స్పాట్ లైట్

చైనాకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ నాలుగు దేశాల పర్యటన వ్యూహం ఇదే
ఐరోపా యూనియన్‌తో సాన్నిహిత్యానికి అవకాశం
రష్యాతో బంధానికీ పూర్వవైభవం?

ప్రధాని మోదీ మరోసారి ఆర్థిక సంస్కరణల జైత్రయాత్ర చేపట్టారు. రష్యా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ పర్యటనల ద్వారా మోదీ భారత దేశంలో వచ్చిన మార్పులను కళ్లకు కట్టబోతున్నారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకట్టుకోవడం ద్వారా తన నాయకత్వ పటిమను మరోసారి రుజువు చేసుకోబోతున్నారు. ఈ నాలుగు దేశాల్లో మూడు ఐరోపా యూనియన్‌లో కీలక దేశాలు కావడం మోదీ పర్యటన ప్రాధాన్యతను మరింత పెంచింది. ముఖ్యంగా చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి రష్యా అధినేత పుతిన్‌తో ఆయన జరిపే చర్చలు సమీప భవిష్యత్‌లో ఏ రకమైన మార్పులు తీసుకు వస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.

మూడేళ్ల క్రితం కేంద్రంలో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం భారత్‌ను అన్ని దేశాలతోనూ సన్నిహితం చేస్తోంది. ఇరుగుపొరుగున ఉన్న దేశాల్లో పాకిస్తాన్ మినహా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లతో భారత్‌కు ఇటీవల కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు అనేక విధాలుగా బలపడ్డాయి. ఇదే క్రమంలో సుదూర దేశాలతో సైతం ఇదే తరహా అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో సార్లు విదేశీ పర్యటన చేపట్టిన మోదీకి తాజాగా రష్యా, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్‌లలో జరుపతలపెట్టిన పర్యటన అనేక కోణాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దిగుమతుల స్థానే ఎగుమతులకు భారత్‌ను అంతర్జాతీయంగా కీలక కేంద్రంగా మార్చాలన్న మోదీ కలలు సాకారం కావడానికి ఈ నాలుగు దేశాల పర్యటన అనేక కోణాల్లో దోహదం చేసే అవకాశం కనిపిస్తోంది. భారత దేశంలో ఇటీవల కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ఇప్పటికే బలమైన రీతిలో ప్రచారంలోకి తెచ్చిన మోదీకి ఆ దిశగా లభించిన మరో అద్భుత అవకాశంగా ఈ పర్యటనను పరిగణించవచ్చు. ముఖ్యంగా భారత్‌లోకి భారీ పరిమాణంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిరావాలంటే..ప్రధాని భావిస్తున్నట్టుగా ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం నెరవేరాలంటే మరింతగా మరింతగా దూసుకుపోక తప్పదు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న మోదీ ఈ నాలుగు దేశాల పర్యటనకు ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
ఈ నాలుగు దేశాలూ కూడా భారత్‌కు అత్యంత కీలకమైనవే. వీటితో ఎంతగా ద్వైపాక్షిక, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడితే అంతగానూ భారత్ అంతర్జాతీయంగా రాణించేందుకు, ప్రపంచ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించేందుకూ అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో చైనా వ్యవహరిస్తున్న తీరు భారత్‌కు కొంత ఇబ్బందికరంగా మారిన మాట నిజం. ముఖ్యంగా బెల్ట్ రోడ్డు ప్రాజెక్టు ద్వారా తన అంతర్జాతీయ మూలాల్ని బలోపేతం చేసుకునేందుకు చైనా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. అనేక దేశాల మీదుగా సాగే ఈ బృహత్తర ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు భారత్ నిరాకరించడం ఎంతైనా సమంజసం. అయితే..