స్పాట్ లైట్

ముంచేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచీ రోజుకో కొత్త వాదాన్ని, వివాదాన్ని తెరపైకి తెస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా పుడమికే మంట పెట్టాడు. భవిష్యత్ తరాల ఆశలపై నిప్పులు చెరిగాడు. నిప్పుల కుంపటిగా మారిన పర్యావరణాన్ని కాలుష్య కాసారంగా మారుస్తూ మానవాళి జీవనానికే పెనుముప్పు కలిగించే ఓ భయానక నిర్ణయాన్ని తృటిలో తీసేసుకున్నాడు. ప్రస్తుత తరానికే కాదు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అన్ని విధాలుగా జీవనయోగ్యమైన పర్యావరణాన్ని, వాతావరణాన్ని అందించాల్సిన బృహత్కర బాధ్యత ప్రతి ఒక్క దేశంపైనా ఉంది. ఈ విషయంలో ప్రస్తుత ప్రపంచ నాయకత్వం అత్యంత గురుతర రీతిలో వ్యవహరించాల్సిన అగత్యమూ ఉంది. అన్నింటికంటే మించి ప్రపంచానికి పెద్దదిక్కుగా ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయుధ సాయుధ బలగాలతో దూసుకెళ్లే అమెరికాకు భావి తరాలకోసం భూగోళాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మరింతగా ఉంది. కాని అమెరికా ఫస్ట్ అంటూ తొలి అధ్యక్ష పలుకులు పలికిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రపంచ బాధ్యతను విస్మరించి 190కి పైగా దేశాలు సంతకం చేసిన చారిత్రక ప్యారిస్ పర్యావరణ ఒప్పందానికి తూట్లు పొడిచాడు. దీని ఫలితాలను, పర్యవసానాలను ఏమాత్రం ఆలోచించకుండా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత తీవ్రస్థాయిలో భూగోళానికి ముప్పు కలిగించేదే అవుతుంది. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ప్రయోజనం కలుగుతుందని ట్రంప్ భావించవచ్చునేమో గాని వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగానే ఉంటాయి. ఏ విధంగా చూసినా కూడా దూరదృష్టి లేకుండా భవిష్యత్ తరాల సురక్షిత జీవనంతో నిమిత్తం లేకుండా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత నిర్హేతుకమే. దేశ మాజీ అధ్యక్షులు వద్దు... వద్దు అని వారిస్తున్నా, ప్రపంచ దేశాలు నిలువరించే ప్రయత్నం చేసినా బరితెగించిన రీతిలోనే ప్యారిస్ ఒప్పందాన్ని ట్రంప్ నట్టేట ముంచేశాడు. దీనివల్ల అమెరికాకు నష్టమే నంటూ దాన్నుంచి వైదొలగడం ద్వారా పర్యావరణ పరంగా అయోమయ వాతావరణానే్న సృష్టించాడు. పుడమిని రక్షించుకోకపోతే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను అరికట్టలేకపోతే భవిష్యత్ అంథకారమయమే అవుతుంది. పచ్చదనం హరించుకుపోయి, కాలుష్య ఉద్గారాల తీవ్రత పెరిగిపోయి భూగోళం నిప్పుల కొలిమిగానే మారుతుంది. సముద్రాలు ఉప్పొంగుతాయి. అంతూపొంతూ లేని రీతిలో కరవు కాటకాలు తాండవిస్తాయి. ఇప్పటికే గణనీయ పరిమాణంలో వినియోగంలో ఉన్న శిలాజ ఇంధనాన్ని గరిష్ఠ స్థాయిలో కుదించుకపోతే రాబోయే కాలంలో తలెత్తిబోయే విపరిణామాలు ఇవేనని చెప్పక తప్పదు. నిన్న మొన్నటివరకూ కేవలం అంచనాలు, భయానక ఆలోచనలుగానే ఉన్న ఈ భవిష్యత్ పరిణామాలకు ప్యారిస్ ఒప్పందాన్ని నిలువునా ముంచేయడం ద్వారా ట్రంప్ వాస్తవ రూపాన్ని కల్పించాడు. ప్రపంచం ఏమైపోతే ఏమీ, అమెరికా ఫస్ట్ అంటూ తనదైన శైలిలోనే నినదించాడు. 