స్పాట్ లైట్

భారత్ కింకర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లో నెలకొన్న తాజా అనిశ్చిత రాజకీయ పరిణామాలు సుస్థిర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో భారత్‌తో సంబంధాల మాటేమిటన్నది ఆందోళన కలిగిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు అనేక సందర్భాల్లో నవాజ్ షరీఫ్‌తో మాట్లాడటం, గతంతోనిమిత్తం లేకుండా వర్తమాన అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండు దేశాలు కలిసి ఉండాల్సిన అగత్యాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే భారత వాదన భారత్‌దే అన్నట్లుగా పాకిస్తాన్ ఏ దశలోనూ కూడా తన ‘ఉగ్ర’ స్వరూపాన్ని విడనాడలేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో కొత్త ప్రధాని వచ్చినా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉందే తప్ప మెరుగయ్యే సంకేతాలు కనిపించడం లేదు. ఇప్పటికప్పుడు భారత్ - పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధారణ పరిస్థితులు అసాధ్యమేనన్న సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. చీటికీ మాటికీ కాశ్మీర్‌పై కయ్యానికి కాలుదువ్వడంతో పాటు అటు చైనాతోనూ సన్నిహితంగా మెసలి భారత్‌ను ఇరకాటంలో పెడుతూ వచ్చిన పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉందే తప్ప సానుకూలంగా మారే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పాక్‌తో సఖ్యత మాట ఎలావున్నా మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉందన్న హెచ్చరికలు అందుతున్నాయి.
కొత్త ప్రధాని ఎవరైనా కూడా భారత్‌కు సంబంధించి పాకిస్తాన్ విధానంలో మార్పులు అనివార్యంగానే చోటుచేసుకుంటాయన్నది వాస్తవం. ఒకవేళ అదే జరిగితే ఈ విధానం ఎలా ఉండాలన్న దానిపై పాకిస్తాన్ సైన్యందే పైమాట అవుతుందన్నదీ వాస్తవమే. నవాజ్ షరీఫ్, నరేంద్రమోదీల మధ్య వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. తాను భారత ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి పాక్ ప్రధానిగా ఉన్న షరీఫ్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఆ విధంగా ఇద్దరిమధ్య స్నేహం, సాన్నిహిత్యం కొనసాగినా ప్రభుత్వ విధానాలపరంగా మాత్రం ఎప్పటికప్పుడు అలజడులే ఆందోళన కలిగిస్తూ వచ్చాయి. ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను పునః ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగినా కూడా ఉగ్ర దాడుల మూలంగా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఏవిధంగా చూసినా కూడా పరస్పర విశ్వాసానికి ఏమాత్రం ఆస్కారం లేని పరిస్థితినే పాక్ కల్పిస్తూ వచ్చింది. ఇప్పటికిప్పుడు భారత్‌తో సన్నిహిత సంబంధాలను పెంపొందించే అంశంపై పాక్ కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం లేకపోవచ్చు. కానీ భారత్ మాత్రం అనుక్షణం అక్కడి పరిణామాలను పరిగణనలోకి తీసుకునే తదుపరి అడుగు వేయాల్సి ఉంటుంది.