స్పాట్ లైట్

రష్యాకు పూర్వవైభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియా, పశ్చిమాసియా వ్యవహారాల్లో పటిమ చాటుకున్న నేత అమెరికా ప్రతికూల దేశాలు చేరువయ్యే అవకాశం

ప్రపంచ రాజకీయాలు అనూహ్య రీతిలో మలుపు తిరగబోతున్నాయా? 90వ దశకంలో అప్పటి సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై చిన్న చిన్న రిపబ్లిక్‌లుగా ఏర్పడిన నేపథ్యంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. అంతకుముందు వరకు అమెరికాతో అమీతుమీ అన్న రీతిలో వ్యవహరించిన సోవియెట్ యూనియన్ కాస్తా అన్ని విధాలుగానూ వెనక్కి తగ్గింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా కొనసాగుతూనే వస్తోంది. అడపా దడపా రష్యా తన ఉనికికి చాటుకునే ప్రయత్నం చేసినా అమెరికా అధిపత్యం ముందు పశ్చిమ దేశాల పెత్తనం ముందు ఆ ప్రయత్నాలు నీరుగారిపోయాయి. అయితే రష్యా అధ్యక్షుడిగా పనిచేసి అనంతరం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మళ్లీ దేశాధ్యక్షుడిగా అధికారాన్ని అందిపుచ్చుకున్న వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని సంవత్సరాలుగా రష్యాకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు అవిశ్రాంతంగా చేపడుతూనే వస్తున్నారు. ఇటీవలి పరిణామాలను లోతుగా గమనిస్తే అమెరికాకు పోటీగా రష్యాను మళ్లీ నిలబెట్టడమే పుతిన్ లక్ష్యమన్న అభిప్రాయం సర్వత్రా బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా అందని అంచనాలను తలక్రిందులు చేస్తూ వైట్‌హౌస్ పీఠాన్ని అధీష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం అమెరికాతో ఇతర దేశాల సంబంధాలను తీవ్రంగానే దెబ్బతీసింది. అదేవిధంగా ట్రంప్ పోకడ కూడా విమర్శనాత్మకంగా ఉండడం, అలాగే ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ మిత్రదేశాలకు సైతం ఇబ్బందికరంగా మారాయి. చీటికీ మాటికీ ట్రంప్ ఏమి చేస్తాడో తెలియదన్న కథనాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ క్రమంగా తన ఆధిపత్యాన్ని బలోపోతం చేసుకుంటూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి పోకడతో విసిగి వేసారిన ప్రపంచ దేశాలు ఇప్పుడు రష్యావైపే చూస్తున్నాయి. అందుకు కారణం- ట్రంప్ చేష్టలన్నీ కొరివితో తలగోక్కున్న చందంగా మారడం, యుద్ధోన్మాదాన్ని రేకెత్తించేవిగా ఉండడమే. ట్రంప్‌కు ప్రతికూలంగా అంతర్జాతీయ పరిణామాలు, పరిస్థితులు బలపడుతున్న నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ మరింతగా తెరపైకి వస్తున్నారు. ఆయన పట్ల, ఆయన నాయకత్వ పఠిమ పట్ల ప్రపంచ దేశాలకు ఇప్పటకే నమ్మకం కుదిరింది. మరోసారి కూడా రష్యా అధ్యక్షుడిగా పుతినే ఎన్నిక కావడం తథ్యమన్న సంకేతాలు బలపడుతున్నాయి. మళ్లీ ఆయన దేశ పగ్గాలు చేపడితే అనేకరకాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం అనివార్యమే అవుతుంది. ఇప్పటికే సిరియా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా అదేవిధంగా మధ్యప్రాచ్య వ్యవహారాల విషయంలోనూ క్రియాశీలక జోక్యం ద్వారా పుతిన్ తన పలుకుబడిని, వ్యవహార దక్షతను, నేర్పరితనాన్ని రుజువు చేసుకోగలిగారు. డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా సమస్యలను ముదరబెట్టి కయ్యం వరకు తెచ్చుకునే నైజం పుతిన్‌ది కాదు. కీలెరిగి వాతపెట్టడం ద్వారా ఆయన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరన్న నమ్మకం కూడా అంతర్జాతీయంగా బలపడుతోంది. పుతిన్ మరోసారి రష్యా పగ్గాలు చేపడితే మాత్రం అమెరికా ధోరణితో విసుగెత్తిపోయిన దేశాలు ఆయన పట్ల కచ్చితంగా మొగ్గుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను మరోసారి అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్నానని ప్రకటించడం ద్వారా పుతిన్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించారు. దేశాధ్యక్ష పదవిని ఆయన చేపట్టడం ఇది నాలుగోసారి అవుతుంది. పైగా పుతినే కావాలంటూ 80 శాతం మందికిపైగా రష్యన్ ప్రజలు సానుకూలంగానే స్పందించారు. వీటన్నింటినీ బట్టి చూస్తే రష్యా అధ్యక్ష పీఠాన్ని పుతిన్ సునాయంగానే మార్చి 18న జరిగే ఓటింగ్‌లో చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. ఆరేళ్లపాటు ఎన్నికైన వ్యక్తి అధికారంలో కొనసాగుతారు. మొదట ఈ పదవీకాలం నాలుగేళ్లే ఉన్నప్పటికీ 2008లో దీన్ని మరో రెండేళ్లు పొడిగించి ఆరేళ్లకు స్థిరపరిచారు. 