2015లో కుదిరిన ఈ ఒప్పందం పర్యావరణ పరిరక్షణ దిశగా తలమానిక ప్రయత్నమేనని ప్రతి ఒక్కరూ శ్లాఘించారు. అప్పట్లో అమెరికా సహా అన్ని దేశాలు కూడా ఈ ఒప్పంద ప్రాధాన్యతను గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాల సాధనకూ సమాయత్తమయ్యాయి. అలాంటిది కీలకభూమిక పోషించిన అమెరికానే దీన్నుంచి వైదొలగడం అన్నది ఎవరికీ మింగుడుపడని, ఎవరూ ఊహించని పరిణామమే. ఈ చర్య ద్వారా ట్రంప్ ఆశించిన ప్రయోజనం ఏమిటో అర్థం కాని పరిస్థితే. అమెరికా వ్యాపారవేత్తలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటివరకూ అన్ని దేశాలకూ గట్టి పోటీ ఇచ్చిన అమెరికా ఆ పదునును కోల్పోతుందని కూడా హెచ్చరించారు. వీటన్నింటినీ పెడచెవిన పెట్టిన ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమేగాకుండా ప్యారిస్ ఒప్పందమే అర్థరహితం అంటూ, అమెరికా ప్రయోజనానికి విఘాతకరం అంటూ సమర్థించుకోవడం విడ్డూరమే. అంతర్జాతీయ సారథ్యంకోసం ప్రతి విషయంలోనూ ముందుకొచ్చే అమెరికా పర్యావరణ మార్పుల నిరోధన విషయంలో వెనకడుగు వేయడం అన్నది దాని నాయకత్వ పటిమకు తీరని కళంకమే. దాదాపు 190 దేశాలు తమంతట తాముగా ముందుకు వచ్చి కాలుష్య ఉద్గారాల పరిమాణాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించుకుంటామని ప్రపంచ ప్రజల సాక్షిగా చేసిన ఈ ప్రమాణం ట్రంప్ పుణ్యమా అని నీరుగారిపోయింది. మొదటినుంచీ కూడా ట్రంప్‌ది అడ్డమంటే తెడ్డం అనే ధోరణి. ఏ విషయంలోనూ ఎవరినీ ఆయన సంప్రదించిన పాపాన పోలేదు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఏకైక ఆలోచన తప్ప వాటి పర్యవసానాలను గురించి ఆలోచించే తీరిక, ఓపిక ట్రంప్‌కు లేవన్నది వాస్తవం. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా 2025 నాటికి తన కాలుష్య ఉద్గారాల విసర్జన పరిమాణాన్ని 28 నుంచి 26 శాతానికి తగ్గిస్తామని, దీన్ని 2005 స్థాయికి తీసుకెళతామని అమెరికా స్పష్టం చేసింది. ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంది. వ్యాపారవేత్తగా వ్యక్తిగత లాభాలకోసమే పనిచేసిన ట్రంప్‌కు ఓ దేశాధ్యక్షుడిగా ఇటు అమెరికాకు, అటు ప్రపంచానికి ఏది లాభమన్న ఆలోచనే లేకపోయింది. స్వీయప్రయోజనాలే తప్ప శాస్త్ర విజ్ఞాన ఆకాంక్షలను, శాస్తవ్రేత్తల హెచ్చరికలను ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. పర్యావరణాన్ని కబళిస్తే అది మానవాళినే మింగేస్తుందన్న హెచ్చరికలను పెడచెవిన పెట్టడం ద్వారా ట్రంప్ ఓ పెను ఉపద్రవానికే తెరతీశాడు. నిజానికి వాతావరణం వేడెక్కిపోవడానికి, పర్యావరణం కాలుష్య ఉద్గారాలమయం కావడానికి ప్రధాన కారణం అమెరికాయేనని విస్మరించడానికి వీలులేదు. ముఖ్యంగా ప్యారిస్ నుంచి అమెరికా వైదొలగడం అంటే అనేక పేదదేశాలకు దిక్కూమొక్కూ లేని స్థితిలో పడేయడమే. ప్రపంచంలో ఏ దేశం విసర్జించనంత పరిమాణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను పుడమినంతా అత్యధిక స్థాయిలో నింపేసిన పాపం అమెరికాదే. నష్టం చేసినవాడే దాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేయాలి. కాని ఎదుటివారి నష్టంలోనూ ట్రంప్ లాభమే చూసుకున్నాడు. ఆ లాభం ఏమిటో పర్యావరణ సమతూకం దిగజారితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆయనకే తెలియాలి. నిర్ణయమైతే తీసుకున్నాడు గానీ అంత తేలిగ్గా అమెరికా తన కాలుష్య పాపం నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఇది పర్యావరణ పరమైన నిర్ణయమే అయినా భవిష్యత్తులో అనేక ఐరోపా దేశాలతో అమెరికా సంబంధాలపైనా దీని ప్రభావం ఉంటుంది.

-బి.రాజేశ్వర ప్రసాద్