స్పాట్ లైట్

‘బెల్ట్’ బిగించిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థబలంతోపాటు అపారమైన ప్రాబల్యం కూడా ఒక దేశ ప్రతిష్టను, దాని ప్రభావశీలతను ఎంతగానో పెంచుతుంది. వర్ధమాన ప్రపంచంలో చైనా ఇదే వ్యూహంతో ముందుకు దూసుకుపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా తనకు ప్రయోజనం కలిగించే, తనకు ఆర్థికంగా రాజకీయంగా లబ్ధిని చేకూర్చే ప్రాజెక్టులకు సంబంధించి రాజీలేని రీతిలోనే పావులు కదుపుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా తనకు అన్నివిధాలుగా సవాలు విసురుతున్న భారత్‌ను అడ్డుకోవడమే ధ్యేయంగా వున్న చైనా పాలకులు తాజాగా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు ఉద్దేశమిదే. మొత్తం దక్షిణాసియా ప్రాంతంలోని అన్ని దేశాలపైనా తన పట్టును బిగించుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక చైనా ఉద్దేశం. మొదట్నుంచీ కూడా చైనా ఉద్దేశాలను, భారత్‌కు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలను తనవైపు తిప్పుకునే నైజాన్ని లోతుగానే అధ్యయనం చేసిన భారత నాయకత్వం ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయడం ఎంతైనా సమర్థనీయం, సముచితం. అనేక దేశాలు ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరైనప్పటికీ భారత్ మాత్రం దీని పట్ల తన నిరసనను తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఆ భేటీని బహిష్కరించింది. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత మాట ఎలా ఉన్నా తనకు అనుకూలంగా ఉన్న దేశాలను ఆర్థిక తాయిలాలతో ఇతర ప్రయోజనాలతో చైనా ఆకట్టుకుంటోందన్న ఆందోళన మొదటినుంచీ కూడా భారత్‌లో ఉంది. మొత్తం ఒక ఖండానికి ఖండం ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది. ఇది పూర్తిగా చైనా నిర్వహణలో దాని ఆధిపత్యం కిందే ఉండటం వల్ల ఈ ప్రాజెక్టును వినియోగించుకునే దేశాలన్నీ కూడా వౌలిక సదుపాయాల పరంగా ఎంతో లబ్ధి పొందుతాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయాలపై పట్టు సంపాదించడమే ఏకైక ధ్యేయంగా ఉన్న చైనా నాయకత్వం అందుకు ఎలాంటి వ్యూహాలనైనా రచించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వెనుకాడదన్న వాస్తవం ఇప్పటికే అనేక కోణాల్లో రుజువైంది. మొదట్నుంచీ కూడా ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తూనే ఉంది. అందుకు కారణం ఇటు భారత ఉపఖండంలోనూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవడానికి చైనా ప్రయత్నించడమే... ఇప్పటికే చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపట్ల కూడా భారత్ తన వ్యతిరేకతను చాటినప్పటికీ దాన్ని చైనా నాయకత్వం ఖాతరు చేయలేదు. ఓ పక్క ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు బిఆర్‌ఐ పేరుతో బెల్ట్ అండ్ రోడ్ వౌలిక సదుపాయాల ప్రాజెక్టును చైనా నాయకత్వం చేపట్టడమన్నది భారత్‌కు సహజంగానే ఆందోళన కలిగించే అంశం. ఆర్థిక కారిడార్ కూడా ఈ బిఆర్‌ఐ ప్రాజెక్టులో భాగంగానే పరిగణించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ అధీనంలో వున్న భూభాగం మీద బిఆర్‌ఐ ప్రాజెక్టు వెళ్లడం ఏవిధంగానూ ఉపేక్షించదగినది కాదు. ఏ దేశానికైనా ఆర్థిక శక్తితో పాటు సార్వభౌమత్వ పరిరక్షణ, ప్రాదేశిక సమగ్రత అన్నవి అత్యంత కీలకమైన అంశాలు. వీటి విషయంలో రాజీపడితే ఒక దేశం తన ఉనికిని కోల్పోయినట్టే. రాజకీయ ప్రాబల్యాన్ని చేజేతులా వదులుకున్నట్టే. ఇప్పుడు బిఆర్‌ఐ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా దాన్ని బాయ్‌కాట్ చేయడంద్వారా చైనా నాయకత్వ విధానాలను భారత్ మరింతగా ఎండగట్టినట్లయింది. ముఖ్యంగా తనకు సన్నిహితంగా వున్న అన్ని దేశాలకు ఒకదాని తర్వాత ఒకటిగా చైనా ఆకట్టుకుంటూ రావడం, వాటికి ఆర్థికంగానూ రక్షణపరంగానూ ప్రయోజనాలను కలిగించడాన్ని బట్టి చూస్తే భారత్ ఆగ్రహం ఎంతైనా సమర్థనీయమైనదే. ప్రాజెక్టులను చేపట్టడం, ఇతర దేశాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడమన్నది చైనా అంతర్గత అంశమే అయినప్పటికీ దానివల్ల తనకు కలుగుతున్న నష్టం విషయంలో భారత్ వ్యతిరేకతను చాటిచెప్పడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇరుగు పొరుగు దేశాలతో మైత్రీబంధాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తూ వచ్చిందో తన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలోనూ అంతే పట్టుదలగా వ్యవహరిస్తూ వచ్చింది. ట్రిలియన్లకొద్దీ డాలర్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచానికి తాము ఇచ్చిన కానుకగా చైనా ఎంతగా చెబుతున్నా దీనివెనుక రాజకీయ వ్యూహం దక్షిణాసియా ప్రాంతంలో తన పట్టును బిగించాలన్న ఆలోచన చైనాకు ఉందన్నది కాదనలేని వాస్తవం. ఇప్పటికే భారత్‌కు సంబంధించిన ప్రతి ప్రయత్నాన్నీ చైనా వ్యతిరేకిస్తోంది. అణు సరఫరా దేశాల గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం రాకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి ఐరాస ఫోరంలో భారత్ చేసిన ప్రయత్నాలకు గండికొట్టింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించడమన్నది తన ఉనికిని చాటుకునే ప్రయత్నంగా చైనా ప్రాబల్యాన్ని తట్టుకుని నిలబడాలన్న బలమైన ఆలోచనకు నాందీగా భావించాల్సి ఉంటుంది. భారత్‌కు ఇటు పాకిస్తాన్‌తోనూ, అటు చైనాతోనూ సరిహద్దు సమస్యలు ఉన్నాయి. వాటిని ఆసరా చేసుకుని నిరంతరం కయ్యానికి కాలుదువ్వడం, అవకాశం వచ్చిన ప్రతిసారి భారత్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం చైనాకు ఆనవాయితీగా మారింది. అదే క్రమంలో దశాబ్దాలుగా భారత్‌కు సన్నిహితంగా ఉన్న శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాలనూ చైనా తనవైపు తిప్పుకోవడం ఇటీవల మరింత ప్రస్ఫుటమైంది. ఈ క్రమంలో చైనా తాజా ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించడమే కాకుండా దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ఎండగట్టడం అనివార్యమైంది. ఇటీవల చైనా హెచ్చరికలను ధిక్కరించి దలైలామా పర్యటనను భారత్ అనుమతించినప్పటి నుంచీ మొదలైన చైనా ప్రతికూల ధోరణి అనేక కోణాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ‘బెల్ట్’ బిగించిన చైనా భౌగోళిక విస్తరణ వ్యూహాన్ని భారత్ ఏ విధంగా అడ్డుకుంటుంది? అందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.

- బి. రాజేశ్వర ప్రసాద్