స్పాట్ లైట్

ఇక మాక్రన్ దూకుడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా సంచలన విజయం సాధించిన ఇమాన్యుయెల్ మాక్రన్‌కు ఇప్పుడు పార్లమెంట్ కూడా చేతికి రావడంతో తన విస్తృత సంస్కరణల అజెండాపై దూసుకుపోయే అవకాశం దక్కింది. ఎవరూ ఊహించని రీతిలో పార్లమెంట్‌లో తిరుగులేని మెజార్టీ దక్కడంతో విపక్షాల అడ్డంకులతో సంబంధం లేకుండా మాక్రన్ ముందుకెళ్లేందుకు వీలుంది. అయితే ఏ దేశంలోనూ లేనంత బలంగా ఫ్రాన్స్‌లో యూనియన్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ పార్లమెంట్‌లో ఉన్న రాజకీయ పార్టీల అండదండలతో ఇవి అనుకున్నవి సాధించుకుంటూ వచ్చాయి. తిరుగులేని మెజార్టీ ఉందికదాని అడ్డూ అదుపూ లేని రీతిలో సంస్కరణల రథాన్ని పరుగులు పెట్టిస్తే మాత్రం మాక్రన్ ఇరకాటంలో పడక తప్పదు. ఈ వాస్తవాలన్నీ తనకు తెలుసునంటున్న మాక్రన్ ఇప్పటికిప్పుడే తన విజయాల గురించి ఊహాగానాలు తొందరపాటేనని, ఐదేళ్లూ ఆగిన తర్వాతే తానేమిటో తెలుసుందంటూ వినయంగానే చెబుతున్నాడు. అయినా కూడా తొలి అడుగే బలంగా పడింది కాబట్టి తన లక్ష్యాల సాధనలో ఎలాంటి అవరోధాలు ఉండవన్న ధీమా ఆయన మాటల్లోనూ, తీసుకుంటున్న నిర్ణయాల్లోనూ కనిపిస్తోంది. మొత్తం 577 సీట్లలో మాక్రన్ సారధ్యంలోని ఎల్‌ఆర్‌ఇఎమ్ పార్టీకి, దానికి మిత్ర పక్షంగా ఉన్న మరో పార్టీకి కలిపి 350 సీట్లు దక్కాయి. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ ఎన్నికల చరిత్రలో ఇంత భారీ సీట్లను గెలుచుకోవడం అన్నది అరుదుగా జరిగిన పరిణామంగానే చెబుతున్నారు.
ఇల్లలకగానే పండుగ కాదన్న వాస్తవం తొలి రోజే బోధ పడటంతో ‘నా విజయాన్ని ఇప్పుడే అంచనా వేయకండి..అనుకున్నవన్నీ సాధించగలిగితే ఐదేళ్ల తర్వాతే నేను విజయం సాధించినట్టు..’అని చెబుతున్న మాక్రన్ ఐరోపా యూనియన్ పటిష్ఠత విషయంలోనూ అంతే పట్టుదలగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈయూ అనుకూల అభ్యర్థి అని ముద్ర వేసుకున్న మాక్రన్ తదుపరి వ్యూహం ఏమిటన్నది ఆసక్తిని కలిగిస్తోంది.ఫ్రాన్స్ ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు దాని రాజకీయ, ఆర్థిక సుస్థిరతనూ బలోపేతం చేయడమే మాక్రన్ ముందున్న సవాళ్లు.
నెపోలియన్ తర్వాత దేశాధ్యక్ష పదవిని చేపట్టిన అతిపిన్న వయస్కుడైన మాక్రన్‌కు అధికార అనుభవం కూడా ఇదే మొదటిసారి. ఓ పక్క పెను సమస్యలు, చుట్టుముడుతున్న సవాళ్లతోపాటు పాలనాపరంగా ఎలాంటి అనుభవం లేకపోవడం ఇబ్బందికరమే అయినప్పటికీ మాక్రన్ ఆత్మ విశ్వాసం మాత్రం తిరుగులేనిదిగానే కనిపిస్తోంది.
131 సీట్లే కలిగిన రిపబ్లికన్లు, ఇతర కన్సర్వేటివ్ పార్టీలు బలమైన ప్రతిపక్షంగా పనిచేసే అవకాశం ఎంత మాత్రం లేదు. అయినా సంస్కరణలు అనే సరికి ట్రేడ్ యూనియన్ల నుంచి ఎక్కడలేని సమస్యలు తలెత్తడం అన్నది వాస్తవం. వీటిని అధిగమించగలిగితే ఫ్రాన్స్ యువ అధ్యక్షుడు ఇంట గెలిచినట్టే! ఇది సాధ్యమైతే రచ్చగెలవడం అన్నది అంత ఇబ్బందికరం ఏమీ కాదు!