చైనాను ఏ విధంగా వ్యాపార, వాణిజ్య పరంగా ఢీకొనాలన్న దానిపై సరైన దృష్టి సారించడానికి, అంతర్జాతీయంగా కీలక దేశాలను తనవైపు తిప్పుకోవడానికి రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ నేతలతో మోదీ జరిపే చర్చలు ఎంతగానో ఉపకరించేవే అవుతాయి. మొదటి నుంచి రక్షణపరమైన అంశాల్లో భారత్‌కు వెన్నుదన్నుగా నిలిచిన రష్యాతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, చైనా ధోరణి పట్ల తన నిరసనను వ్యక్తం చేయడానికి మోదీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన జరిపే చర్చలు ఇరు దేశాల మధ్య మైత్రీ బంధానికి పూర్వవైభవం తీసుకురాగలవన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రక్షణ, పౌర అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రష్యా నాయకత్వంతో మోదీ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకుంటున్నప్పటికీ అలీన విదేశాంగ విధానం ద్వారానే మోదీ ముందుకు వెళుతున్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండటంతో పాటు వ్యాపార, వాణిజ్య పరంగా భారత్‌కు అన్ని కోణాల నుంచి లబ్ధిని చేకూర్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రష్యాతో జరిపే వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇరు దేశాలను మారిన పరిస్థితుల నేపథ్యంలో మరింత సన్నిహితం చేసే అవకాశం కనిపిస్తోంది. జర్మనీతో కూడా భారత్‌కు సానుకూల సంబంధాలే ఉన్నాయి. ఇక్కడి నుంచి సాధ్యమైనంత విస్తృత స్థాయిలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని తీసుకురావడమే లక్ష్యంగా మోదీ జరిపే చర్చలు సమీప భవిష్యత్‌లో ఆచరణాత్మకం కాగలవన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. భారత్-ఐరోపా యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మోదీ జరిపే చర్చలు ఈ ప్రక్రియకు మరింత ఊతాన్నిచ్చే అవకాశం కనిపిస్తోంది. జర్మనీతో పాటు ఫ్రాన్స్, స్పెయిన్‌లు కూడా ఐరోపా యూనియన్‌లో కీలక భాగస్వామ్య దేశాలు కావడం వల్ల వీటితో భారత ప్రధాని జరిపే చర్చల ప్రాధాన్యత మరింత ఇనుమడించింది. ఈ మూడు దేశాలతో చర్చలు ఫలప్రదమైతే బలమైన ఐరోపా యూనియన్ దేశాలతో భారత్ అన్ని విధాలుగానూ ద్వైపాక్షిక బంధాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. 2007లో మొదలైన భారత్-ఐరోపాయూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు అనేక కారణాల మూలంగా 2013లో నిలిచి పోయాయి. అందుకు దారితీసిన సమస్యలను సవివరంగా చర్చించుకుని సరైన పరిష్కార మార్గాల్ని అనే్వషించేందుకు మోదీ తన వంతు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం అనుకున్న రీతిలో అమలులోకి వస్తే సమాచార టెక్నాలజీ సహా అన్ని రంగాల్లోనూ ఈ మూడు కీలక ఐరోపా యూనియన్ దేశాలతో భారత్ చేరువ కాగలుగుతుంది. భారత ప్రధాని స్పెయిన్ వెళ్లడం గత 29 సంవత్సరాలుగా ఇదే మొదటిసారి. స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్‌తో ఆయన జరిపే చర్చల పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ అవకాశాన్నీ మోదీ భారత్‌కు అనుకూలంగా మార్చుకోగలరన్న ధీమా కనిపిస్తోంది. హైటెక్ రంగంలో రెండు దేశాలు సన్నిహితం కావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే వీలుంది. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన మాక్రన్‌తో మోదీ జరిపే చర్చలు ఇరు దేశాలను అన్ని రంగాల్లోనూ చేరువచేయగలవన్న ధీమా భారత నాయకత్వంలో కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యూహాత్మక సంబంధాలను గమ్యానికి చేర్చే దిశగా మోదీ-మాక్రన్ చర్చలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద సుదీర్ఘకాలం తర్వాత మోదీ చేపట్టిన ఈ నాలుగు దేశాల పర్యటన ఐరోపా యూనియన్ దేశాలతో భారత్ సాన్నిహిత్యానికి, ప్రధానిగా నరేంద్ర మోదీ తన నాయకత్వ పటిమను మరోసారి రుజువు చేసుకోవడానికి దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- బి.రాజేశ్వర ప్రసాద్