స్పాట్ లైట్

ముగాబే నియంతృత్వానికి చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యావత్ ప్రపంచం నియంతృత్వాలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యమే పరమావధిగా ముందుకు సాగుతోంది. మానవ హక్కులను కాలరాసి విలువలకే విలువ లేకుండా చేసిన నియంతలను తరిమికొడుతూ తమ ఆశాసౌధాలైన ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలను ఆవిష్కరించుకుంటోంది. ఏ నియంతృత్వమైనా చిరకాలం సాగదు. ప్రజా పాలకులుగా గద్దెనెక్కి ప్రజా కంటకులుగా మారిన వారిని చరిత్ర క్షమించదు. వర్తమానం సహించదు. అందుకే మొన్న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్, నిన్న లిబియా పాలకుడు గడాఫీ, నేడు జింబాబ్వే నేత ముగాబే ఇలా ఒకరి తర్వాత ఒకరు అంతిమంగా అధికార పీఠాన్ని వీడి చరిత్రహీనులు కావాల్సిందే. నేటి ప్రపంచం హక్కులకే ప్రాధాన్యతనిస్తోంది. వాటిని కాలరాసే
వారిని చరిత్రలో కలిపేస్తోంది.

37 ఏళ్ల నియంతృత్వానికి చరమగీతం
అధికార దాహమే మొగాబేను ముంచింది

ప్ర పంచంలో నియంతలందరిదీ ఒకేబాట. అందినకాడికి సర్వసుఖాలు అనుభవించడం, పరిస్థితి ప్రతికూలిస్తే.. ‘‘ఇదిగో నా వారసుడు’’ అంటూ మరొకరిని గద్దెనెక్కించేందుకు ప్రయత్నించడం అన్నది చరిత్రలో కోకొల్లలు. నియంతల శకానికి చరమగీతం పాడిన ప్రజలు తమ తమ దేశాల్లో మానవత్వ విలువలకు పట్టేంగట్టే ప్రజాస్వామ్య పాలనా సౌధాలను నిర్మించుకునే ప్రయత్నం చేశారు. కొనే్నళ్ల క్రితం జరిగిన ఈ నియంతృత్వ వ్యతిరేక పోరాటాలు ఆయా దేశాల్లో మానవ హక్కులకు పట్టంకట్టి నియంతలు శరణు కోరి పారిపోయేలా చేశాయి. తాజాగా జింబాబ్వే అధినేత, మూడున్నర దశాబ్దాలకు పైగా ఉక్కు పిడికిలితో దేశాన్ని పాలించిన నియంత రాబర్ట్ ముగాబే కూడా చివరి క్షణంలోనూ అధికారాన్ని పట్టుకు వేలాడే ప్రయత్నం చేసి విఫలమై అంతిమంగా పదవీచ్యుతికి గురయ్యారు. 37 సంవత్సరాలపాటు దేశాన్ని పరిపాలించిన ఆయన, కొత్త నాయకత్వానికి ఆస్కారం ఇవ్వకుండా తనదైన వింత విడ్డూరపు పోకడలతోనే 93 సంవత్సరాల వృద్ధాప్యంలోనూ అధికార వ్యామోహం వీడకుండా దేశానికే గుదిబండగా మారడంతో సైన్యమే సహించలేకపోయింది. తన రెండో భార్య గ్రేస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ముగాబే ప్రయత్నించడం ఉపాధ్యక్షుడు ఎమెర్సన్‌కు ఉద్వాసన పలకడంతో దాదాపుగా సైన్యమే తిరుగుబాటు చేసింది. దాంతో ప్రజలు ముగాబేను గద్దె దించాల్సిందేనంటూ వీధికెక్కారు. ఒక నియంతను గద్దె దించడానికి లేక తరిమికొట్టడానికి ప్రజల మద్దతు మించిన ఆయుధం ఎవరికీ ఉండదు. ఎప్పుడైతే ముగాబే తమకు వద్దు అంటూ ప్రజలు నినదించారో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సైన్యం ఈ నియంతను నిర్బంధంలోకి