స్పాట్ లైట్

అఫ్గాన్‌లో శాంతి భ్రాంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాలిబన్, అల్‌ఖైదా మిలిటెంట్లను అంతం చేయడానికి 9/11 నేపథ్యంలో అమెరికా సారథ్యంలో సంకీర్ణ దళాలు అఫ్గాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వలేదన్నది స్పష్టమవుతోంది. ఏళ్ల తరబడి ఇటు తాలిబన్లతోనూ, అటు అల్‌ఖైదా మిలిటెంట్లతోనూ సమరాన్ని సాగించిన అమెరికా వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అఫ్గాన్ సైనిక దళాలకు తగిన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల పరిస్థితి మొదటికొచ్చినట్లయింది. తాజాగా మిలిటెంట్ల దాడిలో 200 మంది మరణించడం అన్నది ఇటు తాలిబన్లు, అటు అల్‌ఖైదా మిలిటెంట్లు ఇంకా తమ ఉనికిని బలంగా చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అఫ్గాన్‌కు సంబంధించి సరికొత్త వ్యూహంతోనే తాము ముందుకు వెళడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ మారణకాండ జరగడం, అసలు అఫ్గాన్ భద్రతా దళాలకు తీవ్రవాదుల్ని ఎదుర్కోగలిగే శక్తిగాని, యుక్తిగాని ఉన్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ఎంతగా అణచివేత చర్యలు చేపడితే అంతగానూ తమ ఉనికిని చాటుకోవడానికి మిలిటెంట్లు పెట్రేగిపోతున్నారని చెప్పడానికి ఈ తాజా మారణకాండే నిదర్శనం. ఈ వరుస దాడులన్నీ తాలిబన్ల మిలిటెంట్లే చేసినట్లు ఆధారాలు బయటపడడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అఫ్గాన్ నుంచి సంకీర్ణ దళాలు వైదొగిన నాటినంచి కూడా అక్కడ భద్రతా పరిస్థితి అగమ్య గోచరంగానే మారింది. అమెరికా అండదండలతో కొత్త ప్రభుత్వం ఏర్పడినా మిలిటెంట్లు మాత్రం అడపాదడపా తమ పైశాచికత్వాన్ని చాటుకుంటూనే వస్తున్నారు. గతంలోకంటే కూడా అనేక కోణాల్లో అఫ్గాన్‌లో తీవ్రవాదం విశృంఖలంగా మారింది. అఫ్గాన్‌ను సగానికిపైగా తమ గుప్పెట్లో ఉంచుకున్న తాలిబన్ మిలిటెంట్లు ప్రభుత్వ భవనాలను, భద్రతా సిబ్బందినే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు. దీనితోపాటు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కూడా మరో కోణంలో అఫ్గాన్‌లో అరాచకానికి, అశాంతి పరిస్థితులకు కారణం అవుతోంది. ఐసిస్ సాగిస్తున్న ఈ మారణకాండ అన్ని విధాలుగా అఫ్గాన్‌ను ముక్కలు చెక్కలు చేసేదిగానే ఉండడం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా షియా మసీదులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం వల్ల మతపరంగా రెండు బలమైన వర్గాల మధ్య ఆరని చిచ్చు రగులుకునే ప్రమాదం ఉంటుంది. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటామని అఫ్గాన్ ప్రభుత్వం ఎంతగా ప్రకటనలు గుప్పించినా అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప చేతల్లో ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదన్నదని వాస్తవం. అయితే ప్రస్తుతం అఫ్గానిస్తాన్ ప్రభుత్వం అన్ని విధాలుగా బలహీనంగా ఉంది కాబట్టి పెట్రేగిపోతున్న తాలిబన్, ఐసిస్ మిలటెంట్లను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయంగా సంకీర్ణ దళాలు మరింత బలమైన మద్దతుతో ముందుకు రావాల్సి ఉంటుంది. తనంతట తానుగా దేశంలో శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించేందుకు అఫ్గాన్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గాన్ అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు అక్కడ మళ్లీ శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించే దిశగా అన్ని దేశాలూ దానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు 16 సంవత్సరాలపాటు అఫ్గాన్ గడ్డపైనుంచే యుద్ధం చేసిన అమెరికా అర్ధంతరంగా