స్పాట్ లైట్

పర్యావరణం గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ సమతూకాన్ని కబళిస్తూ వాతావరణ మార్పులను నిరోధించే లక్ష్యం దిశగా పారిశ్రామిక దేశాలు ముక్తకంఠంతో ముందడుగు వేశాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే పుడమికి తూట్లు పడి జీవావరణమే నశిస్తుందని సమస్త జీవకోటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో హడావిడిగా కుదిరిన చారిత్రక పారిస్ ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో తలెత్తిన సవాళ్లకు జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జి-20 పారిశ్రామిక దేశాల సమావేశం దీటైన జవాబే ఇచ్చింది. మొత్తం 20 దేశాల్లో 19 దేశాలు పర్యావరణానికి జైకొట్టాయి. తానేదో ఘనకార్యం చేసినట్లుగా పారిస్ ఒప్పందంనుంచి వైదొలగిన డొనాల్డ్ ట్రంప్ ఏకాకి అయ్యారు. భారత్‌తో సహా అన్ని దేశాలు పర్యావరణ పరిరక్షణే పరమావధిగా బలమైన ముందడుగు వేశాయి. పర్యావరణ మార్పుల నిరోధానికి సంబంధించిన అంశాలతో విభేదించిన డొనాల్డ్ ట్రంప్‌తో నిమిత్తం లేకుండానే జి-20 చేపట్టిన అంశాలన్నింటిపైనా సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడమన్నది భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ దిశగా ధనిక దేశాలన్నీ ముందుకు సాగుతాయని చెప్పడానికి బలమైన నిదర్శనం. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని శిఖరాగ్ర సదస్సులకు భిన్నంగా జి-20 సంయుక్తంగా చేపట్టిన ప్రకటనలో ఓ కీలకమైన అంశాన్ని చేర్చడం కూడా విభేదిస్తున్న దేశాల వాదనకు ప్రాధాన్యతమివ్వడమే. అమెరికా ఎందుకు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోందన్న దానితోపాటు శిలాజ ఇంధనాల వినియోగానికి సంబంధించి కూడా ఇందులో ఓ పేరాను చేర్చడం ప్రత్యేకతను సంతరించుకున్న అంశం. పారిస్ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలన్నీ హర్షిస్తున్న నేపథ్యంలో ఆ కీలకమైన ఒడంబడికనుంచి అమెరికా తప్పుకోవడమన్నది జి-20 దేశాలన్నింటిలోనూ తీవ్ర స్థాయి వ్యతిరేకతనే రగిలించింది.
ముఖ్యంగా ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తీవ్ర స్థాయిలో ట్రంప్ ధోరణిని వ్యతిరేకించడం మొత్తం ఐరోపా దేశాలకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతను చాటి చెప్పేదే. ఎవరు వ్యతిరేకించినా పారిస్ ఒప్పందాన్ని అనుకున్న రీతిలో అమలు చేసి తీరుతామని ఈ తీర్మానం ద్వారా జి-20 దేశాలన్నీ స్పష్టం చేశాయి. అలాగే బ్రిటన్ ప్రధాని థెరిసా మే కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఈ విషయంలో అమెరికా ఎంతగా ఏకాకిగా మారిందో స్పష్టం చేసే అంశమే. ఇప్పటివరకు అనేక అంశాలపై అంతర్జాతీయ ఒడంబడికలు ఒప్పందాలు కుదిరాయి. అన్నింటిపైనా ఏకాభిప్రాయం పొసగిన దాఖలాలు లేకపోయినా మెజారిటీ అభిప్రాయాన్ని ఆలంబనగా చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో తీర్మానాలు వచ్చాయి. వాటి ఆధారంగానే ఎన్నో చట్టాలు అమలవుతున్నాయి. అయితే పర్యావరణ పరిరక్షణ అన్నది ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. పుడమికి చిల్లు పడితే దాని విఘాతక పరిణామాలను ధనిక, పేద అన్న తేడాలు లేకుండా ప్రపంచ దేశాలన్నీ భరించాల్సిందే. ఆ కష్టనష్టాల్లో కొట్టుకుపోవాల్సిందే. మిగతా అంశాల్లో విభేదాలకు ఆస్కారం ఉన్నా పర్యావరణ పరిరక్షణ అన్నది ఎవరూ విస్మరించలేని విభేదించజాలని అంశం కాబట్టి దీని విషయంలో పొరపొచ్చాలకు తావుండకూడదు. ఏకాభిప్రాయమే గీటురాయిగా ప్రపంచ వాతావరణ పరిరక్షణ దిశగా ప్రతిఒక్కరూ బలంగా ముందుకు సాగాల్సిందే. పారిస్ ఒప్పందం విషయంలో అమెరికాకు కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవమే అయినా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలే తప్ప మొత్తం ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడమన్నది మంచిది కాదని సంపన్న దేశాలు చాలా బలంగానే స్పష్టం చేశాయి. అయితే ఎవరెంతగా చెప్పినా సంపన్న దేశాలన్నీ తమను ఏకాకిని చేసినా ట్రంప్ మాత్రం పట్టువీడని రీతిలోనే వ్యవహరించడం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆయన నిర్ణయాలపట్ల మరింత వ్యతిరేకతను రాజేసే అంశమే. ఐరోపా దేశాలు తన భవిష్యత్ పరిరక్షణ లక్ష్యాలను తమ చేతుల్లోనే ఉంచుకోవాలి తప్ప ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకూడదంటూ జర్మనీ చాన్స్‌లర్ చేసిన వ్యాఖ్య అనేక దేశాలకు కనువిప్పు చేసేదే. అమెరికాతో మైత్రి జర్మనీతో సహా అన్ని దేశాలకు అవసరమే అయినా కీలక విషయాల్లో కూడా ఆ దేశాధ్యక్షుడి నిర్ణయాలకు వంత పాడాల్సిన అగత్యం ఏమీ లేదన్న వాస్తవానే్న మెర్కెల్ స్పష్టం చేశారు. వ్యాపార, వాణిజ్య సంబంధిత అంశాల్లో అమెరికాతో ఐరోపా దేశాలు మైత్రిని కొనసాగించినా పర్యావరణ పరిరక్షణ విషయంలో మాత్రం తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిందేనన్నది జి-20 సదస్సు ప్రపంచానికి అందించిన బలమైన సందేశం. ఈ విషయంలో ఏకాకి అయిన అమెరికా అధ్యక్షుడు తదుపరి తొట్రుపాటుకు అవకాశం లేకుండా ఏవిధంగా ముందుకు వెళతారన్నది వేచి చూడాల్సిందే.