స్పాట్ లైట్

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదేళ్ల క్రితం అంకురించిన చతుర్భుజ సంకీర్ణ సహకార చర్చలకు ఓ స్పష్టమైన రూపం రాబోతోంది. దక్షిణ చైనా మహాసముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడం, ఇరుగు పొరుగు దేశాల హక్కులనే కాలరాసే రీతిలో జీ జిన్‌పింగ్ ప్రభుత్వం పావులు కదుపుతున్న నేపథ్యంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు అత్యంత వ్యూహాత్మక రీతిలో చర్చలు జరిపి నాలుగు భుజాల కలయికగా ఓ బాహుబలి లాంటి రక్షణ కూటమిని ఏర్పాటు చేయాలని సంకల్పించడం దేశాల మధ్య పెరుగుతున్న అవగాహనకు, భద్రతాపరంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనే విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలకు నిదర్శనమే. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా, భద్రతాయుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ఈ చతుర్భుజ కూటమి ఏర్పాటు ప్రక్రియ తాజాగా జీవం పోసుకుందని భావించాలి. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నింటికీ అత్యంత కీలకమైన దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతంపై చైనా పట్టుకు గండి కొట్టాలంటే దాని పెత్తనానికి చెల్లుచీటీ పలకాలంటే ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదేళ్ల క్రితమే ఈ ఆలోచన వచ్చినప్పటికీ అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా అది ముందుకు సాగలేదు. ఇండో-పసిఫిక్ ప్రాంతానే్న లక్ష్యంగా చేసుకుని దాని భద్రత అభివృద్ధి విషయంలో ఏకోన్ముఖ రీతిలో సాగాలన్న దృఢసంకల్పంతోనే ఈ నాలుగు దేశాలు తాజా ప్రతిపాదనపై దృష్టిపెట్టడమే కాకుండా ఎలాంటి జాప్యం లేకుండా ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఆలస్యంగా జరిగినా అది ఆశాజనకంగా జరిగిన ప్రయత్నంగానే భావించాలి. హద్దులు, సరిహద్దులు చెరిగిపోయి ప్రపంచమంతా ఒక్కటేనన్న బలమైన భావన సర్వత్రా పరిఢవిల్లుతున్న తరుణంలో ఈ నీరు నాది.. ఆ స్థలం నాది అనే సంకుచిత భావనలకు ఆస్కారం ఉండకూడదరు. ప్రపంచ దేశాలన్నీ కూడా సముద్ర వాణిజ్యంపైనే అత్యధిక స్థాయిలో ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ చైనాపై పెత్తనం చెలాయించాలన్న చైనా వైఖరి ఎంతమాత్రం క్షతవ్యం కాదు. ఈ ధోరణిని దీర్ఘకాలంగా భారత్ తదితర దేశాలు ప్రతిఘటిస్తూనే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇతర దేశాల నౌకలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా డ్రాగన్ ఎప్పటికప్పుడు అవరోధాలు కల్పిస్తూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండో-పసిఫికన్ల బలమైన భావన తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి ఈ కూటమిలో మిగతా దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్‌లతోనూ భారత్‌కున్న సుహృద్భావ సంబంధాలకు ఈ చతుర్భుజ సంకీర్ణ కలయిక మరింత బలాన్నిచ్చేదే అవుతుంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఆసియాన్ శిఖరాగ్రత సదస్సు సందర్భంగా అంతర్జాతీయ చట్టానికి, న్యాయానికి, నియమ నిబంధనలకు పట్టం కట్టే రీతిలో వేసిన ఈ ముందడుగు భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతి మండలంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిగా మార్చే అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని దేశాల దీర్ఘకాల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు ఎవరి పెత్తందారీ ధోరణిపైనా ఇవి ఆధారపడాల్సిన అవసరం లేని సుహృద్భావ వాతావరణాన్ని కల్పించేందుకు ఈ కూటమి అనేక రకాలుగా దోహదం చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేగాకుండా ఇది అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం కాబట్టి ఇక్కడి దేశాల ప్రయోజనాలను పరిరక్షించుకోగలిగితే శాంతియుత పరిస్థితులను బలోపేతం చేసుకోగలిగితే అది అంతిమంగా ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగడానికి దోహదం చేసేదే అవుతుంది. దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత అవసరమో అవి సజావుగా సాగడానికి నియమబద్ధమైన వ్యవస్థను పాదుకొల్పడం కూడా అంతే అవసరం. ఆ లక్ష్యాన్ని ఈ నాలుగు దేశాల కూటమి కచ్చితంగా సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఆర్థిక సహకారం కోసమే కాకుండా ఉగ్రవాదాన్ని సమష్టి కృషితో ఎదుర్కోవడానికి మరింత సమన్వయ రీతిలో తీరప్రాంతాలను పరిరక్షించుకోవడానికి అదే స్థాయిలో ఉత్తరకొరియా అణు బరితెగింపును అరికట్టడానికి కూడా ఈ కూటమి అత్యంత శక్తివంతమైన వేదికగానే పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇందులోని నాలుగు దేశాల మధ్య అనేక ప్రాంతీయ, ద్వైపాక్షిక, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం ఉండడం కూడా ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రపంచ శాంతికి చుక్కానిగా, ఉగ్రవాద నిరోధక చర్యలకు ప్రబల సాధనంగా మార్చే అవకాశం ఎంతైనా ఉంది. పదేళ్ల క్రితం ఓ ఆలోచనగా మొదలైన ఈ చతుర్భుజ సంకీర్ణ భద్రతా వ్యవస్థ తాజాగానైనా భావసారూప్యత కలిగిన దేశాల కలయికతో ఓ స్పష్టమైన రూపాన్ని, తిరుగులేని శక్తిని సంతరించుకోవడం హర్షణీయ పరిణామం. మొదటినుంచీ కూడా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషించాలన్నది అమెరికా ఆలోచన. దానికి కొనసాగింపుగానే భారత్ కూడా ప్రధాని మోదీ సారథ్యంలో ఆ దిశగా బలమైన అడుగులు వేస్తూనే వస్తోంది.