స్పాట్ లైట్

భయం పోతేనే వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలల తరబడి ఇటు బంగ్లాదేశ్, అటు మైన్మార్‌ను కుదిపేసిన రోహింగ్యాల సమస్య ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మైన్మార్‌లో రఖీనా రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలు అక్కడ జరిగిన సైనిక దాడులకు తల్లడిల్లి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తోసహా అనేక దేశాలకు తరలిపోవడం, ముఖ్యంగా బంగ్లాలో దయనీయ పరిస్థితుల్లోనే వారు జీవనాన్ని గడపడం అంతర్జాతీయంగా కలవరానే్న రేపింది. తరతరాలుగా మైన్మార్‌లోనే ఉంటున్నా పౌరసత్వం అంటూ లేని పరిస్థితుల్లోనే రోహింగ్యా మైనారిటీ ముస్లింలు జీవనాన్ని సాగించారు. అయితే వీరి కారణంగానే దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయన్న ఆరోపణలతో మైన్మార్ సైన్యం వారిని తొలగించే ప్రయత్నం చేసింది. ఆ విధంగా వందల సంఖ్యలోనే రోహింగ్యాలు మరణించారు. ఇంకొంత మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లక్షల సంఖ్యలోనే పొరుగున ఉన్న బంగ్లాకు పరుగులు పెట్టారు. ఇంతకీ రోహింగ్యాలు చేసిన పాపమేమిటో తెలియదు కానీ, వారిపట్ల మైన్మార్ వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశమైనా కూడా ఇతర దేశాలతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను పెంపొందించుకోగలిగితేనే మనుగడ సాగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో దేశానికి చెందిన వ్యక్తులు లక్షల సంఖ్యలో రావడం అన్నది భరించలేని పరిణామమే అవుతుంది. గత కొన్ని నెలలుగా రోహింగ్యాల తాకిడివల్ల బంగ్లాదేశ్ ఇదే సమస్యను ఎదుర్కొంటూ వచ్చింది. వారికి కొన్నిచోట్ల శరణార్థ శిబిరాల్లో ఆశ్రయం కల్పిస్తున్నప్పటికీ నిరంతర ప్రాతాపదికన వారిని పోషించే అవకాశం ఉండదు కాబట్టి వారిని వెనక్కి పంపే ప్రయత్నంలో భాగంగా మైన్మార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే రెండేళ్ల వ్యవధిలో తమ దేశంలో ఉన్న రోహింగ్యాలు తిరిగి మైన్మార్‌కు వెళ్లిపోయే విధంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా స్పష్టమవుతోంది. అందర్నీ ఒకేసారి కాకుండా క్రమానుగతంగా వీరిని స్వదేశానికి పంపే విషయంలో ఓ స్పష్టమైన రీతిలోనే ఇరు దేశాలు అవగాహన కుదుర్చుకున్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న రోహింగ్యాలు తిరిగి మైన్మార్ వెళ్లిపోవడానికి ఈ ఒప్పందం ఎలాంటి ఆశలు కల్పించదు. కేవలం కొన్ని నెలల్లో బంగ్లాకు తరలిపోయినవారు మాత్రమే తిరిగి రావడానికి ఇది వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఉత్తర రాష్టమ్రైన రఖీనా నుంచి బంగ్లాకు తరలిపోయిన వారు ఈ ఒప్పందాన్ని ఆలంబనగా చేసుకుని రెండేళ్ల వ్యవధిలో స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగ్లాలో రెండు లక్షల మందికిపైగా మైన్మార్ రోహింగ్యాలు అక్కడి శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం తెలుస్తోంది. రోహింగ్యాలను వెనక్కి పంపాలన్న ఈ ఒప్పంద స్ఫూర్తి అభినందనీయమే అయనప్పటికీ స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత వీరికి పూర్తి స్థాయిలో భద్రత చేకూరుతుందా? మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరో దేశానికి పరుగులు పెట్టాల్సి ఉంటుందా అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. సమీప భవిష్యత్తులోనే రోహింగ్యాలను వెనక్కి పంపే ప్రక్రియను ప్రారంభిస్తామని ఇరు దేశాల ప్రతినిధులు చెబుతున్నా ఎలాంటి అవరోధాలకు తావు లేకుండా దీన్ని అమలు చేయడం అన్నది అత్యంత కీలకం. ఈ విషయంలో బంగ్లాదేశ్ కంటే కూడా మైన్మార్ పాలకులకు రాజకీయ చిత్తశుద్ధి ఎంతైనా అవసరం. ముఖ్యంగా తమ దాడులవల్లే పారిపోయిన రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకునే విషయంలో మైన్మార్ ఓ పట్టాన ముందుకు రాలేదు. ఐక్యరాజ్య సమితి మొదలుకుని అన్ని దేశాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిన నేపథ్యంలోనే ఈ తాజా ఒప్పందం కుదుర్చుకుందన్నది వాస్తవం. శరణాస్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు బంగ్లాదేశ్ భారీ ఎత్తున తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసినట్టే తిరిగి స్వదేశానికి వస్తున్న రోహింగ్యాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు మైన్మార్ కూడా గట్టి ఏర్పాట్లు చేయడం అత్యంత అవసరం. అంతేగాకుండా వీరికి ఆవాసంతోపాటు తమ ప్రాణాలకు తిరుగులేదన్న భద్రతా భావాన్ని కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తాము స్వదేశానికి వెళ్లేది లేదన్న సంకేతాలను అందిస్తున్న రోహింగ్యాలు మళ్లీ అక్కడికి వెళితే తమ ప్రాణాలకే ముప్పు అన్న ఆందోళనతోనూ ఉన్నారు. ముందుగా వీరిలో ఈ భయాన్ని తొలగించి, ధీమాను కల్పించాల్సిన బాధ్యత మైన్మార్ పాలకులపై ఉంది.

- బి. రాజేశ్వర ప్రసాద్