స్పాట్ లైట్

ఎంతదూరమో అంత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతదూరమో అంత చేరువన్నట్టుగా గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ -అమెరికా మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పొరుగునున్న భారత్ సహా అనేక దేశాలు ఉగ్రవాదంపై పాకిస్తాన్ గురివింద ధోరణిని తూర్పారబడుతున్నప్పటికీ పాక్‌ను దూరం చేసుకునే విషయంలో అమెరికా ఇదమిత్తంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం నిర్మూలనకు కంకణం కట్టుకున్న అమెరికా ఈ జాడ్యాన్ని పెంచిపోషిస్తున్న పాక్ విషయంలో ద్వంద్వ నీతిని ఎందుకు అవలంబిస్తోంది. ఒకపక్క భారత్‌తో స్నేహ సంబంధాలు తమకెంతో కీలకమని పదే పదే చెబుతూ వచ్చిన అమెరికా అధ్యక్షులు, పాక్ తీవ్రవాద ధోరణిని ఎండగట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి సంబంధించినంత వరకూ పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి అనేక సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో పాక్ నిజ స్వరూపాన్ని ఎండగట్టడమే కాకుండా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోని పక్షంలో సహాయ సహకారాలను నిలిపివేస్తామని కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలు మాటలకే పరిమితమా? 9/11 తరువాత తమను అన్ని విధాలుగా ఆదుకున్న పాకిస్తాన్ ధోరణి విషయంలో అమెరికా అడపాదడపా కనె్నర్ర చేస్తున్నప్పటికీ, నిజంగా ఆ దేశాన్ని, దాంతో మైత్రీ బంధాన్ని వదులుకోగలుగుతుందా? అన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఎందుకంటే భారత్‌తో కంటే కూడా అనేక విషయాల్లో పాకిస్తాన్‌ను అమెరికా చేరువ చేసుకున్న సందర్భాలు, భారత్ వద్దన్నా దానికి నిధులను సమకూర్చిన ఉదంతాలు కోకొల్లలుగానే ఉన్నాయి. ఇంతకూ పాక్-అమెరికాల మధ్య ఈ రకమైన సంబంధాలు కొనసాగడానికి కారణమేమిటి? అమెరికా పదే పదే కొరడా ఝుళిపిస్తున్నా ‘మీతోనే మా మనుగడ’ అన్న చందంగా పాక్ తన ఉనికిని వదలుకుని మరీ అగ్రరాజ్యంతో మైత్రీబంధం కోసం ఎందుకు వెంపర్లాడుతోంది? దీనికి బలమైన, ఘనమైన నేపథ్యమే ఉంది. భారత్‌కంటే చాలా ముందుగానే పాకిస్తాన్ తమకు అత్యంత విశ్వసనీయమైన మిత్ర దేశమన్న అభిప్రాయాన్ని అమెరికా చాలా బలంగానే ప్రపంచ దేశాలకు అందించింది. అమెరికా సంబంధాలు ప్రధానంగా నాటో దేశాలతోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా నాటోతో ఏరకమైన సంబంధం లేని పాక్‌తో లోతైన సంబంధాలను అమెరికా కలిగి ఉండటానికి కారణం 60వ దశకంతో సీటో, సెంటోవంటి బహుళజాతి సంస్థల్లో పాక్‌కు సభ్యత్వం ఉండటమే. ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా అమెరికా ఆధ్వర్యంలో, దాని చెప్పుచేతల్లో అది అందించే నిధులతోనే మనుగడ సాగించినవన్ని వాస్తవాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి. ఈ నేపథ్యంలోనే నాటో దేశాల తరువాత తమకు అత్యంత విశ్వసనీయమైన దేశంగా పాక్‌ను ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ అమెరికా పరిగణిస్తూనే వస్తుంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి పాకిస్తాన్ పాలనా పగ్గాలు చేపట్టిన పర్వేజ్ ముషారఫ్ హయాంలో పాక్-అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి.
