స్పాట్ లైట్

కత్తిమీద సాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం అన్నది అనుకూల ప్రతికూల వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న నేపథ్యంలో ప్రధాని థెరిసామె వేయబోయే తదుపరి అడుగు ఏమిటన్నది అంతర్జాతీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. ఐరోపా యూనియన్‌లో ఉండడం వల్ల బ్రిటన్‌కు అన్ని విధాలుగా నష్టమేనన్న భావనతో దీన్నుంచి వేరుపడాలంటూ దేశ ప్రజలు మెజారిటీ తీర్పునిచ్చారు. అయితే ఐరోపా యూనియన్‌లోనే ఉండాలంటూ పట్టుబట్టినవారి ఓటుకు వైదొలగాలని భావించినవారి ఓటుకూ మధ్య తేడా స్వల్పమే కావడంవల్ల ఇప్పటికీకూడా ‘ముందుకా వెనక్కా’ అన్న మీమాంస కొనసాగుతూనే ఉంది. పైగా నిన్న మొన్నటివరకూ ఐరోపా యూయన్‌తో చెట్టపట్టాల్ వేసుకున్న బ్రిటన్ ఉన్నపళంగా వైదొలగడం అన్నది అంత తేలికేమీ కాదు. పైగా ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల్లో ఆర్థికంగానూ, ఇతరత్రానూ చాలా బలంగా ఉన్న దేశం బ్రిటన్. అలాంటిది బ్రిటన్ వైదొలగడం అంటే ఏళ్ల తరబడి పెనవేసుకుపోయిన అనేక సంక్లిష్ట అంశాలను ఉభయతారకమైన రీతిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కాని ఈ దిశగా ప్రధాని థెరిసామె చేపడుతున్న చర్యలు గాని, విసురుతున్న పాచికలు గాని ఇప్పటివరకూ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. పార్లమెంటులో మెజారిటీ వస్తే తాను అనుకున్న రీతిలో ఐరోపా యూనియన్‌తో బ్రెగ్జిట్ చర్చలను కొనసాగించవచ్చునని థెరిసామె భావించారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న మెజారిటీ కూడా తగ్గిపోవడంతో ఏ విధంగానూ ధైర్యంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ఐరోపా యూనియన్‌తో జరిపే చర్చల విషయంలో బ్రిటన్‌కు ఏ విధంగానూ అన్యాయం జరగడానికి వీల్లేదని, వలసదారుల సమస్యతోపాటు అన్నింటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ మరింతగా పట్టు బిగించింది. ఈ నేపథ్యంలోనే వాయిదాలమయంగా సాగుతూ వచ్చిన తొలిదఫా చర్చలు ఎట్టకేలకు ముగిసాయి. అయితే తదుపరి జరిగే సమావేశాలు అనేక రకాలుగా బ్రిటన్ ప్రధానికి కత్తిమీద సాము లాంటివేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది అంతా సమస్యల మయంగా ఎటూ తేల్చుకోలేని మీమాంస చందంగా సాగిన ప్రధాని కొత్త ఏడాదిలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలగినప్పటి నుంచీ ఎంతోకొంత చర్చాపథంలో ప్రగతిని నమోదు చేసుకుంటూ వచ్చినప్పటికీ తదుపరి జరిగే చర్చలన్నీ కూడా బ్రిటన్ తన వైఖరిని మరింత కఠినంగా, స్పష్టంగా వ్యక్తీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దిశగా ఇప్పటికే దేశీయ రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఏ విధంగానూ ఐరోపా యూనియన్ షరతులకు లోబడి బ్రిటన్ వ్యవహరించకూడదని స్పష్టం చేసిన ఈ పార్టీలు అనేక రకాలుగా వాస్తవిక దృక్పథాన్ని కూడా కనబర్చడం కొంతమేర ప్రధానికి ఊరటనిచ్చే అంశం. ఐరోపా యూనియన్ నిబంధనల ప్రకారం ఒకదేశం తన సభ్యత్వం నుంచి వైదొలగితే యూనియన్ చెప్పినట్టుగానే దాని ఆదేశాలను అనుసరించే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని, వైదొలగే దేశం తన హక్కులకు సంబంధించి ఎలాంటి షరతులనూ పెట్టే అవకాశం ఉండదు. అంటే ఐరోపా యూనియన్ నిబంధనల ప్రకారమే మారు మాటాడకుండా బ్రిటన్ తప్పుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అందుకే