స్పాట్ లైట్

భయంతోనే ‘బ్రెగ్జిట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే విషయంలో అనేక అవాంతరాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో అసలు దేశ ప్రజలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక దేశాల కూటమిగా ఉన్న ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం అన్నది ఎవరూ ఊహించని పరిణామమే. సొంత మనుగడ కంటే కూడా ఉమ్మట్లోనే అన్ని రకాల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందన్నది నానుడి. ప్రపంచ దేశాలన్నీ ప్రాంతీయ మనుగడను కాపాడుకునేందుకు అందులోనే సొంత మనుగడను వెతుక్కునేందుకు కూటములుగా ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికంటే మొట్టమొదటిసారిగా ఐరోపా దేశాలన్నింటితోనూ ఏర్పడ్డ కూటమి ఐరోపా యూనియన్. అందులో బ్రిటన్‌ది అత్యంత కీలకమైన పాత్ర. ఇంతటి ఘనమైన ప్రాధాన్యతను, ఆర్థిక ఇతరత్రా లబ్ధిని, వ్యాపార వాణిజ్యపరమైన ప్రయోజనాలను వదులుకుని ఐరోపా యూనియన్ నుంచే బ్రిటన్ ఎందుకు వైదొలగాలనుకుంది? ఇందుకు బలమైన ఏకైక కారణం- బ్రిటన్ పౌరులను ఓటింగ్‌కు ముందువరకూ పట్టి పీడించిన ‘జెనోఫోబియా’. ఐరోపా యూనియన్‌లో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే ఇందులోని సభ్యదేశాలకు చెందిన పౌరులు వలస రావడం అన్నది బ్రిటన్ ప్రజలను బెంబేలెత్తించింది. అనాదిగా తాము బ్రిటన్‌కంటూ కొన్ని విలువలను, సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నామని, వీటితో ఏమాత్రం సంబంధం లేని ఇతర దేశాల నుంచి ప్రజలు తమ దేశానికి వలసవస్తే తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని బ్రిటన్ ప్రజలు భయపడ్డారు. అందుకే నష్టమైనా, కష్టమైనా ఐరోపా యూనియన్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ వైదొలగడమే సరైన నిర్ణయమని భావించినట్లుగా స్పష్టమవుతోంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా, చదువుకున్నవారా, చదువుకోనివారా అనే నిమిత్తం లేకుండా ప్రతిఒక్కరూ గుడ్డిగా బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసి మెజారిటీ తీర్పును ఆవిష్కరించినట్లుగా ఓ సర్వే చెబుతోంది. అయితే ఇందుకు అనుకూలంగా ఓటు వేసింది 52 శాతం మంది మాత్రమే కావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అంటే దాదాపు 48 శాతం మంది ఐరోపా యూనియన్‌లోనే బ్రిటన్ కొనసాగాలని భావించినట్టుగా వ్యతిరేక ఓటును బట్టి స్పష్టమవుతోంది. అనుకూలంగా ఓటు వేసిన 52 శాతం మందిలో ఐరోపా యూనియన్ నుంచి విడిపోవడం వల్ల కలిగే కష్టనష్టాలపై అవగాహన కంటే కూడా ఐరోపా యూనియన్‌లో ఉంటే ఇతర దేశాలకు చెందిన పౌరులు తమ దేశానికి వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయి తమ ఉపాధిని, ఉద్యోగాలను, విలువలను హరించివేస్తారని భయపడ్డారు.
ఈ అంశమే బ్రెగ్జిట్ ఓటుకు కారణమైనట్టు తాజా పరిశోధన బట్టి స్పష్టమవుతోంది. విదేశీయులు తమ దేశానికి వచ్చేస్తే అనేక రకాలుగా భయోత్పాతం ఏర్పడుతుందన్న ఆందోళనలను బ్రిటన్ ప్రజల్లో బ్రెగ్జిట్ అనుకూల వర్గాలు చాలా బలంగానే పాదుగొల్పాయి. ఇమ్మిగ్రాంట్ల భయం కారణంగానే ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ ఉండకూడదన్న గుడ్డి వాదనతోనే 52 శాతం మంది ప్రజలు సానుకూల తీర్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్‌కు సానుగూలంగా ఓటింగ్ జరిగి ఐరోపా యూనియన్ నుంచి వైదొలగేందుకు మార్గం సుగమమైనా అనంతర పరిణామాలు ప్రధాని థెరిసా మె ను ఏ విధంగానూ ముందుకు వెళ్లనివ్వడం లేదు. తాను అనుకున్నట్లుగా బ్రిటన్ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఐరోపా యూనియన్ నాయకత్వంతో చర్చలు జరపాలని థెరిసా భావించినా అందుకు విపక్షాలు అనుకూలించలేదు. వీటితో నిమిత్తం లేకుండా పార్లమెంటులో పూర్తి మెజారిటీని సంతరించుకునేందుకు ముందస్తు ఓటింగ్‌కు వెళ్లి ఆమె ఉన్న మెజారిటీనే కోల్పోయారు. ఇప్పుడు ఏ విధంగానూ ఐరోపా యూనియన్‌తో బలమైన రీతిలో చర్చలు జరిపే అవకాశం ప్రధాని థెరిసాకు లేదు. ‘అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి’ అన్న చందంగా మారిన బ్రెగ్జిట్ వ్యవహారం అంతిమంగా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందన్నది అంతుబట్టడం లేదు. ఎందుకంటే, ఒకదాని తర్వాత ఒకటిగా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఐర్లాండ్‌తోనూ బ్రిటన్‌కు సమస్య తలెత్తింది. మరో రెండు వారాల్లో ఐరోపా నాయకత్వంతో శిఖరాగ్ర భేటీకి బ్రిటన్ సన్నద్ధమవుతున్న తరుణంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగా ఉన్న ఐర్లాండ్ కొత్త మెలిక పెట్టింది. తమ సరిహద్దుకు సంబంధించి బలమైన హామీలిచ్చే పక్షంలోనే ఈ శిఖరాగ్ర భేటీకి హాజరుకావాలంటూ థెరిసాకు మెలిక పెట్టింది. ఇవన్నీ కూడా అనుకోని సమస్యలు కావడంవల్ల వాటిని ఇప్పటికప్పుడే పరిష్కరించేందుకు అవకాశం, వ్యవధి లేకపోవడం వల్ల థెరిసా మె తలపట్టుకుంటున్నారు. ఈ పరిణాలన్నీ అంతిమంగా యథాతథ స్థితికి దారితీస్తాయా లేక ఇటు నష్టాన్ని అటు కష్టాన్ని భరించి బ్రెగ్జిట్ ఓటును బ్రిటన్ సార్థకం చేసుకుంటుందా అన్నది ఉత్కంఠ కలిగించేదే.