నిష్క్రమించడం, అఫ్గాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ప్రధాన కారణంగా భావించాల్సి ఉంటుంది. దేశీయంగా రగుల్కొన ఈ రకమైన అనిశ్చిత పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై అఫ్గాన్ ప్రభుత్వానికే ఓ ఆలోచన అంటూ లేదు. అలాంటిది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు ఇక్కడి ఆంతరంగిక వ్యవహారాలు పూర్తి స్థాయిలో అవగతమయ్యే అవకాశం ఉండదు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా, సమస్య మూలాన్ని ఛేదించకుండా ఏ రకమైన పరిష్కారం అందే అవకాశం ఉండదు. అఫ్గాన్‌పై చాలా బలమైన పట్టును కలిగివున్న తాలిబన్లతో యుద్ధంకంటే కూడా వారినే చర్చల ద్వారా దారికి తీసుకురావడం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమమైన మార్గంగా కనిపిస్తోంది. ఒకపక్క అల్‌ఖైదా, మరోపక్క ఐసిస్‌లను ఎదుర్కొంటూనే తాలిబన్లను శాంతిబాట పట్టించడం ద్వారా అఫ్గాన్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, సమీప భవిష్యత్తులోనైనా సుస్థిత శాంతిని పాదుగొల్పేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఒబామా ప్రభుత్వం కూడా తాలిబన్లతో చర్చలకు సానుకూల సంకేతాలను అందించినప్పటికీ అది అనేక కారణాలవల్ల ముందుకు సాగలేదు. మరోపక్క అఫ్గానిస్తాన్‌లో భారత జోక్యాన్ని, ప్రమేయాన్ని ఎంతమాత్రం సహించని పాకిస్తాన్ నిరంతరం సమస్యలు రగిలేనా తనవంతు ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తూనే వస్తోంది.
ఒకవేళ తాలిబన్-అఫ్గాన్ ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరినా తన కుత్సిత వ్యూహాలతో దానికి తూట్లు పొడిచేందుకు పొరుగున ఉన్న పాకిస్తాన్ నిత్యం సిద్ధంగానే ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీలులేదు. అమెరికా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ అధికారులు తాజాగా సమావేశమై శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించే అంశంపై చర్చించిన నేపథ్యంలోనే తాలిబన్ మిలిటెంట్లు పెట్రేగిపోయి తాజా మారణకాండ సృష్టించారు. దీన్నిబట్టి చూస్తే శాంతియుత చర్చలకు తాలిబన్లు ఎంతమాత్రం సుముఖంగా లేరన్న వాస్తవమూ కళ్లకు కడుతోంది. ఏ విధంగా చూసినా కూడా అఫ్గాన్ పరిస్థితులను దండోపాయంతోనే అదుపులోకి తెచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇటు తాలిబన్లు గానీ, అటు అఫ్గాన్ ప్రభుత్వం గాని రాజీబాటలో ముందుకు వస్తే తప్ప దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉండదు. తాలిబన్లతో చర్చలమాట ఎలా ఉన్నా, అవి ఫలిస్తాయా లేదా అన్న అంశంతో నిమిత్తం లేకుండా ముందుగా అక్కడి ప్రభుత్వం అన్ని విధాలుగా పటిష్ఠం కావాలి. ప్రభుత్వమే బలహీనంగా ఉన్నప్పుడు బలంగా శాంతిభద్రతల పరిస్థితులను పాదుగొల్పే స్థితిలో లేనప్పుడు ఈ రకమైన మారణకాండ నిత్యకృత్యమే అవుతాయి. దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లతో చర్చలకు దిగడం అంటే వారి డిమాండ్లను పరోక్షంగా ఆమోదించినట్లే అవుతుంది. అన్నింటికంటే మించి ప్రభుత్వ బలహీనత మరింత బయటపడుతుంది. అఫ్గాన్‌లో పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు ఏర్పడాలంటే అమెరికా వంటి దేశాలు తమ బాధ్యతకు కట్టుబడి అకుంఠిత రీతిలో సహాయ సహకారాలు అందించాలి. కేవలం తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తే అఫ్గాన్ ప్రజలే పావులుగా మారతారు. మిలిటెన్సీని అదుపు చేయాలంటే ముందుగా కావాల్సింది రాజకీయ చిత్తశుద్ధి. ఏ రకమైన ప్రయోజనాలను ఆశాంచని నిబద్ధత. అందుకు త్రికరణశుద్ధిగా అమెరికా ముందుకు వస్తే కల్లోలిత అఫ్గాన్‌లో నేడు కాకపోతే రేపైనా శాంతికి ఆస్కారం ఉంటుంది. లేనిపక్షంలో అది భ్రాంతే అవుతుంది.