నొప్పించక తానొవ్వక రీతిలో తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ఐరోపా యూనియన్ ప్రతిష్ఠను ఇనుమడింపచేస్తూ, ఇతర సభ్య దేశాల నుంచి ఏ రకమైన సమస్య తలెత్తని రీతిలోనే బ్రిటన్ నిష్క్రమణ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ సమస్య అన్నది ఎప్పటికప్పుడు సంక్లిష్టంగా మారుతూనే వస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రధాని థెరిసాకు ఇది మరింత తీవ్ర సమస్యగా మారే అవకాశమూ కనిపిస్తోంది. ఐరోపా యూనియన్‌లోనూ ఐరోపా యూనియన్ వెలుపలి దేశాల నుంచి వలస వచ్చిన వారి సంఖ్య లక్షల్లోనే ఉండడం వల్ల ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై దీని ప్రభావం చాలా తీవ్రంగానే కనిపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్వేచ్ఛాయుత వలసలకు అట్టుకట్ట వేయాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. వీటిని థెరిసామె ఏ విధంగా పరిష్కరించగలుగుతారు? దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చే దిశగా ఆమె వేసే పావులు ఎలా ఉంటాయి అన్నది కూడా ఈయూ సభ్యదేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రిటన్ చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇన్నాళ్లూ రాణించగలిగిందంటే అందుకు ఇతర దేశాల నుంచి వలస వచ్చినవారి చేయూత కూడా ఎంతో ఉంది. ఇప్పుడు బ్రెగ్జిట్ పెను సమస్యగా మారుతున్న నేపథ్యంలో వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ రంగాల్లోనూ తీవ్రస్థాయిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఆరోగ్య సేవా రంగం ఇప్పటికే తీవ్రస్థాయి సమస్యలను ఎదుర్కొంటోంది. బ్రెగ్జిట్ ఓటు జరిగినప్పటి నుంచీ వేల సంఖ్యలోనే నర్సులు ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్ పట్టిందే పట్టుగా తనమాటే నెగ్గాలన్న రీతిలో వ్యవహరిస్తే దేశంలోని కీలక రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకునే తొలి దశ చర్చల్లో వ్యవహరించిన ప్రధాని థెరిసా తదుపరి కీలక అంశాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అటు కఠినంగానూ, ఇటు సునిశితంగానూ వ్యవహరించకుండా బ్రిటన్ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఐరోపా యూనియన్ ప్రతిష్ఠ దెబ్బతినకుండా వ్యవహరించడమే ఇప్పుడు బ్రిటన్ ముందున్న కర్తవ్యం. అలాగే ఇప్పటివరకూ ఐరోపా యూనియన్‌లో ఉండడంవల్ల ఇతర దేశాలతో పెద్దగా ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవాల్సిన అవసరం గాని, అవకాశం గాని బ్రిటన్‌కు ఏర్పడలేదు. కాని ఇప్పుడు ఏకాకిగా మారడంవల్ల అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకునే రీతిలోనే బలమైన ప్రపంచ దేశాలతో బ్రిటన్ ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది కూడా బ్రిటన్ భవితను నిర్దేశించేదే అవుతుంది. రాబోయే అంతర్జాతీయ సదస్సుల్లో ముఖ్యంగా కామనె్వల్త్ దేశాల సదస్సు మరో కీలక పరిణామమే అవుతుంది. ఆ సమయంలో కూడా బ్రెగ్జిట్‌కు సంబంధించి బ్రిటన్ తన వైఖరిని కామనె్వల్త్ దేశాలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నందున దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. వాస్తవికత, దూరదృష్టి రంగరించిన సమతూక విధానంతో ముందుకు వెళ్లడం ద్వారా బ్రెగ్జిట్ లక్ష్యాలను బ్రిటన్ సాధించుకోగలుగుతుంది.

బి.రాజేశ్వర ప్రసాద్