స్పాట్ లైట్

సయోధ్య సాధ్యమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరూ ఇద్దరే..! ఒకరిది మంకు పట్టు..మరొకరిది తోచింది చేసేసే లక్షణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల తీరు ఇది. కలవక కలవక ఇద్దరూ కలిశారు. ముక్తసరిగా కరచాలననూ చేసుకున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు చిరునవ్వులూ విసిరారు! రెండు పెద్ద దేశాల మధ్య సంబంధాలు ఇంతటితో సరేనా..! అగ్రనేతలు మాట్లాడుకున్నంత మాత్రాన, ఓ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో చేతులుకలిపినంత మాత్రాన దశాబ్దాల పొరపొచ్చాలు తొలగిపోయినట్టేనా! ఇందుకు విరుద్ధమైన సంకేతాలనే 20 పారిశ్రామిక దేశాల సదస్సు జి-20 అందించింది. ట్రంప్-పుతిన్ భేటీతో అమెరికా, రష్యాల మధ్య మళ్లీ సత్సంబంధాలు చిగురించే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. నిజానికి వీరి మధ్య కొన్ని నెలల ముందే ఈ రకమైన సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ అది ఎందుకో ఆగిపోయింది. ఆ అరుదైన అవకాశాన్ని జర్మనీలోని హంబర్గ్‌లో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు అందించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే రష్యా పట్ల ట్రంప్ ఎక్కడలేని మక్కువా చూపించారు. తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పుతిన్‌తో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటాననీ చెప్పాడు.అందరి అంచనాలకు విరుద్ధంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినా..ఆయన ఆశించినట్టుగా రష్యా అధ్యక్షుడితో సమావేశానికి మాత్రం అవకాశం చిక్కలేదు. మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చి పడ్డాయి. మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ రాజీనామాతో రెండు దేశాల మధ్య ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. అయినా కూడా ట్రంప్ ప్రభుత్వం మాత్రం రష్యాతో సంబంధాలు తెగిపోకుండా జాగ్రత్తగానే కాపాడుకుంటూ వచ్చింది. దాని ఫలితంగానే జి-20 భేటీలో ఇద్దరూ మాట్లాడుతున్నారు! నిజానికి మొదట్లోనే ఈ సమావేశం జరిగి ఉంటే ఎన్నో సంక్లిష్ట సమస్యలు తలెత్తి ఉండేవి కాదు. ఒక వేళ తలెత్తినా ప్రస్తుత మంత ముదిరిపోయి ఉండేవీ కాదు. అలాంటి అరుదైన అవకాశాన్ని ట్రంప్-పుతిన్‌లు కోల్పోయారు. సిరియా, ఉక్రెయిన్ సంక్షోభాలే ఈ భేటీలో జాప్యానికి కారణమైనా ఇరు దేశాల అంతర్గత పరిస్థితులూ అందుకు చాలా వరకూ దారితీశాయి. అందుకే సంక్లిష్టమైన, అత్యంత వౌలికమైన సమస్యల జోలికి పోకుండానే ఇద్దరూ జి-20లో చేతులు కలిపి..చాలనిపించారు! దీనికి మించి ఎవరు ముందుకు వెళ్లినా..అంతర్జాతీయ సంక్షోభాలతో పాటు దేశీయంగా ఉన్న పరిస్థితులూ మరింత తీవ్రమయ్యే పరిస్థితి పొంచి ఉంది. అందుకే సంబంధాల లోతుల్లోకి పోకుండా పైపై మెరుగుల చందంగానే ‘చర్చలు’ముగించారు. ఒక రకంగా చెప్పాలంటే రష్యా ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పుతిన్ ఎంత బలమైన నాయకుడిగా కొనసాగారో..దేశాధ్యక్ష పదవిలోనూ అంతే స్థిరంగా, ధీమాగా, ప్రత్యర్థుల పోరు లేకుండా సాగుతున్నారు. గతంతో పోలిస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. సిరియా, ఉక్రెయిన్ సంక్షోభాలు మెడకు చుట్టుకోకుండా పుతిన్ చాకచక్యంగా తప్పించుకోగలిగారు. మరి కొన్ని నెలల్లోనే దేశాధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అమెరికాతో సంబంధాల విషయంలో పుతిన్ ఏ విధంగానూ రాజీ పడే అవకాశం కనిపించడం లేదు.దేశీయంగా,అంతర్జాతీయంగా కూడా ట్రంప్ పరిస్థితి ఇందుకు విరుద్ధం. జనాకర్షక నేతగా రాణిస్తున్నా..ఆయన పట్టు, రేటింగూ తగ్గుతోందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో వ్యక్తిగత స్థాయిలో పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకుంటున్నా..ఇరు దేశాల పరిస్థితులకు విరుద్ధంగా మైత్రీ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ముందుకు వెళ్లే అవకాశం మాత్రం ఇప్పట్లో లేనట్టే. జాతీయ ప్రయోజనాలు, రాజకీయ వాతావరణం అనుకూలిస్తే తప్ప అగ్ర దేశాల మధ్య సయోధ్యకు అవకాశం లేనట్టే లెక్క..అంతర్జాతీయంగా రష్యాకు పూర్వవైభవం సంతరింపజేయాలన్న ఆలోచనలో ఉన్న పుతిన్ అందుకు అమెరికా అడ్డు తగిలే అవకాశం ఉందని భావిస్తే..ఎంత మాత్రం రాజీపడే అవకాశం ఉండదు. అలాగే ఉక్రెయిన్, సిరియాతో పాటు ఇతర సంక్షోభాల విషయంలో శీతకన్ను వేస్తే అది తన అంతర్జాతీయ నాయకత్వ పటిమకే ముప్పు అని భావిస్తే రష్యా విషయంలో ట్రంప్ మరింతగా పట్టు బిగించే అవకాశమే ఉంటుంది. అందుకే జి-20లో పుతిన్‌తో సమావేశం కావడానికి ముందే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోతో సమావేశమై మిత్ర దేశాలకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందన్న సంకేతాల్ని అందించారు. సిరియా విషయంలోనూ ఇదే తరహా ప్రతికూల ధోరణి ఇద్దరి మధ్య కొనసాగుతోంది. సిరియాలో పరిస్థితులు మెరుగు పడాలంటే అధ్యక్ష పదవి నుంచి అసాద్ తప్పుకోవాలన్నది అమెరికా వాదన అయితే ఇందుకు రష్యా అంగీకరించడం లేదు. ఇప్పటి వరకూ ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశాల కంటే కూడా ట్రంప్-పుతిన్‌లు తీసుకునే నిర్ణయాలే ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు అన్ని విధాలుగా దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించాల్సిందే అంత వరకూ ముక్తసరి మాటలు..పొసగని భేటీలే..!

బి. రాజేశ్వరప్రసాద్