స్పాట్ లైట్

బ్రిక్స్‌కు మరింత పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఐదు దేశాల కూటమి బ్రిక్స్ తదుపరి శిఖరాగ్ర సదస్సు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా డోక్లామ్ వ్యవహారంలో భారత్‌తో తలెత్తిన ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ సమావేశ ప్రాధాన్యత మరింత పెరిగింది. చైనా పట్టణమైన జియామెన్‌లో వచ్చే నెలలో జరగనున్న ఈ సమావేశం అంతర్గత విభేదాలతో ద్వైపాక్షిక ఒడిదుడుకులతో సంబంధం లేకుండా బ్రిక్స్ మరింత బలోపేతం కావడానికి దోహదం చేయగలదన్న ధీమా చైనా నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ప్రాంతీయ కూటమిగా భావిస్తున్న వాటితో సరిసమానమైన శక్తిని యుక్తిని సంతరించుకునే రీతిలో ఈ ఐదు బలమైన ఆర్థిక దేశాలు చేతులు కలిపి బ్రిక్స్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్న దృష్ట్యా డోక్లామ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? దీనిపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మోదీతో ముఖాముఖి భేటీ అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరి మధ్య ముఖాముఖి చర్చలు జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్నా ఈ ద్వైపాక్షిక విభేదాల ప్రభావం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిక్స్ పనితీరుపై కనపడకుండా ఐదు సభ్య దేశాలు బలంగా ముందుకు వెళ్లాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికీ సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో భారత్, చైనా దళాలు తిష్టవేసిన నేపథ్యంలో ఇప్పట్లో దీనికి ఓ పరిష్కారం అందే అవకాశం కనిపించడం లేదు. కచ్చితంగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ఇది అంతర్జాతీయంగా చాలా బలమైన ఆర్థిక కూటమి కాబట్టి అన్య ప్రభావాలకు అతీతంగానే ఇది కొనసాగాలన్న భావన చాలా బలంగానే కనిపిస్తోంది. డోక్లామ్ ప్రాంతం భారత్, భూటాన్, చైనాలకు సంబంధించింది కాబట్టి ఈ మూడు దేశాలు సామరస్యపూర్వక రీతిలో చర్చలు జరిపితే తప్ప దీనికి పరిష్కారం సాధ్యం కాదు. మరోపక్క భూటాన్ కూడా చైనా ధోరణిని వ్యతిరేకించడం భారత వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. సరిహద్దు వివాదం తేలేవరకూ డోక్లామ్ ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించాలని పరస్పర ఒప్పందాలు స్పష్టం చేస్తున్నా బీజింగ్ వాటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నది భూటాన్ వాదన. ఈ నేపథ్యంలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సభ్య దేశాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై దృష్టి పెడుతుందా అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. దీని మాట ఎలా వున్నా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించి ఈ ఐదు దేశాల నేతలు లోతుగా చర్చించే అవకాశం ఉందని బ్రిక్స్‌ను మరింత బలమైన అంతర్జాతీయ కూటమిగా తీర్చిదిద్దే వ్యూహంపై ఈ సదస్సులో చర్చ జరిపే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఐదు దేశాలు ఇందులో సభ్యత్వం కలిగివున్నప్పటికీ దీన్ని మరింతగా విస్తరించాలన్న అంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది. పలు వర్ధమాన దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ అంతర్జాతీయ చెల్లుబాటును మరింతగా పెంపొందించాలన్నది తాజా ఆలోచనగా కనిపిస్తోంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా ఎవరిని ఆహ్వానించబోతోందన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఈ కూటమిలో పరస్పర సహకారం ఈ ఐదు దేశాలకే పరిమితం కాకూడదన్న అభిప్రాయాన్ని ఇప్పటికే చైనా అందించింది. మిగతా ప్రాంతీయ కూటముల మాదిరిగానే ‘బ్రిక్స్ ప్లస్’గా దీన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనకు మిగతా సభ్య దేశాలనుంచి కూడా సానుకూల స్పందనే రావడంతో ఈ తాజా సదస్సులోనే ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ద్వారా అనేక వెనుకబడిన, వర్ధమాన దేశాలకు ప్రపంచబ్యాంక్ ఐఎంఎఫ్ తరహాలో నిధులు అందిస్తున్న ఈ కూటమి ఆ స్థాయిని మరింతగా పెంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. బ్రిక్స్ ఎంతగా బలపడితే అంతగానూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ గ్లోబల్ గవర్నెన్స్‌లోనూ క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. అందుకు కారణం 2016 ప్రపంచ ఆర్థిక లెక్కలను తీస్తే 23 శాతం వాటా ఈ ఐదు దేశాలదే. గత పదేళ్ల లెక్కలను తీసుకున్నా సగానికి పైగా ప్రపంచ వృద్ధిలో ఈ ఐదు దేశాల వాటా సగానికి పైగా ఉంది. పరస్పరం సహకరించుకోవడం, ద్వైపాక్షిక అభివృద్ధికి చేయూతనిచ్చుకోవడంతో పాటు ఈ ఐదు దేశాలూ ఉమ్మడిగా అనేక అంతర్జాతీయ అంశాలపైనా గళాన్ని విప్పే అవకాశాన్ని, హక్కును సంతరించుకున్నాయి. ఇప్పటివరకు కూడా అంతర్జాతీయ వేదికలపై వర్ధమాన దేశాల స్థితిగతుల గురించి గట్టిగా ప్రస్తావించే కూటమి అంటూ లేకపోయింది. బ్రిక్స్ అన్నది ప్రాంతీయ కూటమే అయినా దీనికి అంతర్జాతీయ స్వభావం ఉండటం వల్ల వర్ధమాన దేశాల తరపున చాలా బలంగానే వాదించగలిగింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్ వ్యూహాలపైనే కాకుండా అంతర్జాతీయంగా అది నిర్వహించే కీలక భూమికపైనా ఉత్కంఠ నెలకొంది.

బి.రాజేశ్వర ప్రసాద్