స్పాట్ లైట్

మాకు ఎదురేలేదు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండూ బలమైన కమ్యూనిస్టు దేశాలు. సిద్ధాంతాలు వేరైనా ఆశయం ఒక్కటే. ఒక దేశానికి భారత్ వంటి వర్ధమాన దేశాలను
ఢీకొని చిన్న చిన్న దేశాలపై పెత్తనం చెలాయించాలన్న ఆశయమైతే మరో దేశానిది అంతర్జాతీయంగా పూర్వ వైభవాన్ని
సంతరించుకోవాలన్న పట్టుదల. ఇటు చైనా పిఎల్‌ఏ 90వ వార్షికోత్సవ విన్యాసాలు అటు రష్యా నౌకాదళ విన్యాసాలు
అంతర్జాతీయంగా మారనున్న సైనిక శక్తి, యుక్తికి అద్దం పట్టాయి. ఒకే రోజున ఈ రెండు పెద్ద దేశాలు దాదాపుగా
బల ప్రదర్శనకు దిగాయనే చెప్పాలి.

రష్యా బిగింపు

మిఖాయిల్ గోర్బచేవ్ హయాంలో ముక్కలు చెక్కలైన సోవియట్ యూనియన్ తాజాగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన మళ్లీ ఒక సంఘటిత శక్తిగా మారబోతోందా? చిన్న చిన్న రిపబ్లిక్‌లను ఒక్కొక్కటిగా రష్యాలో కలుపుకుంటూ మళ్లీ అంతర్జాతీయంగా తన సత్తాను చాటుకోవడానికి రష్యా ఉపక్రమించబోతోందా? తాజాగా జరిగిన నౌకాదళ విన్యాసాల సంకేతాలు ఇవేనన్న భావన సర్వత్రా వ్యక్తవౌతోంది. తన నౌకా శక్తిని సైనిక పటిమను అనూహ్య రీతిలోనే, అసాధారణ స్థాయిలోనే రష్యా నిర్వహించడమన్నది మళ్లీ తన ఆధిపత్యానికి బలమైన సంకేతాలు ఇవ్వడంగానే భావించాల్సి ఉంటుందా? ఒక రష్యాలోనే కాకుండా క్రిమియాలోనూ ఈ విన్యాసాలు జరపడం ద్వారా చీటికీ మాటికీ తమపైకి దూసుకువస్తున్న పశ్చిమ దేశాలకు రష్యా జవాబు ఇచ్చినట్లయింది. 90వ దశకం నాటి రష్యాకు నేడు వ్లాదిమిర్ పుతిన్ సారథ్యంలోని రష్యా మధ్య ఎంతో తేడా వుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి పరిస్థితులను అధిగమించి మళ్లీ అమెరికాకు దీటుగా రష్యాను నిలబెట్టేందుకు పుతిన్ వ్యూహాత్మక రీతిలోనే అడుగులు వేస్తున్నారన్న విషయం గత కొంతకాలంగా ఆయన తీసుకుంటున్న చర్యలు విసురుతున్న పావులను బట్టి స్పష్టమవుతూ వచ్చింది. తాజాగా అమెరికాకు అటు సిరియా విషయంలోనూ, ఇటు ఉత్తర కొరియాకు సంబంధించి కూడా దాదాపు సంఘర్షణ వాతావరణమే తలెత్తింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన ఆంక్షలు ఈ రెండు రాజ్యాల మధ్య పరిస్థితిని మరింత వెడెక్కించాయి. అమెరికా దౌత్యవేత్తలను వెళ్లిపోవాలని పుతిన్ స్వయంగా ఆదేశించడం పరిస్థితి దాదాపుగా పరిష్కారానికి అందని స్థాయికి చేరుకుందని చెప్పడానికి నిదర్శనమే. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఒకదాని తర్వాత ఒకటిగా రష్యా తన సత్తా చాటుకోవడానికి అంతర్జాతీయ పరిణామాలు కలిసొస్తున్నాయి. ముఖ్యంగా సిరియా, ఉత్తర కొరియాలకు సంబంధించి అమెరికా దూకుడుకు కళ్లెం పడిందంటే అందుకు కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్డుకట్ట వేయడమే. ఒకప్పుడు తన మాటే వేదంగా భావించిన అమెరికా ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా వెనక్కి తగ్గని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రష్యానే అడ్డు తగిలితే తన చర్యలకు సంబంధించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ నెలకొన్న ప్రతికూల పరిస్థితులను పుతిన్ రాజకీయంగా అత్యంత లాఘవమైన రీతిలోనే వాడుకుంటున్నారన్నది స్పష్టం.

