స్పాట్ లైట్

సవాళ్ల ముంగిట్లో బ్రిటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు బ్రెగ్జిట్ చర్చలు మొదలయ్యాయి. మరో 20 నెలలపాటు జరిగే ఈ చర్చల్లో బ్రిటన్ అంతిమంగా లాభపడుతుందా లేక నష్టపోతుందా అన్నది ఊహకు అందని విషయమే. అలాగే ఏడాది క్రితం జరిగిన బ్రెగ్జిట్ ఓటును తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదన్న వాదన బలాన్ని పుంజుకుంటోంది. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనంటూ మెజారిటీ ప్రజలు తీర్పునివ్వడంతో ప్రధాని పదవిని చేపట్టిన థెరిసా మే తనదైన వ్యూహంతో పావులు కదిపినా ప్రయోజనం లేకపోయింది. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించుకుంటామని చెప్పిన ఆమెకు ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రతిఘటన కారణంగా అయోమయ పరిస్థితి తలెత్తింది. అందుకు కారణం ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా సొంతంగా బ్రెగ్జిట్‌పై ముందుకెళ్లే పూర్తిస్థాయి మెజారిటీ పార్లమెంటులో లేకపోవడమే. ఆ క్రమంలోనే ఆమె మరింత మెజారిటీ లభిస్తుందన్న నమ్మకంతో చాలా ముందుగానే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో సీట్లు పెరగడం మాట ఎలావున్నా ఉన్న మెజారిటీ కూడా కోల్పోవడంతో థెరిసా డీలాపడిపోయారు. ఈ పరిస్థితుల్లో ‘హార్డ్ బ్రెగ్జిట్టా లేక సాఫ్ట్ బ్రెగ్జిట్టా’ అన్న వాదనా తెరపైకి వచ్చింది. ఇప్పటికే బ్రెగ్జిట్ చర్చలు మొదలుకావాల్సి ఉన్నా బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల పరిణామాల కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థెరిసా మే తను అనుకున్న రీతిలోనే ఈ చర్చలను కొనసాగించే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. అందుకు కారణం ఈ నిష్క్రమణ ప్రక్రియ అనేక సంక్లిష్ట అంశాలతో కూడుకున్నది కావడమే. గరిష్ఠ స్థాయిలో ఐరోపా యూనియన్ నుంచి లబ్ధిని పొందడానికి, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బ్రిటన్ చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ప్రతికూల పరిణామాలను అధిగమించేందుకు అనుసరించే పద్ధతి ఏమిటి అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ముఖ్యంగా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలన్న మెజారిటీ తీర్పు వచ్చినప్పటికీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. కేవలం రెండు మూడు శాతం ఓట్ల తేడాతోనే బ్రెగ్జిట్‌కు సానుకూలత లభించింది. ఈ సందర్భంలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలు, వారికి మద్దతుగా ఉన్న పార్టీలు థెరిసా మే ధైర్యంగా ముందుకు వెళ్లకుండా అడుగడుగునా అవరోధాలు కల్పించే అవకాశం ఉంది. 2019 మార్చి 30 నాటికల్లా ‘ఈ విడాకుల వ్యవహారాన్ని’ బ్రిటన్ తేల్చేసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లోగా అనుకున్న ఫలితాన్ని సాధించగలగాలంటే ఇప్పటినుంచే స్పష్టమైన రీతిలో దేశ ప్రజలందరినీ తన లక్ష్యానికి అనుగణంగా థెరిసా మే కూడగట్టుకోవలసి ఉంటుంది. ఐరోపా యూనియన్‌లో రెండో అతిపెద్ద వ్యవస్థ బ్రిటన్. అలాంటి దేశం ఐరోపా కూటమి నుంచి వైదొలగిపోవడం అంటే దాని ప్రభావం ఇతర దేశాలపై చాలా తీవ్రంగానే ఉంటుంది. ఇలాంటి కష్టనష్టాలకు ఆస్కారం లేకుండా ఉభయతారకమైన రీతిలో బ్రెగ్జిట్ చర్చలు సాగించాలని పట్టు విడుపులతోనే ఇది సాధ్యమవుతుందన్న వాదనా వినిపిస్తోంది. పలుదఫాలుగా, వర్గాలుగా జరిగే ఈ చర్చల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన అన్ని అంశాలూ ప్రస్తావనకు వస్తాయి. ఈ చర్చల్లో అత్యంత కీలకమైన అంశం బ్రిటన్ ఉంటున్న దాదాపు 30లక్షల మంది ఐరోపా యూనియన్ పౌరుల హక్కుల మాటేమిటన్నది. వీరందరికీ కూడా బ్రిటన్ పౌరులతో సమానంగా న్యాయాన్ని అందించాలన్న అంశం ఈ చర్చల్లో కీలకం కాబోతోంది. పౌరుల హక్కులతోపాటు ఐరోపా యూనియన్‌కు ఇచ్చిన హామీ ప్రకారం బ్రిటన్ 60 బిలియన్ల యూరోలు చెల్లించడంసహా ఇతర అంశాలపైనా ఏకాభిప్రాయం పొసగితేనే తొలి దశ చర్చలను అధిగమించడం సాధ్యమవుతుంది.

ఫుడ్ బ్రెగ్జిట్!
ప్రధాని ధెరీసామే అనుసరించే విధానం మాట ఎలా ఉన్నా ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగితే ‘్ఫడ్ బ్రెగ్జిట్టే’నన్న హెచ్చరికలు అందుతున్నాయి. యూకెలో అన్ని విధాలుగా ఆహార పదార్థాల సరఫరా తగ్గి ధరలు పెరిగిపోయే ప్రమాదమూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు భద్రతా ప్రమాణాలకూ ముప్పేనన్న వాదనా గట్టిగా వినిపిస్తోంది. పొంచి ఉన్న ఈ రకమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ధెరీసా ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళికే లేదంటున్న నిపుణుల ఆందోళనను విస్మరించడానికి వీల్లేదు.

బి.రాజేశ్వర ప్రసాద్