స్పాట్ లైట్

దిక్కుతోచని ఖతార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపారమైన చమురు నిక్షేపాలు కలిగిన ఖతార్ సంక్షోభంలో పడింది. సౌదీ అరేబియా సారథ్యంలో బహ్రేన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు తదితర గల్ఫ్ దేశాలు తెగతెంపులు చేసుకోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సమృద్ధిగా చమురు ఉన్నా ఖతార్ ఆహార అవసరాలు ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులపైనే ఆధారపడటం వల్ల ప్రజల దైనందిన జీవితమే దుర్బరంగా మారే పరిస్థితి తలెత్తింది. అరబ్బు ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలే ఖతార్‌తో తెగతెంపులు చేసుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదులకు ఇక్కడి నుంచే నిధులు వెళుతున్నాయని, దాని వల్ల తమ దేశాల భద్రతకే ముప్పుటాల్లిల్లుతోందన్నది తెగతెంపులు చేసుకున్న దేశాల ఆరోపణ. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా అసలు ఈ సంక్షోభ పరిస్థితులకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఉగ్రవాద అంశంపై ఇరుగుపొరుగున ఉన్న గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియాకు ఖతార్‌కు మధ్య దీర్ఘకాలంగానే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ముదిరి పాకాన పడటంతో అన్ని విధాలుగా ఈ చమురు దేశం ఇరకాటంలో పడిపోయింది. ఇతర దేశాలే తమ చమురుపై ఆధారపడి ఉండటం వల్ల ఖతార్ ఒక్కో దేశం విషయంలో ఒక్కో విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. ముఖ్యంగా రెండు అంశాల విషయంలో ఇరుగుపొరుగు గల్ఫ్ దేశాలకు చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ముద్ర పడ్డ ఇస్లాం గ్రూపులు, ముస్లిం బ్రదర్‌హుడ్‌లకు ఖతార్ మద్దతునివ్వడం! వీటిలో కొన్నింటిని ఉగ్రవాద గ్రూపులుగా పలు గల్ఫ్ దేశాలూ పరిగణిస్తున్నాయి. ఇక రెండోది షియాల సారధ్యంలోని ఇరాన్, సున్నీల సారధ్యంలోని సౌదీ అరేబియాలతో దీనికి ఉన్న సంబంధాలే. ఇప్పటికే ఇరాన్, సౌదీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు రెండు దేశాలతోనూ సంబంధాలు కలిగి ఉండటం అన్నది ఖతార్‌కు కత్తిమీద సాములాంటి పరిస్థితే. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో సౌదీ అరేబియా ప్రభావానికి ఇరాన్ అడుగడుగునా అడ్డుకట్ట వేయడం కూడా తాజా తెగతెంపుల నిర్ణయానికి బలమైన కారణంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటనతో పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఖతార్ అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చిన ఓ తప్పుడు కథనమే గల్ఫ్ దేశాల్లో చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ పట్ల అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉందని, గల్ఫ్ ప్రాంతంలో అదే బలమైన దేశమన్నట్టుగా భావిస్తోందంటూ కథనాలు వచ్చాయి. ఇవి తప్పుడు కథనాలని, వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖతార్ బహిరంగంగానే చెప్పినా ఇతర గల్ఫ్ దేశాల్లో ఆగ్రహం తగ్గలేదు. అసలే ఇరాన్‌తో తీవ్ర సంఘర్షణ పరిస్థితి ఎదుర్కొంటున్న సౌదీ అరేబియాకు ఖతార్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాలు మరింతగా మంట పుట్టించాయి. ఒక్కసారిగా దాని సారథ్యంలో ఖతార్‌పై గల్ఫ్ దేశాలన్నీ ఆంక్షలు, తెగతెంపుల నిర్ణయంతో తమ అక్కసు చాటుకున్నాయి. అన్ని రకాలుగానూ ఖతార్‌తో దారులను మూసేశాయి. దాదాపుగా చమురు తప్ప మరేమీ లేని నిస్సహాయ స్థితికి, ఏకాకి పరిస్థితికి ఖతార్ చేరుకుంది. తమ దేశంలో ఉన్న ఖతార్ దేశస్థులందరూ వెళ్లిపోవాలన్న ఆంక్షలనూ గల్ఫ్ దేశాలు విధించడంతో దీని ప్రభావం ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పడే అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఉగ్రవాద గ్రూపులకు ఖతార్ మద్దతిస్తోందా..ఒక వేళ అలా చేస్తే అందుకు గల కారణాలేవిటన్నదీ అంతుబట్టడం లేదు. ముఖ్యంగా ఐసిస్ మిలిటెంట్ సంస్థకు వ్యతిరేకంగా అమెరికా సారధ్యంలో ఏర్పాటయిన అంతర్జాతీయ కూటమిలో ఖతార్ కూడా భాగస్వామ్య దేశమన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఇతర దేశాలు తక్షణమే జోక్యం చేసుకుని గల్ఫ్ సంక్షోభానికి తెరవేయక పోతే..సామరస్యపూర్వక రీతిలో సమస్యను పరిష్కరించక పోతే పరిస్థితి గల్ఫ్ తీరాలు దాటి అన్ని దేశాలకూ కార్చిచ్చులా వ్యాపించే ప్రమాదం ఉందన్నది వాస్తవం.