చైనా తెగింపు

ధనిక దేశాలకు ఆర్థికంగా సవాలు విసురుతూ వర్ధమాన దేశాలకు సైనిక పాటవం పరంగా బలమైన హెచ్చరిక సంకేతాలను అందిస్తూ చైనా తాజాగా నిర్వహించిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) 90వ వార్షికోత్సవం అనేక రకాలుగా డ్రాగన్ భవిష్యత్తు లక్ష్యాలకు, ఆశయాలకు అద్దం పట్టేదే. ఇరుగు పొరుగు దేశాలపై పెత్తనం చెలాయించడంతో పాటు సుదూర దేశాలను సైతం తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం ద్వారా ఈ దీర్ఘకాల లక్ష్యానికి ఎప్పుడో పదునుపెట్టింది. తాజాగా మంగోలియాలో జరిగిన ఈ సైనిక ప్రదర్శన దాదాపుగా యుద్ధ తంత్రానే్న తలపింపజేయడం శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించాలన్న ఉద్దేశమే. చైనాకు అనేక దేశాలతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ముఖ్యంగా భారత్‌తో సరిహద్దు సమస్యలతో పాటు తాజాగా డోక్లామ్ వివాదం పెను తీవ్రతను సంతరించుకుంది. 1960 దశకంలో జరిగిన యుద్ధంలో భారత్ పరాజితమైనా అనంతర కాలంలో తిరుగులేని శక్తిని సంతరించుకోవడం అమెరికా వంటి శక్తి, సంపత్తి కలిగిన దేశాలకు సన్నిహితం కావడం చైనాకు కంటగింపుగా మారింది. అంతర్జాతీయంగా భారత్ గత కొన్ని సంవత్సరాల వ్యవధిలో తిరుగులేని శక్తిగా ఎదగడమే కాకుండా దాదాపు చైనాను ఢీకొనే స్థాయిని సంతరించుకుంది. దీని కారణంగానే భారత్‌ను ఏదోవిధంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే పాకిస్తాన్‌ను ఎగదోయడం శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు సన్నిహితం కావడం చైనా ప్రయత్నిస్తోందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రు దేశాలన్నింటినీ తుత్తునియలు చేయగలిగే యుక్తి, శక్తి తమ సైన్యానికి ఉందని చెప్పడం ద్వారా... అలాగే అత్యాధునికమైన ఆయుధ సంపత్తిని దాదాపు యుద్ధానికి సిద్ధవౌతోందా అన్న రీతిలో ప్రదర్శించడం ద్వారా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన భవిష్యత్తు లక్ష్యాలు బలంగానే ఉంటాయన్న సంకేతాలను నిర్ద్వంద్వంగా అందించారు. మామూలుగా అయితే పిఎల్‌ఏ వార్షికోత్సవం ఎప్పుడు జరిగినా ఇంత హడావిడి ఎప్పుడూ ఉండదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇటు భారత్, అటు అమెరికాతోనూ ఎడతెగని సమస్యలు రాజుకుంటున్న తరుణంలో చైనా ఈ ప్రదర్శనకు దిగడమన్నది అంతర్జాతీయంగా కీలక పరిణామమే. భారత్‌తో సరిహద్దు సమస్యలు, అలాగే దక్షిణ చైనా మహాసముద్రంపై ఆధిపత్యం విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, ఉత్తర కొరియా విషయంలో అమెరికాతో నువ్వా నేనా అన్న పరిస్థితి చైనాను ఇటీవలి కాలంలో ఇరకాటంలో పడేశాయి. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం తన శక్తిని, యుక్తిని తిరుగులేని రీతిలో చాటుకోవడం ఒక్కటే అని భావించిన డ్రాగన్ పిఎల్‌ఏ వార్షికోత్సవాన్ని బలంగానే ఉపయోగించుకుంది. ప్రపంచంలో అతి పెద్ద సైన్యంగా భావిస్తున్న పిఎల్‌ఏ ప్రభుత్వ ఆధీనంలో కాకుండా పార్టీ ఆధీనంలో పనిచేయడం వల్ల ప్రభుత్వ నిర్ణయాలతో నిమిత్తం లేని రీతిలో అది ముందుకు సాగే అవకాశం ఉంది. 2015లో దాదాపు ఇదే స్థాయిలో చైనా తన సైనిక ప్రదర్శన జరిపింది. ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో మరింత విస్తృత స్థాయిలోనే వీటికి సన్నాహాలు చేసింది. గతంలో కంటే కూడా చైనా సైన్యం మరింత శక్తివంతం కావాలన్న జీ జిన్‌పింగ్ పిలుపు వెనుకవున్న అసలు ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాలను హడలెత్తించడమేననడంలో ఎలాంటి సందేహం లేదు.

బి.రాజేశ్వర ప్రసాద్