స్పాట్ లైట్

కొరుకుడుపడని కిమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి కాలంలో ఐక్యరాజ్య సమితితోపాటు అగ్రరాజ్యమైన అమెరికా సహా ప్రపంచ దేశాలన్నింటినీ వణికించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎవరు ఎంతగా హెచ్చరించినా, ఎన్ని ఆంక్షలు విధించినా, అడుగడుగునా అడ్డుకట్ట వేస్తున్నాసరే.. ‘నా పని నాదే’ అన్నట్టుగా కిమ్ జోంగ్ అణుపథంలో పరుగులు పెడుతున్నాడు. తాజాగా మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ద్వారా అమెరికాలోని ఏ స్థావరాన్నైనా తాము తుత్తునియలు చేయగలుగుతామని చెప్పడం ద్వారా జోంగ్ తన జోరును మరింతగా పెంచుకున్నాడు. అమెరికాపై దాడిచేయడం ఎవరి తరం కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ, ఏం చేస్తాడో తెలియని కిమ్ జోంగ్ వంటి నాయకుడు ఉన్నప్పుడు ఏదైనా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఉత్తర కొరియా సుప్రీం నాయకుడిగా, రాకెట్ మాన్‌గా తన సొంత జనాల నీరాజనాలు అందుకుంటున్న కిమ్ జోంగ్ అసలు ఉద్దేశం ఏమిటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. నిజంగా యుద్ధమంటూ జరిగితే అమెరికా శక్తిని తట్టుకునే పాటవం ఉత్తర కొరియాకు ఉందా అనేది అనుమానమే. అయినా వాస్తవాలతో నిమిత్తం లేకుండా అగ్రరాజ్యానే్న ధిక్కరిస్తూ, దాని అధినేతను కవ్విస్తూ క్షణానికో సంచలన ప్రకటన చేస్తూ కిమ్ జోంగ్ తన దారి తనదే అన్నట్లుగా కవ్వింపు పోకడలకు పోతున్నాడు. అయితే ఇంతకా కవ్విస్తున్న కిమ్ జోంగ్‌ను కేవలం ఆంక్షల ద్వారా ఆర్థిక దిగ్బంధం ద్వారా అడ్డుకునే అవకాశం ఉంటుందా? అసలు ప్రపంచ దేశాలు బెంబేలెత్తుతున్నట్లుగా ఉత్తర కొరియాకు నిజంగా అణ్వాయుధ బలం ఉందా? అన్నది తేలాల్సి ఉంది. గుప్పెట మూసి తానేదో చేసేస్తాను జాగ్రత్త అన్నట్టుగా కిమ్ జోంగ్ వ్యవహార శైలి సాగుతోంది. మొదటినుంచీ ఉత్తర కొరియాను అన్ని విధాలుగా ఆదుకుంటూ వస్తున్న చైనాకు కూడా కిమ్ జోంగ్ ప్రభుత్వం తాజాగా జరిపిన బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ఎంతమాత్రం మింగుడుపడడం లేదు. చీటికీ మాటికీ కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొట్టడమే తన నైజంగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియాను అదుపు చేయాలంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నాయకత్వాన్ని కోరారు. అయితే దేనికీ లొంగని కిమ్ జోంగ్ చైనా ఒత్తిళ్లను సైతం బేఖాతరు చేస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తే తమ వద్ద అణ్వాయుధ బలం ఉంది కాబట్టి తమ జోలికొస్తే దాన్ని ప్రయోగించే అవకాశం ఉంది కాబట్టి అమెరికాతోపాటు ఎవరూ తమను ఏమీ చేయలేరన్న తెగింపే కిమ్ జోంగ్‌ను ముందుకు నడిపిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కేవలం క్షిపణిని పరీక్షించినంత మాత్రాన దానికి అణ్వాయుధాలను జోడించి సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా కూడా ఉత్తర కొరియాకు లేదని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అత్యంత వేగంగా అణ్వాయుధానికి సంబంధించిన అన్ని అంశాలపైనా పట్టును సాధిస్తున్న ఉత్తర కొరియా అనతి కాలంలోనే భారీ పేలుడుతో క్షిపణులను ప్రయోగించే సత్తానూ సంతరించుకునే అవకాశం లేకపోలేదన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం బుజ్జగింపులతోనే ఉత్తర కొరియాను దారికి తీసుకురావాల్సి ఉంటుందే తప్ప దూకుడుగా వ్యవహరించి దాడికి పాల్పడితే మాత్రం అది కచ్చితంగా కిమ్ జోంగ్ రెచ్చిపోవడానికి తమ వద్ద ఉన్నట్టుగా చెబుతున్నట్లుగా అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే అమెరికా, ఐరాస అన్నీ కూడా చివరికి మిత్రదేశమైన చైనా కూడా సామరస్యంగానే జోంగ్‌కు శాంతి జోలపాట పాడే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా మొదలుపెట్టిన అత్యంత భారీ సైనిక విన్యాసం కూడా ఉత్తర కొరియా నాయకత్వంపై మానసికపరమైన ఒత్తిడిని పెంచాలన్నదే అన్నది వాస్తవం. అయితే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ప్రత్యక్ష చర్యలకు దిగకుండా పరోక్ష మార్గాల్లో ఎన్ని హెచ్చరికలు చేసినా అవి కిమ్ జోంగ్ చెవికెక్కుతాయా అన్నది అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని అన్ని దేశాలు ఉమ్మడి శక్తిని ఉపయోగించి ఉత్తర కొరియాను దారికి తేవడం ఒక్కటే మార్గం. దీనికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా అది ‘కొరివితో తల గోక్కునే’ చందమే అవుతుంది. ఇప్పటికే జపాన్ సహా ఉత్తర కొరియా ధోరణిపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేనికైనా తెగించే నాయకుడిగా రోజు రోజుకూ రాటుదేలుతున్న కిమ్ జోంగ్‌ను రెచ్చగొట్టడం కంటే కూడా కొంత వ్యవధి పట్టినా రాజీ మార్గంలోనే కొరియా కొరివిని దారికి తీసుకురావాలన్న విజ్ఞత సర్వత్రా వ్యక్తమవుతోంది.