స్పాట్ లైట్

ఆసియాన్‌లో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత కీలకమైన అంతర్జాతీయ సముద్ర వాణిజ్యమార్గంగా ఉన్న దక్షిణ చైనా మహాసముద్రంపై పూర్తిస్థాయి హక్కులు ఎవరివి? ఇది తమ భూభాగంలో ఉంది కాబట్టి దీనిపై సర్వహక్కులు తమవేనంటూ చైనా చేస్తున్న వాదన నేపథ్యంలో అనేక దేశాల్లో అలజడి మొదలైంది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇందుకు సంబంధించి తీవ్రస్థాయిలోనే విభేదాలు తలెత్తినట్లుగా తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా మహాసముద్రంపై తమ ఆధిపత్యాన్ని చైనా విస్తరించుకున్న నేపథ్యంలో ఈ ఆందోళన మరింత తీవ్రమైంది. ఆసియాన్ దేశాలకు చెందిన పది దేశాల విదేశాంగ మంత్రులు చైనాను ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపినప్పటికీ అంతర్గత విభేదాల కారణంగా ఎలాంటి మార్గాంతరం కానరాలేదు. ఈ దేశాలన్నీ ఒక అవగాహనకు వస్తేనే సమష్టిగా చైనాను నిరోధించేందుకు గానీ దాంతో రాజీపడి ముందుకు వెళ్లడానికి గానీ అవకాశం ఉంటుందన్నది వాస్తవం. వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనీ సహా పలు ఆసియా దేశాల తీరాలను తాకుతున్న దక్షిణ చైనా మహాసముద్ర జలాలన్నీ తమవేనన్న రీతిలో చైనా తాజా మెలిక పెట్టడంతో ఈ పది దేశాలు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా ఈ సముద్రంలో తమదీ కొంత భాగం ఉందంటూ వ్యూహాత్మకంగా ఇప్పటివరకూ పావులు కదుపుతూ వచ్చిన వియత్నాం మరింతగా అలజడికి లోనైంది. భవిష్యత్తులో చైనా ఏ రకమైన బరితెగింపు చర్యలకు పాల్పడినా ఆసియాన్ దేశాలన్నీ ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న రీతిలో ఓ ప్రకటన వెలువడాలని వియత్నాం గట్టిగానే పట్టుబట్టింది. అయితే చైనాతో ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాల కారణంగా ఆసియాన్‌లోని మిగతా సభ్య దేశాలు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ముఖ్యంగా చైనాతో అత్యంత బలమైన సంబంధాలు కలిగిన కాంబోడియా ఈ విషయంలో కొంత మేర వెనక్కి తగ్గినట్లుగానే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సంయుక్త ప్రకటనలో చైనాకు వ్యతిరేకంగా బలమైన పదజాలాన్ని ప్రయోగించడానికి వీల్లేదన్న రీతిలోనే కాంబోడియా వాదించడంతో మిగతా దేశాలు కూడా ఉమ్మడిగా ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కాంబోడియా నుంచి తనకు అందుతున్న బలమైన మద్దతును ఆసరా చేసుకుని ఆసియాన్ దేశాలను దారికి తెచ్చేందుకు చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లుగా కూడా తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. మధ్యస్థంగా ఉన్న ఫిలిప్పీన్స్ ఓ రాజీ మార్గంలోనే ఈ సముద్ర జలాల హక్కులపై ఏకాభిప్రాయానికి ముందుకు వెళ్లాలని భావిస్తున్నప్పటికీ అది ఎంతమాత్రం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో అనేక రకాలుగా ఈ సముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకుంది. ఎన్నో కృత్రిమ దీవులను నిర్మించింది. వీటి ఆధారంగా సైనిక స్థావరాలను కూడా నిర్మించాలని సంకల్పించింది. ఈ సముద్ర జలాలపై ఆసియాన్ దేశాల ఆందోళన ఈనాటిది కాదు. ఇప్పటివరకు సమతూక ప్రాతిపదికన విభేదాలు తీవ్రం కాకుండా ఈ దేశాలన్నీ తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ వచ్చినప్పటికీ తాజాగా చైనా అనుసరిస్తున్న ధోరణి అందుకు ఇంకెంతమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఇటీవల కాలంలో భారత్, అమెరికా సహా పలు దేశాలు చైనా ధిక్కార స్వరాన్ని నిలదీశాయి. అంతర్జాతీయ సముద్ర జలాలపై ఎవరికీ పూర్తిస్థాయి హక్కు ఉండదంటూ చాలా బలంగానే తమ వాదన వినిపించాయి. సామరస్యపూర్వక రీతిలో ఈ హక్కుల సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప ఇతర దేశాలకు చెందిన వాణిజ్య నౌకలను నిరోధించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరుద్ధమన్న సంకేతాలనూ అందించాయి. తాజాగా ఆసియాన్ దేశాల్లో తలెత్తిన అంతర్గత విభేదాలు చైనా మరింతగా రెచ్చిపోవడానికి దారితీస్తాయా లేదా వీటి ఉమ్మడి శక్తి ముందు డ్రాగన్ కొంతమేర వెనక్కి తగ్గుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

చిత్రం.. ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రులు