రమే. తలసరి ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. పేదరికంలో మగ్గుతున్నవారి సంఖ్య 66శాతానికి చేరుకుంది. వెనిజులా చరిత్రలో ఈ స్థాయి ఆర్థిక సంక్షోభం కనీవినీ ఎరుగనిదే. ద్రవ్యోల్బణం ఏకంగా 400 శాతాన్ని దాటిపోవడం అక్కడి ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి కారణమవుతోంది. ఇక మారకం రేటు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రజల ఆదాయం తగ్గిపోయింది. ఒకపక్క పెరిగిపోతున్న రుణభారం, అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఉద్యమాలకు, అంతర్యుద్ధాలకు, వీధి పోరాటాలకు దారితీస్తున్నాయి. పరిస్థితి ఇంతగా దిగజారుతున్నా అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అర్థరహితమైనవేవీ కావు. 2014 నుంచీ కూడా వెనిజులా పరిస్థితి ఇదేస్థితిలో ఉంది. దేశ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? తలసరి ఆదాయం ఎంత? ద్రవ్యోల్బణ పరిస్థితి ఏమిటన్న దానిపై ఏ రకమైన సమాచారం ఇప్పటివరకూ అందుబాటులో లేకపోవడానికి కారణం వాస్తవ పరిస్థితులను మరుగుపరిచే ప్రయత్నమేనా అన్న విమర్శలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే సరైన నిర్ణయాలతో అర్థవంతమైన ఆలోచనలతో మదురో వ్యవహరించి ఉన్నట్లయితే ఈ రకమైన పరిస్థితి వెనిజులాకు దాపురించి ఉండేది కాదన్నది ఎంతైనా నిజం. వెనిజులా మనుగడకు చమురు విక్రయం ద్వారా వచ్చే ఆదాయం తప్ప మరేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధికమైన చమురు నిక్షేపాలు ఇక్కడున్నాయి. ఈ ఆదాయంవల్లే సంవత్సరాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. చావెజ్ పరిపాలనలో చమురు ధర చారిత్రక రీతిలో బ్యారల్‌కు 100 డాలర్ల వరకు వెళ్లింది. ఈ రకంగా సంపాదించిన ఆదాయాన్ని దేశ అభివృద్ధికోసం కాకుండా ఆర్థిక కార్యక్రమాల అమలుకు, భారీఎత్తున ఆహార సబ్సిడీలకు వినియోగించడం వల్ల ఉత్పాదకత తగ్గిపోయింది. చమురు ధర భారీగా ఉండి, పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందీ లేకపోయినా, ఇప్పుడు పరిస్థితి ప్రతికూలించింది. చమురు ధర అనూహ్యంగా తగ్గిపోయింది. దాంతో ప్రభుత్వ సామాజిక కార్యక్రమాల అమలు గుదిబండగా మారింది. ఆహార సబ్సిడీలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చేసింది. ఉన్నదంతా ఊడ్చుకుపోవడంతో ప్రజల చేతుల్లోనే కాదు, ప్రభుత్వం వద్ద కూడా చిల్లిగవ్వ లేని పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం వెనిజులా సెంట్రల్ బ్యాంక్ అంచనాల ప్రకారం అక్కడ విదేశీ మారక ద్రవ్య విలువల పరిమాణం పది బిలియన్ డాలర్లు మాత్రమే. దాదాపు 7.2 బిలియన్ డాలర్ల మేర రుణ భారమూ ఉంది. ఈ పరిస్థితులు ఒక్కసారిగా దేశంలో ప్రజాందోళనలకు దారితీయడమే కాకుండా ఇటు ఆహారం, అటు మందులు లేని విపరీత పరిణామాలకు దారితీసాయి. ఈ పరిస్థితిని ప్రైవేటు కంపెనీలు లాభదాయకంగా మార్చుకోవడంతో ప్రజల మనుగడే కష్టంగా మారింది. వీటిని అధిగమించేందుకు మదురో ప్రభుత్వం తక్షణ ప్రాతిపదికన చర్యలు తీసుకోని పక్షంలో ఎలాంటి విపరీత పరిణామాలకైనా ఆస్కారం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటినుంచీ కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఒక దశలో దేశ జిడిపి 8.3 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ కూడా ప్రజల జీతాలు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పెను సవాలుగా పరిణమించింది. 1999లో చావెజ్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇదే రకంగా ఉన్నా ఆయన తన నాయకత్వ పటిమతో తీర్చిదిద్దగలిగారు. ఇప్పుడు రోజుకో ఉద్యమంగా సవాళ్లమయంగా ఉన్న దేశ పరిస్థితులను ప్రస్తుత అధ్యక్షుడు మదురో ఏ విధంగా అధిగమిస్తారన్నది అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా దేశంలోని రాజకీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం ఇందుకు ప్రధానంగా కారణమవుతోంది. మదురో ప్రభుత్వం అసమర్థమైనదని, అందుకే అవినీతి పెచ్చరిల్లి ఆర్థిక వ్యవస్థ దాదాపు ఖాయిలా పడే స్థాయికి చేరుకుందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 2013లో చావెజ్ మరణించినప్పటినుంచీ పరిస్థితులు ఎప్పటికప్పుడు దిగజారుతూనే వచ్చాయి.

చిత్రం..వెనిజులా అధ్యక్షుడు మదురో