తీసుకుంది. ఎంతగా ఒత్తిడి తెచ్చినా రాజీనామా చేయడానికి ముగాబే నిరాకరించారు. దాంతో ఆయనను అభిశంసించే ప్రక్రియను కూడా చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పటి రొడీషియాగా ఉన్న జింబాబ్వేను బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తం చేసి 1980లో దేశ పాలనా పగ్గాలను చేపట్టిన రాబర్ట్ ముగాబే అప్పటి నుంచి ప్రజలు తరిమికొట్టేవరకు తిరుగులేని అధికారాన్ని చెలాయించారు. స్వాతంత్య్ర పోరాటంలో ముగాబేకు ప్రజలు ఎంతగా అండగా నిలిచారో, జింబాబ్వే స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఆయన సాగించిన అవినీతి కృత్యాలు, అణచివేత చర్యలను అంతగానూ గర్హించారు. ప్రపంచ చరిత్రలో సానుకూల పరిణామాల నేపథ్యంలో గద్దెనెక్కిన ప్రజా నాయకుడు కీర్తికండూతి, అధికార దాహంతో అభాసుపాలై నామరూపాల్లేకుండా పోయిన ఉదంతాలు కోకొల్లలుగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితే జింబాబ్వే ప్రజా నాయకుడిగా పగ్గాలు చేపట్టి, ప్రజా కంటకుడిగా జనాగ్రహంతో గద్దెదిగిన దుస్థితి రాబర్ట్ ముగాబేది. ముగాబే పాలనలో ఆర్థికంగా జింబాబ్వే అన్ని రకాలుగా చితికిపోయింది. ప్రజల హక్కులకు దిక్కేలేకుండా పోయింది. శాంతిభద్రతలు క్షీణించాయి. అధికార పీఠంపై ఉన్న వ్యక్తులు అనన్యరీతిలోనే సంపదను గడించారు. ముగాబే తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి తలసరి ఆదాయం తాజా పరిణామాల నేపథ్యంలో సగానికి సగం తగ్గిపోయింది. కోటీ 60 లక్షల మంది జనాభా కలిగిన జింబాబ్వేలో ద్రవ్యోల్బణం ఆకాశాన్నటడంతో ప్రజల జీవన పరిస్థితులు అత్యంత హేయంగా, దారుణంగా మారిపోయాయి. వ్యవసాయం, పరిశ్రమలు అడుగంటిపోవడంతో దేశంలో ఉన్న సహజ వనరులను అవినీతిపరులైన నాయకుల సహాయంతో చైనా కబళించే ప్రయత్నం చేసింది. ఉపాధి లేక దేశ యువత ఇతర దేశాలకు వలసపోయే పరిస్థితి తలెత్తింది. మిగతా దేశాల్లాగా చీటికీ మాటికీ జింబాబ్వే పాలనా వ్యవహారాల్లో సైన్యం జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. కాని అలాంటి చర్య తీసుకోక తప్పని అనివార్య పరిస్థితిని ముగాబేనే సైన్యానికి కల్పించారని చెప్పడం అతిశయోక్తి కాదు. మొత్తానికి ముగాబే గద్దెదిగడం ప్రజలకు ఎనలేని ఆనందాన్ని కలిగించినా దేశ తాజా పరిస్థితిని చక్కదిద్దేందుకు కొత్త నాయకత్వం తక్షణ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకుంటే తప్ప వెలుగే కనిపించని పరిస్థితి దేశంలో నెలకొంది. సామాజిక, ఆర్థిక మార్పులను కొత్త నాయకత్వం ఏ విధంగా పాదుగొల్పుతుందో అన్ని విధాలుగా చితికిపోయిన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందో వేచిచూడాల్సిందే.

బి.రాజేశ్వర ప్రసాద్