స్పాట్ లైట్

చైనా మరో కుతంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విసిరే ఆధిపత్య పాచికలు, అంతర్జాతీయంగా తన పట్టును పెంచుకోవడానికి అనుసరించే వ్యూహాలను వంటపట్టించుకోవడం అనేది అంత తేలికైన పనికాదు. ఆయన ఎప్పుడు ఏ అడుగు వేస్తారో తన ఆధిపత్య లక్ష్యాలను సాధించుకోవడానికి ఎలాంటి యుక్తులు, కుయుక్తులు పన్నుతారో అంతుబట్టని వ్యవహారమే. ఒకపక్క దక్షిణ చైనా మహాసముద్రంపై ఎప్పటికప్పుడు పట్టును బిగిస్తూ ఇతర దేశాల నౌకల రాకపోకలను నిరోధిస్తూ వచ్చిన జిన్‌పింగ్ ఇప్పుడు ఏకంగా హిందూ మహాసముద్రంపైనే కనే్నశారా? తన ఆర్థిక రాజకీయ ప్రభావశీలతను విస్తరించుకునే క్రమంలో ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటున్న చైనా నాయకత్వం దానికి అనుగుణంగానే తన సైనిక సత్తాను ఇప్పటికే చాటుకుంది. ప్రపంచంలో అజేయమైన సైనిక శక్తిగా ఇటీవలే పిఎల్‌ఏ విన్యాసాలు నిర్వహించిన చైనా దాదాపు అన్ని సముద్ర వాణిజ్య మార్గాలపై పట్టును బిగిస్తోందని చెప్పడానికి హిందూ మహాసముద్రానికి సంబంధించి తాజాగా అందించిన సంకేతాలే నిదర్శనం. ఈ మహాసముద్ర ప్రాంత భద్రతను సంయుక్తంగా నిర్వహించుకుందామంటూ భారత్‌కు చైనా చేసిన ప్రతిపాదనను అంతేతేలిగ్గా ఆమోదించడానికి వీలులేదు. ఎందుకంటే చైనా ఒక అడుగు వేస్తే దానివెనుక ఎన్నో వ్యూహాలు, కుట్రలు కుతంత్రాలు ఉంటాయన్నది ఇప్పటివరకూ మన కళ్లకు కట్టిన వాస్తవం. ముఖ్యంగా భారత్‌కు సంబంధించినంత వరకూ చైనా చేసే ఏ ప్రతిపాదననూ పూర్తిస్థాయిలో విశ్వసించడానికి వీలులేదు. 1960 తొలి దశకంగా జరిగిన యుద్ధం నుంచి నేడు అంతర్జాతీయంగా భారత్ ప్రయత్నాలను, ఎదుగుదలను అడుగడుగున్నా అడ్డుకొడుతున్న తీరు వరకూ చైనా అనేక కోణాల్లో తన దుర్నీతిని చాటుకుంది. భారత్ కంటే ఎన్నో రెట్లు ఆర్థికంగా, రాజకీయంగా, జనాభా పరంగా పెద్దదేశం అయినప్పటికీ తన పెత్తందారీ ధోరణికి అవరోధంగా ఎదుగుతున్న భారత్ అంటే డ్రాగన్‌కు ఎప్పుడూ మంటే. అందుకే ప్రాంతీయంగా ఇటు పాకిస్తాన్‌ను, అటు బంగ్లాదేశ్‌ను వెనకేసుకొస్తూ భారత్‌కు బలమైన మిత్రదేశాలుగా ఉన్న శ్రీలంక, భూటాన్, టిబెట్ వంటి వాటిని తనవైపు తిప్పుకునేందుకు చైనా చేయని ప్రయత్నం లేదు. అయితే ఆధిపత్యం లేదా సయోధ్య పేరిట మరో తంత్రమే చైనాకు తెలిసిన రాజకీయం. ఇప్పుడు హిందూ మహాసముద్ర రక్షణ విషయంలో కలిసి పనిచేద్దాం అన్న దాని ప్రతిపాదన వెనుక కూడా ఏదో వ్యూహం ఉండి ఉంటుందన్నది వాస్తవం. ముఖ్యంగా అంతర్జాతీయంగా చైనా నౌకాదళం విస్తరిస్తున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర రక్షణ అంశాన్ని కూడా ఆ దేశ సీనియర్ సైనిక నేత లియాన్ ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సముద్ర దొంగల దాడులను నిరోధించడానికే తమ నౌకాదళ విస్తరణ ఉద్దేశించిందని చైనా చెబుతున్నప్పటికీ దీని వెనుక కచ్చితంగా వాణిజ్య మార్గాలన్నింటినీ గుప్పిట పట్టాలన్న ఆలోచనే ఉండి ఉంటుందన్నది విస్మరించలేని వాస్తవం. ముఖ్యం సముద్ర వాణిజ్యపరంగా భారత్‌ను అన్ని విధాలుగా చుట్టుముట్టాలన్నది దీనివెనుక ఆలోచనగా చెబుతున్నారు. హిందూ మహాసముద్ర రక్షణ బాధ్యత విషయంలో చైనాను ముందుకు వెళ్లనిస్తే, అది కచ్చితంగా ఇరుగు పొరుగు దేశాలన్నింటినీ ఆర్థికంగా, రాజకీయంగా మింగేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ లక్ష్యం వెనకున్న ఉదాత్త ఆశయాలను చైనా ఎంత ఘనంగా చెప్పుకుంటున్నా ఆచరణలో అవి సంకుచితమే అవుతాయన్నది భారత్‌కు ఎన్నో సందర్భాల్లో తెలిసిన చేదు నిజం. ఎక్కడికక్కడ అమెరికా తరహాలో నౌకాదళాలను ఏర్పరచుకోవాలన్న వ్యూహంలో భాగంగానే చైనా తాజాగా పావులు కదుపుతోంది. అందుకే తన నౌకాదళ ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు విస్తరించుకుంటోంది. ముఖ్యంగా నౌకాదళ క్షిపణి శక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది కూడా అంతర్జాతీయ ఆధిపత్యం దిశగా వేసే అడుగుగానే భావించాల్సి ఉంటుంది. అమెరికా తర్వాత అంత భారీ స్థాయిలో రక్షణకు నిధులు కల్పిస్తున్న ఏకైక దేశం చైనా. ఇప్పటికే సౌత్ సీ ఫ్లీట్ దళాన్ని ఏర్పరచుకున్న చైనా దక్షిణ చైనా మహాసముద్ర వనరులన్నింటినీ గుప్పిట పట్టాలని భావిస్తోంది. ఈ సముద్ర జలాలకు సంబంధించి వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి చైనా ఎదుర్కొంటోంది. అంతేకాదు, ఈ ప్రాంతంలో అనేక కృత్రిమ దీవులను ఏర్పరచుకుని వాటి పేరిట ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. సముద్ర మార్గాలను ఎంతగా తన అధీనంలోకి తెచ్చుకుంటే అంతగానూ ప్రపంచ ఆధిపత్యాన్ని సునాయాసంగా సాధించవచ్చునన్న చైనా లక్ష్యానికి భారత్ ప్రబలమైన ప్రతికూల శక్తిగా మారింది. ఎందుకంటే డ్రాగన్‌ను ఏమాత్రం ముందుకు వెళ్లనిచ్చినా అది భారతదేశ వ్యూహాత్మక, వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అవకాశం ఇవ్వడమే అవుతుంది.

చిత్రాలు.. నమీబియాలో చైనా నౌకా కేంద్రం. ఇన్‌సెట్‌లో జిన్‌పింగ్,