2000 సంవత్సరం నుంచి ఇటు అధ్యక్షుడిగానూ, అటు ప్రధానిగానూ రష్యా రాజకీయాలను అదే విధంగా అంతర్జాతీయ వ్యవహారాలను తనదైన శైలిలోనే పుతిన్ చక్కబెడుతూ వచ్చారు. రష్యా పురోగమనాన్ని, పురోగతిని ఎవరూ ఆపలేరని తరచూ చెప్పుకుంటే వచ్చే పుతిన్ మరోసారి దేశాధ్యక్ష పీఠాన్ని చేపడితే మాత్రం కచ్చితంగా ప్రపంచ రాజకీయాలకు అది మలుపే అవుతుందన్నది వాస్తవం. పశ్చిమ దేశాల ధాష్టీకాన్ని అమెరికా సారథ్యంలో అది వ్యవహరిస్తున్న తీరును అనేక పర్యాయాలు ఎండగట్టిన పుతిన్ ఈసారి ఎన్నికల్లో దానే్న ప్రచార ఆయుధంగా చేసుకోవడంతోపాటు అమెరికా వ్యతిరేక దేశాలన్నింటినీ తనవైపు తిప్పుకునే అవకాశం కూడా ఉంది. నిజానికి పుతిన్ మళ్లీ పోటీచేస్తారా లేదా అన్న దానిపై ఏడాదిపాటు ఎనలేని ఉత్కంఠే సాగింది. అంతిమంగా ఆయన అసలు విషయాన్ని బయటపెట్టడంతో తన ఎన్నికనూ సునాయాసంగా మార్చుకోగలిగారు. పైగా మార్చి 18నే రష్యా అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని భావించడానికి కారణం- క్రిమియా అనే రిపబ్లిక్‌ను రష్యా తనలో కలుపుకున్న రోజు అదే కావడం. ఆ విధంగా రష్యా ఆధిపత్యాన్ని కూడా ఈ ఎన్నిక ద్వారా మరోసారి పుతిన్ తెలియజేసే అవకాశం కనిపిస్తున్నాయి. పుతిన్ అధ్యక్ష పీఠంపై ఉంటే రష్యాకు ఎదురుండదని, ఆయన లేని రష్యాను ఊహించడమే కష్టమన్న భావన కూడా బలంగా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడంత ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా పుతిన్‌కు లేనప్పటిక చాలాదేశాల్లో ఆయనెవరో తెలియనప్పటికీ కూడా తనదైన శైలిలో పశ్చిమ దేశాల వ్యూహాలను తిప్పికొట్టడం ద్వారా తానేమిటో తన సత్తా ఏమిటో పుతిన్ ప్రపంచ దేశాలకు చాటిచెప్పగలిగారు. ఇప్పటికే సిరియా సంక్షోభాన్ని ఆయన పరిష్కరించిన తీరుపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే విధంగా అమెరికా సహా అన్ని దేశాలనూ గడగడలాడిస్తున్న ఐసిస్ వ్యవహారంలోనూ ఆయన విజయం సాధించారు. ఈ ఉగ్రవాద సంస్థ వెన్ను విరవడం ద్వారా ప్రపంచ శాంతికి తనదైన రీతిలో దోహదం చేయడమే గాకుండా ఉగ్రవాదం పట్ల సింహనాదమే చేశారు. పుతిన్‌పైన, రష్యాపైన పశ్చిమ దేశాలు అనేక కోణాల్లో ప్రతికూల ప్రచారం చేశాయి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రపన్నాయి. అమాయకులను, పిల్లలను పొట్టనబెట్టుకున్నాడని కూడా ఆరోపణలు చేశాయి. అయినప్పటికీ కూడా సిరియా విషయంలో అమెరికా చేయలేని పనిని పుతిన్ చేశారు. ఆ విధంగా ఆయన తన రాజకీయ పటిమను, సత్తాను, దూరిదృష్టినీ కూడా చాటుకో గలిగారు. వీటన్నింటి నేపథ్యంలో పుతిన్‌కు రాజకీయంగా దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగానూ బలమైన, స్థిరమైన, స్థిరచిత్తం కలిగిన నాయకుడిగా పేరుంది. మళ్లీ ఆయనే దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే ఒక రకంగా అమెరికా అనుకూల దేశాలకు రష్యా సింహస్వప్నంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ ఎన్నికల విషయంలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు సర్వత్రా వ్యాపించాయి. అంటే అమెరికా ఆంతరంగిక వ్యవహారాలను కూడా మలుపుతిప్పగల సత్తా పుతిన్‌కు ఉందన్న విషయం దీంతో తేటతెల్లమైంది. ఈ ఆరోపణల నిజానిజాలు ఎలావున్నా రష్యా అధ్యక్ష పీఠాన్ని పుతిన్ మళ్లీ అధిరోహిస్తే అమెరికాతో పోటాపోటీగా మరోసారి అంతర్జాతీయంగా రాణిచగలిగే రాజకీయ విస్తృతిని పలుకుబడిన ఆర్జించిపెట్టగల పటిమ కూడా పుతిన్ సొంతం.

-బి.రాజేశ్వర ప్రసాద్