అమెరికా ట్విన్ టవర్స్‌పైనా, పెంటగాన్‌పైనా అల్‌ఖైదా మిలిటెంట్లు దాడి చేసి బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యంలో ఆఫ్గాన్‌పై దాడి చేయాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడికి పర్వేజ్ ముషారఫ్ సూచించటం, దానికి అనుగుణంగా అల్‌ఖైదాను తుదముట్టించేందుకు ఆఫ్గాన్‌పై అమెరికా నెలల తరబడి దాడులు చేయడం జరిగిందన్నది ప్రస్తుత చరిత్ర. ఆ విధంగా తమను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పిన పాక్‌కు ప్రతిఫలంగా అమెరికా లక్షలాది డాలర్లమేర సహాయ సహకారాలను అందించింది. ఆ వితరణలో ప్రధాన ఉద్దేశం తమ దేశంలోవున్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ పాక్ ఏరివేస్తుందని. ఆ విధంగా ప్రపంచం నుంచే ఉగ్రవాదాన్ని రూపుమాపాలన్న తమ లక్ష్య సాధనకు సహకరిస్తుందని అమెరికా భావించడమే. మొదట్లో అంతే విశ్వసనీయంగా అమెరికాకు పాక్ సహాయ సహకారాలు అందించింది. ఆఫ్గనిస్తాన్‌లో తిష్టవేసిన నాటో దళాలకు అవసరమైన ఆయుధాలు, ఆహార పదార్థాలను తన భూభాగం గుండా సరఫరా చేయడానికి అన్ని విధాలుగా తోడ్పడింది. కానీ, అమెరికా అందించిన నిధులే దారి మళ్లాయి. ఏ ఉగ్రవాదాన్నైతే అమెరికా నిర్మూలించాలనుకుందో, దేని విషయంలో పాక్‌నుంచి తమకు పూర్తిస్థాయిలో తోడ్పాటు అందుతుందని భావించిందో ఆ లక్ష్యమే నీరుగారిపోయింది. అల్‌ఖైదా అధినేత ఓసామా బిన్ లాడెన్ తమ ముంగిట్లోనే ఉన్నా, ఆ విషయాన్ని అమెరికాకు పాక్ తెలియజేయలేదు. లాడెన్‌ను తుదముట్టించే బాధ్యతను స్వయంగా చేపట్టిన అమెరికా పాక్ భూభాగంలోకి ప్రవేశించి తాననుకున్న లక్ష్యాన్ని సాధించుకుంది. అప్పటినుంచీ పాక్‌పై అమెరికాకు అనుమానాలు మొదలయ్యాయి. దాని విశ్వసనీయతనే శంకించే పరిస్థితి ఏర్పడింది. అమెరికా నిధులు దారుణంగా పక్కదోవ పట్టాయన్న వాస్తవాలు ముషారఫ్ నిష్క్రమణ అనంతరం నిగ్గుదేలాయి. ఈ అంశంపై విస్తృతస్థాయిలో దర్యాప్తు అనంతరం వాస్తవాన్ని తేల్చిన అమెరికా, తాజాగా పాక్‌కు అందిస్తున్న సాయంతో కోతపెట్టింది. పరిస్థితి ఇంత తీవ్రంగావున్నా పాక్‌ను పూర్తిస్థాయిలో విశ్వసించే పరిస్థితి లేకున్నా, పాక్ విషయంలో అమెరికాకు మాత్రం పూర్తి వ్యతిరేకత ఎన్నడూ లేదు. ఓ పక్క తిడుతూనే మరోపక్క దాని స్నేహాన్ని కోరుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రకమైన పరిస్థితే కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా 1979లో అప్పటి అగ్రరాజ్యాల్లో ఒకటిగావున్న సోవియట్ యూనియన్ ఆఫ్గాన్‌పై దాడి చేసినపుడు, అమెరికాకు పరోక్షంగా సాయం చేసింది పాకిస్తాన్. ఆ సమయంలో ఈ రెండు దేశాల మధ్య విశ్వసనీయత అత్యున్నత స్థాయిలోనే ఉంది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్హక్ అమెరికాకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతగానో సహకరించారు. ఆ రకమైన పరిణామాలు, పరిస్థితులు ఈ రెండు దేశాల మధ్య అనేక సందర్భాల్లో చోటుచేసుకుంటూనే వచ్చాయి. పైగా ఇప్పుడు పాకిస్తాన్‌కు బలమైన మిత్రదేశంగా చైనా తెరపైకి వచ్చింది. చీటికీ మాటికీ పాక్‌ను తప్పుబట్టడాన్ని దీని విషయంలో భారత్ సహా అనేక దేశాలు వ్యవహరిస్తున్న తీరునూ డ్రాగన్ నిత్యం ప్రతిఘటిస్తూనే ఉంది. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఇదే విషయాన్ని ఇటీవలి కాలంలోనూ అనేక సందర్భాల్లో విస్పష్టంగా తెలియజేసింది. అన్ని విధాలుగా పాక్‌తో మైత్రీబంధం చైనాకు ఎంత అవసరమో, పూర్తిగా నమ్మకం లేకపోయినా ఈ రకమైన బంధానే్న పాక్‌తో కొనసాగించాల్సిన అవసరమూ అమెరికాకు ఉంది. అందుకే అంతర్గతంగా ఎన్నో వైరుధ్యాలున్నా, అనేక విషయాల్లో విభేదాలు తలెత్తుతున్నా ఈ రెండు దేశాల మధ్య కలహాల కాపురం కొనసాగుతూనే ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఒకరినొకరు దూరం చేసుకునే పరిస్థితిగాని, అవసరంగాని ప్రస్తుతం లేదు. ఒకవేళ ఉన్నా అవసరం కంటే కూడా పాక్‌తో స్నేహమే కొంతలో కొంత మిన్న అన్న ధోరణితోనే అమెరికా ముందుకు వెళ్తుంది. అందుకే ట్రంప్ ఎంతగా కారాలు, మిరియాలు నూరినా పాక్‌కు సంబంధించినంత వరకు అది క్షణికావేశమే తప్ప, శాశ్వతంగా ఆ దేశాన్ని దూరం చేసుకోవాలన్న ఆలోచన కాదు. భారత్ పదే పదే పాక్ నిజస్వరూపాన్ని, ఉగ్రవాద సానుకూల ధోరణిని అమెరికా దృష్టికే కాదు, అంతర్జాతీయ వేదికలపైనా నిగ్గుదేల్చినా, అమెరికా శీతకన్ను వేసిందే తప్ప ఏ రకమైన చర్యలనూ తలపెట్టలేదు. ట్రంప్ హయాంలోనూ ఈ రెండు దేశాల మధ్య ఇదే తరహా సంబంధాలు కొనసాగే అవకాశాలే ఉన్నప్పటికీ, ఏదోక అద్భుతం జరిగితే తప్ప పాక్‌కు అమెరికా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉండదన్నది ఈ నాలుగు దశాబ్దాల పరిణామాలు కళ్లకు కడుతున్న వాస్తవం.